Abn logo
Mar 31 2021 @ 00:20AM

ఎన్నికల ‘చిత్రాలు’

ఆశ్చర్యకరమైన ప్రకటనలు, అనూహ్యమైన ఉటంకింపులు ఎన్నికల సమయంలో కాక  మరెప్పుడు వినగలం? మంగళవారంనాడు కేరళలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటూ ధనప్రలోభంతో క్రీస్తును అప్పగించిన యూదా బైబిల్ ఉదంతాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. సాధారణంగా ఇతర మతాల నుంచి ఎటువంటి ప్రస్తావనలూ ఆయన తీసుకురారు. బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రమేయంపై వస్తున్న ఆరోపణలను, యూదా ద్రోహంతో నరేంద్రమోదీ పోల్చారు. కేరళ జనాభాలో గణనీయమైన సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు కాబట్టి, ఆ మతస్థులలో ఉన్న మిత్రభేదాన్ని ఆలంబన చేసుకుని కొన్ని ఓట్లను సంపాదించుకోవాలని బిజెపి భావిస్తున్నది కాబట్టి, మోదీ బైబిల్ ఉటంకింపును అర్థం చేసుకోవచ్చు. అందులో సిద్ధాంతాన్ని వదులుకున్నది కూడా పెద్దగా ఏమీ లేదు. కానీ, పశుమాంసం గురించి, గోవధ నిషేధం గురించి కేరళలో ఆ పార్టీ కిమ్మనకపోవడమేమిటని అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కేరళలోనే కాదు, అస్సాంలోనూ ఆ అంశాలపై బిజెపి పెద్దగా పట్టింపు చూపడంలేదు. గతంలో గోవాలో కూడా సిద్ధాంతాలకు సడలింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. 


అయితే, తమిళనాడులో మాత్రం పశుమాంసం, గోవధ వంటి అంశాలపై తమ వైఖరికే బిజెపి నిలబడింది. అంటే, ఆ రాష్ట్రంలో బిజెపి పోటీ పూర్తిగా లాంఛనప్రాయం. అన్నాడిఎంకె కూటమి 2019 పార్లమెంటు ఎన్నికలలో 39లో ఒకే ఒక్క స్థానాన్ని సంపాదించుకుని చతికిలపడిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలలో ఉభయపక్షాల మధ్య పొత్తు అన్నది రాక్షస వివాహం పద్ధతిలో జరిగిందేతప్ప స్వచ్ఛందమైనది కాదని గిట్టని విమర్శకులు వ్యాఖ్యానించారు కానీ, స్వతంత్రంగా వ్యవహరించలేని లక్షణం వల్లనే, జయలలిత మరణించిన తరువాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం ద్వయం అధికారంలో కొనసాగగలిగారు అన్నది అందరికీ తెలిసిందే. బిజెపితో పొత్తు వల్ల ఓట్లు కోత పడడమే తప్ప లాభం ఏమీ లేదని ఆ జంటకు తెలుసును. అందుకే, ఎన్నికల మాటలు వచ్చిన కొత్తలో బిజెపిని ఎడం పెట్టడానికి ప్రయత్నించారు. అయితే, ఈ మధ్య కాలంలో బిజెపి ఓట్ల బలం కొంత పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో 2.86 శాతం అని గుర్తించిన ఓట్లు ఇప్పుడు 5.-6 శాతం దాకా చేరాయట. అయితే, ఆ ఓట్లు అన్నాడిఎంకె ఓటుబ్యాంకు నుంచి మళ్లినవే తప్ప, ఇతర పార్టీలనుంచి వచ్చినవి కావు. మరో వైపు బిజెపి స్నేహం వల్ల మైనారిటీలు పూర్తిగా అన్నా డిఎంకెకు విముఖులయ్యారు. తమిళనాడులో మైనారిటీలందరు కలిసి 10 శాతం దాకా ఉంటారు. బిజెపి రంగంలో లేని రోజుల్లో డిఎంకె, అన్నా డిఎంకె మధ్య వారి ఓట్లు చీలిపోయేవి. జయలలితను ముస్లిములలో, క్రైస్తవులలో ముఖ్యంగా మహిళలు అభిమానించేవారు. బిజెపి పొత్తు కారణంగా పోయిన మైనారిటీ ఓట్లను, బిజెపికి పెరిగిన ఓట్ల ద్వారా భర్తీ చేసుకోవచ్చునని అన్నా డిఎంకె ఆలోచనగా ఉన్నది. తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని, ఒక్క స్థానం కూడా సొంతంగా గెలవలేనని తెలిసి కూడా బిజెపి తమిళనాడులో అన్నాడిఎంకె కూటమిలో అధికారిక భాగస్వామి ఎందుకు అయింది? కేంద్రంలో ఎన్‌డిఎలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో విడిగా ఉండవచ్చు. పొత్తుకు ప్రచారంలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండవచ్చు. అట్లా కాక, తనను తాను రంగంలో బాహాటంగా నిలుపుకోవడానికే బిజెపి ఇష్టపడింది. అంటే, అస్సాంలోనో, కేరళలోనో, గోవాలోనో అనుసరించినట్టు కాకుండా, తమిళనాడులో హిందూత్వ వైఖరిని పూర్తిస్థాయిలో అనుసరించాలనే బిజెపి భావిస్తోందన్న మాట. ద్రవిడ రాజకీయాలకు మూలపురుషుడు అనదగ్గ పెరియార్‌ రామస్వామి నాయకర్‌‌పై రెండేళ్ల కిందట బిజెపి రాష్ట్ర నేతల నిందలను, ఆయన విగ్రహాలపై చేసిన దాడులను  ఈ సందర్భంగా గుర్తుతెచ్చుకోవచ్చు. తమిళనాడును ద్రావిడ, సామాజిక న్యాయ రాజకీయాల నుంచి పూర్తిగా విముక్తం చేయడమే బిజెపి లక్ష్యం. దానిని సాధించడం కోసం దీర్ఘకాలం నిరీక్షించడానికైనా, మరో పక్షం నీడలో ఉండడానికైనా సిద్ధం. కేరళలో కూడా అధికారానికి చేరువ కావడం అంత తొందరగా సాధ్యపడదని బిజెపికి తెలుసు. 


