ముగిసిన ఉపసంహరణ.. ఇక ప్రచార హోరు

ABN , First Publish Date - 2020-11-23T05:37:57+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రకియ ముగియడంతో సోమవారం నుంచి ప్రచారం ఊపందుకోనున్నది.

ముగిసిన ఉపసంహరణ.. ఇక ప్రచార హోరు

ప్రచారానికి మిగిలింది వారం రోజులే 

ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు 

వ్యూహాత్మకంగా ముందుకెళుతున్న గులాబీ దళం

నేటి నుంచి ప్రచార క్షేత్రంలోకి ప్రధాన పార్టీల నాయకులు


పటాన్‌చెరు, నవంబరు 22 : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రకియ ముగియడంతో సోమవారం నుంచి ప్రచారం ఊపందుకోనున్నది. మినీ భారతంగా పిలవబడే పారిశ్రామిక క్షేత్రమైన పటాన్‌చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లు ప్రధాన పార్టీలకు అత్యంత ప్రాధాన్యంగా మారాయి. కార్మిక క్షేత్రంలో తమ పట్టును నిలుపుకునేందుకు పార్టీలు కార్పొరేషన్‌ ఎన్నికలను అవకాశంగా తీసుకుని సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు సమరోత్సాహం చూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీలు బలమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. నియోజకవర్గంలోని రామచంద్రాపురం, భారతీనగర్‌, పటాన్‌చెరు డివిజన్లను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.  


టీఆర్‌ఎస్‌కు గ్రేటర్‌ సవాలు

దుబ్బాక ఉప ఎన్నికల తరువాత వస్తున్న గ్రేటర్‌ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సవాలుగా తీసుకోగా ఈ మూడు డివిజన్లకు ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి హరీశ్‌రావు వ్యవహరిస్తుండటంతో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌, మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, సత్యనారాయణ ఒక్కో డివిజన్‌లో సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి అన్నీ తామై మూడు డివిజన్లలో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను భుజాన వేసుకున్నారు. నేరుగా మంత్రి రంగప్రవేశం చేసి అసంతృప్తులను శాంతింపజేసి సొంత పార్టీ నుంచి రెబల్‌ బెడద లేకుండా చేశారు. పటాన్‌చెరులో టికెట్‌ ఆశించిన దేవేందర్‌రాజు, నర్రా భిక్షపతి, యాదగిరియాదవ్‌లకు నచ్చజెప్పి పార్టీ నిర్ణయించిన అభ్యర్థి మెట్టుకుమార్‌ గెలుపునకు కృషి చేయాలని ఇచ్చిన ఆదేశాలు ఫలించాయి. రామచంద్రాపురం డివిజన్‌లో టికెట్‌ దక్కని తొంట అంజయ్య బీజేపీలో చేరడంతో నచ్చజెప్పి సాయంత్రానికే మళ్లీ టీఆర్‌ఎస్‌ గూటికి వచ్చేలా చేసి ముఖ్య నాయకులు చీలకుండా చూడడంలో సఫలీకృతమయ్యారు. ఇక భారతీనగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వీ.సింధుకు మద్దతుగా పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకుని మద్దతు పలికారు. 


బలమైన అభ్యర్థులతో రంగంలోకి బీజేపీ

అధికార పార్టీ టీఆర్‌ఎ్‌సకు ధీటుగా బీజేపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. పటాన్‌చెరు డివిజన్‌లో గెలుపే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ తనయుడు ఆశి్‌షగౌడ్‌కు టిక్కెట్‌ కేటాయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందే ఆయన ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. రామచంద్రాపురం డివిజన్‌లో స్వంతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన టీఆర్‌ఎస్‌ నాయకుడు నర్సింగ్‌గౌడ్‌ను పార్టీలో చేర్చుకుని బీజేపీ బీఫారం ఇవ్వడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి గోదావరిఅంజిరెడ్డి బీజేపీలో చేరి భారతీనగర్‌ నుంచి బరిలో దిగడం ప్రాధాన్యం సంతరించుకున్నది. 


గట్టి పోటీదారులతో రేసులోకి కాంగ్రెస్‌

రామచంద్రాపురం డివిజన్‌లో యువజన కాంగ్రెస్‌ నాయకుడు మవీన్‌గౌడ్‌ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. పటాన్‌చెరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రచారం చేసుకన్న ఆర్‌.కుమార్‌గౌడ్‌ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవడంతో బండ్లగూడ మాజీ సర్పంచ్‌ మత్యాలు జయమ్మకు బీఫాం అందజేశారు. భారతీనగర్‌ నుంచి పటోళ్ల మాధవీలతను బరిలో నిలిపారు. వారికి అండగా మాజీ కార్పొరేటర్లు సపానాదేవ్‌, శంకర్‌యాదవ్‌, కాంగ్రెస్‌ పార్లమెంట్‌, అసెంబ్లీ ఇన్‌చార్జిలు గాలిఅనిల్‌కుమార్‌, కాట శ్రీనివా్‌సగౌడ్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కాట సుధారాణి ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 


సత్తా చాటేందుకు బరిలో టీడీపీ

ఇతర రాష్ట్రాల ఓటర్లతో పాటు ఆంధ్ర ఓటర్లు కీలకంగా ఉండే ఈ మూడు డివిజన్ల నుంచి టీడీపీ తమ అభ్యర్థులను నిలబబెట్టడం గమనార్హం. పటాన్‌చెరు నుంచి జనంపల్లి కమల్‌, రామచంద్రాపురం నుంచి న్యాయవాది పెద్దిగారిపద్మజ, భారతీనగర్‌ నుంచి చుండూరి మమతలను బరిలో నిలిపారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎడ్ల రమేశ్‌ ఈ డివిజన్లలో పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సమరోత్సాహాన్ని చూపిస్తున్నాయి.


నేటి నుంచి ఊపందుకోనున్న ప్రచారం 

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ఇక ప్రచారంపై దృష్టి సారించారు. పోలింగ్‌ తేదీ డిసెంబరు 1 కాగా ప్రచారానికి ఇంకా వారం రోజుల గడువు మాత్రమే ఉంది. తక్కువ సమయం ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నాయి. నేటి నుంచి అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలోకి దిగనున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మంత్రి సుడిగాలి పర్యటనలు చేస్తూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించి పలు సూచనలు చేశారు. బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున సంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలు ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-11-23T05:37:57+05:30 IST