‘పెద్దలపై’ పిడుగు

ABN , First Publish Date - 2021-07-31T06:59:36+05:30 IST

జిల్లా సరిహద్దులోని లేటరైట్‌ మాఫియాకు ఎన్జీటీ షాక్‌ ఇచ్చింది. అధికారం అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించిన వైనంపై కన్నెర్ర చేసింది.

‘పెద్దలపై’ పిడుగు
లేటరైట్‌ కోసం రిజర్వు ఫారెస్టును ధ్వంసం చేసి నిర్మించిన రహదారి

  • జిల్లా సరిహద్దులోని లేటరైట్‌ మాఫియాపై ఎన్జీటీ పిడుగు
  • రౌతులపూడిలో రిజర్వు ఫారెస్ట్‌ను చీల్చి, వేల చెట్లను తెగనరకడంపై ఆగ్రహం
  • ఖనిజ రవాణాకు అటవీ చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన రోడ్డుపైనా అభ్యంతరం
  • అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై కఠిన చర్యలకు ఆదేశాలు
  • జరిగిన విధ్వంసానికి నష్టపరిహారం వసూలు చేయాలని సుస్పష్టం
  • అక్రమ రోడ్డు నిర్మాణంపై సమగ్ర నివేదిక అందించాలంటూ ప్రత్యేక కమిటీ ఏర్పాటు
  • ఎన్జీటీ జోక్యంతో జిల్లా అటవీశాఖతోపాటు, డీఎల్‌సీలోను గుబులు

జిల్లా సరిహద్దులోని లేటరైట్‌ మాఫియాకు ఎన్జీటీ షాక్‌ ఇచ్చింది. అధికారం అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించిన వైనంపై కన్నెర్ర చేసింది. ప్రభుత్వపెద్దలు చెప్పినదానికి తలాడిస్తూ నిబంధనలకు తూట్లు పొడిచిన అధికారులపై ఉచ్చుబిగించింది. అటవీ చట్టాలను తుంగలోకి తొక్కిన తీరుపై విచారణకు ఆదేశించింది. రిజర్వు ఫారెస్టును చీల్చి రౌతులపూడి మండలంలో నిర్మించిన రహదారి పూర్తిగా అక్రమమేనని సుస్పష్టం చేసింది.గిరిజనుల ముసుగులో నిర్మించిన రహదారి ఏమాత్రం సమ్మతం కాదని తేల్చిచెప్పింది. మన్యంలో మైనింగ్‌ మాఫియా, అక్రమ రహదారి నిర్మాణంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నివేదిక అందించాలని ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. తాజా తీర్పుతో గత కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, బదిలీ అయిన డీఎఫ్‌వో సునీల్‌కుమార్‌ల పాత్రపైనా విచారణ జరగనుంది. 