సిద్ధాంతాల విషయంలో తమిళనాడులో తాను సొంతంగా రాజీపడకపోయినా, మిత్రపక్షం అన్నా డిఎంకె ద్వారా బిజెపి ఆ పని చేయిస్తోంది. పౌరసత్వ చట్టం వెనక్కు తీసుకునేట్టు తాము ఒత్తిడి తెస్తామని అన్నాడిఎంకె చెబుతోంది. దూరమైన మైనారిటీ  ఓట్లను వెనక్కి రప్పించడం ఆ వాగ్దానం ఉద్దేశ్యంకావచ్చు. అయితే, పార్లమెంటులో సమర్థించి, రాష్ట్ర అసెంబ్లీలో పౌరసత్వచట్టం వ్యతిరేకులను సవాల్ చేసిన అన్నా డిఎంకె ప్రభుత్వ పెద్దలు రేపు ఆ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తారని ఎవరు నమ్ముతారు? అన్నా డిఎంకె కొన్ని అంశాలలో ద్రవిడ విధానాలను ఇంకా పాటిస్తుంది. హిందీ భాషను రుద్దే ప్రయత్నాన్ని అది వ్యతిరేకిస్తుంది. తమిళభాష ప్రతిపత్తిని గౌరవించే చర్యలు తీసుకుంటుంది. హిందీని తిరిగి నిర్బంధం చేసే ప్రయత్నాల గురించి వార్తలు రాగానే తమిళనాడు ప్రభుత్వ పెద్దలు వెంటనే ఖండించారు. ఇప్పుడు కొత్తగా ద్రవిడ పార్టీలు పోటాపోటీగా ముందుకు తెస్తున్న అంశం, శ్రీలంకలో తమిళులపై  జరిగిన ఊచకోతపై అంతర్జాతీయ విచారణకు భారతదేశం పట్టుబట్టాలనేది. గత ఆరు సంవత్సరాలుగా కేంద్రప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడులను తట్టుకోవడానికి అధికార, ప్రతిపక్షాలు రెండూ అనేక మార్లు ద్రవిడ అస్తిత్వాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఝళిపించవలసి వచ్చింది. రాజకీయంగా మాత్రం అధికారపక్షం కేంద్రప్రభుత్వం భయం నీడలోనే కాలం గడిపిందని చెప్పాలి. 


ఈ ఎన్నికల ఫలితాల అనంతరం తమిళ రాజకీయాలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటాయా, మరింతగా బలహీనపడతాయా అన్నది తేలుతుంది.