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

సుందరకోట పంచాయతీ భమిడికలొద్ది వద్ద 121 హెక్టార్లలో లేటరైట్‌ మైనింగ్‌ కు గతంలో లీజులు పొందిన వ్యక్తిని అధికార పార్టీ ముఖ్య నేతలు తమ దారికి తెచ్చుకుని జూన్‌ నెలలో లేటరైట్‌ తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు... తవ్విన ఖనిజాన్ని కడపలో కీలక నేత సిమెంట్‌ ఫ్యాక్టరీకి తరలించడం కోసం భమిడికలొద్ది లేటరైట్‌ క్వారీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం జల్దాం వరకు 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి ఈ ఏడాది ఆరంభంలో స్కెచ్‌ గీశారు. ప్రభుత్వ పెద్దల తరఫున ఓ ప్రముఖ ఆలయ మాజీ చైర్మన్‌ తనయుడు స్వయంగా రంగంలోకి దిగి తూర్పుగోదావరి జిల్లాలోనే మకాం వేసి అంతా తానై ఈ వ్యవహారం నడిపించారు. లేటరైట్‌ కోసమే ఈ రోడ్డు నిర్మిస్తే అనుమానాలు వస్తాయనే కారణంతో స్థానిక గిరిజనులు జల్దాం, చల్లూరు, దబ్బాది గ్రామాల మీదుగా నాతవరం వెళ్లడానికి ఉపయోగపడుతుందనే సాకు తెరపైకి తెచ్చి వీరి కోసం ప్రభుత్వ పెద్దలు రూ.30 లక్షలతో రహదారి మంజూరు చేయించారు. తీరా రోడ్డును ఓ కాంట్రాక్టరుతో వేయించారు. భారీ యంత్రాలు, పేలుడు పదార్థాలు వాడి 30 అడుగులకు మించిన దారివేసేశారు. మొత్తం పన్నెం డు కిలోమీటర్ల రహదారిలో భాగంగా చెల్లూరు-భమిడికలొద్ది మధ్యనున్న అయిదు కిలోమీటర్ల పరిధిలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ను కూడా ధ్వంసం చేశారు. అటవీ శాఖ అనుమతులు లేకుండా రహదారికోసం అడ్డంగా ఉన్న టేకు, దండారి, నల్లమద్ది, తెల్లమద్ది, తుమ్మిడి, తెల్లగర్ర వంటి విలువైన మూడు వేల వరకు భారీ వృక్షాలను నేలకూల్చేశారు. ఆనవాళ్లు దొరకకుండా దుంగలుగా మార్చి వేరేచోటకు తరలించారు. రిజర్వు ఫారెస్ట్‌లోని వన్యప్రాణులను మట్టుబెట్టారు. సహజసిద్ధ సెలయేర్ల ను దారి మళ్లించేశారు. 250 మంది జనాభా కూడా లేని గిరిజన గ్రామాల మధ్య ఈ భారీ రహదారి కేవలం లేటరైట్‌ తరలింపు కోసమేనన్న విషయం ‘ఆంధ్రజ్యోతి’ ఆధారసహితంగా జూలై 2న ప్రధాన సంచికలో ‘పచ్చని చెట్టు.. గొడ్డలి పెట్టు’ అంటూ బయటపెట్టింది. దీనిపై ప్రతిపక్ష టీడీపీ క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లి అడ్డగోలుగా రహదారిని నిర్మించింది వాస్తవమేనని నిర్ధారించింది. అటు గిరిజనులు సైతం ప్రభుత్వ పెద్దల లేటరైట్‌ రోడ్డుపై ఫిర్యాదుచేశారు. మరోపక్క నాతవరం మండలం గునుపూడికి చెందిన మరిడయ్య జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)ను ఆశ్రయించారు. లేటరైట్‌ అక్రమాలపై ఆధారాలతోసహా ఫిర్యాదులో వివరించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ తాజాగా శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ పెద్దలకు షాక్‌ తగిలేలా ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటుచేస్తూ ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణలో భాగంగా విశాఖలోని భమిడికలొద్దితోపాటు తూర్పుగోదావరి సరిహద్దు వరకు అక్రమ మైనింగ్‌ జరుగుతున్నట్టు పేర్కొంది. రౌతులపూడి మీదు గా రిజర్వు ఫారెస్టులో నిర్మించిన రహదారి అటవీ చట్టాలను ఉల్లంఘించి నిర్మించిందేనని స్పష్టం చేసింది. ఈ అక్రమాలకు సహకరించిన అధికారులపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జరిగిన పర్యావరణ నష్టంపై వారి నుంచే పరిహారం వసూలు చేయాలని పేర్కొంది. మైనింగ్‌ అక్రమాలు, రహదారి నిర్మాణంపై దర్యాప్తు చేపట్టడం కోసం కేంద్ర అటవీశాఖ, రాష్ట్ర గనులశాఖ, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, విశాఖ కలెక్టర్‌ తదితర అధికారులను ఈ కమిటీలో నియమించింది. అక్రమాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొం ది. కాగా తాజా ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో జిల్లా అటవీశాఖలో కలకలం రేగుతోంది. అసలు రిజర్వుఫారెస్టులో రహదారి నిర్మాణానికి అనుమతులు తిరస్కరిస్తూ నివేదిక ఇచ్చినా ఆ తర్వాత ప్రభు త్వ పెద్దల ఆదేశాలతో తలవంచడంతో ఇప్పుడు తాము ఇరుక్కుపోతామని కొందరు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యం గా జిల్లా అటవీశాఖ అధికారి సునీల్‌కుమార్‌పైనా ఉచ్చు బిగుసుకోనుంది. డీఎఫ్‌వో హోదాలో రిజర్వుఫారెస్టులో రహదారి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడు ఈయన్ను బాధ్యులు చేసే అవకాశం ఉంది. ఈ రహదారి నిర్మాణానికి వేగంగా అనుమతు లు ఇవ్వకుండా సతాయించారనే కారణంతో ఇప్పటికే ప్రభుత్వం డీఎఫ్‌వో సునీల్‌కుమార్‌ బదిలీచేసింది. అటు జిల్లా స్థాయి కమిటీ హోదాలో కలెక్టర్‌ సైతం రహదారి నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చిన వైనంపై ఆయన పాత్ర కూడా బయటపడే అవకాశం ఉంది. కాగా కాకినాడలో పేదల ఇళ్లస్థలాల ముసుగులో మడ అడవులను ధ్వంసం చేసిన తీరుపైనా ఇప్పటికే ఎన్జీటీ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు మైనింగ్‌ అక్రమాలపై అధికారుల పాత్రపై మరోసారి విచారణ జరగనుండడం విశేషం.

Updated Date - 2021-07-31T06:59:36+05:30 IST