Madrass High Courtను ఆశ్రయించిన ఎన్నికల కమిషన్

ABN , First Publish Date - 2021-04-30T17:25:53+05:30 IST

న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలను ప్రచురించడాన్ని నిలువరించాలని

Madrass High Courtను ఆశ్రయించిన ఎన్నికల కమిషన్

న్యూఢిల్లీ : న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలను ప్రచురించడాన్ని నిలువరించాలని ఎన్నికల కమిషన్ మద్రాస్ హైకోర్టును కోరింది. కేవలం ఆర్డర్లు లేదా తీర్పుల్లో చేసే వ్యాఖ్యలను మాత్రమే ప్రచురణ, ప్రసారం చేసేవిధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. తమిళనాడులో ఓట్ల లెక్కింపు సందర్భంగా పాటించవలసిన కోవిడ్-19 మార్గదర్శకాలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే మౌఖిక వ్యాఖ్యలను రిపోర్టింగ్ చేయడంలో సంయమనం పాటించాలని మీడియా సంస్థలను ఆదేశించాలని కోరింది. ఈ మేరకు తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సత్యబ్రత సాహూ ఓ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. 


పెద్ద ఎత్తున రాజకీయ సభలు జరగకుండా నిరోధించలేకపోయినందుకు తనపై (ఎన్నికల కమిషన్‌పై) హత్య కేసు నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను వార్తా మాధ్యమాలు ప్రచురించి, ప్రసారం చేయడం పట్ల ఎన్నికల కమిషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికలను నిర్వహించవలసిన రాజ్యాంగ విధి తనకు ఉందని తెలిపింది. ఎన్నికల కమిషన్ అంటే స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ అని వివరించింది. ఎన్నికల ప్రచార సభలు పెద్ద ఎత్తున జరగడానికి, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి తనను మాత్రమే బాధ్యురాలిని చేసి, హత్యారోపణలతో తనపై కేసు నమోదు చేయాలని హైకోర్టు పేర్కొన్నట్లు వచ్చిన మీడియా కథనాలు స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ అయిన తన ప్రతిష్ఠను దెబ్బతీసినట్లు వివరించింది. 


హైకోర్టు వ్యాఖ్యలపై మీడియా కథనాలను చూసిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఓ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆయన హత్యా నేరానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈ ఫిర్యాదు దాఖలైందని ఎన్నికల కమిషన్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ తీసుకున్న కోవిడ్ సంబంధిత చర్యల పట్ల  కలకత్తా, కేరళ హైకోర్టులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎన్నికలను ప్రకటించేనాటికి కోవిడ్ కేసులు తక్కువగా ఉండేవని పేర్కొంది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 4 మధ్య కాలంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు, ఎన్నికలు జరగని రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించినపుడు, కేవలం  ఎన్నికల ప్రచారం మాత్రమే కోవిడ్ విజృంభణకు కారణమని వెల్లడి కాలేదని పేర్కొంది. కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలలో ఎన్నికలు జరగడం లేదని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనానికి కేవలం తనదే బాధ్యత అని చెప్పడం సాధ్యం కాదని పేర్కొంది. ఏ విధంగానూ హత్యా నేరాన్ని ఎన్నికల కమిషన్ అధికారులపై లేదా ఎన్నికల కమిషన్‌పై మోపడం సాధ్యం కాదని పేర్కొంది. న్యాయమూర్తులు తమ తీర్పుల ద్వారా మాత్రమే మాట్లాడాలనేది ఆంగ్లో-శాక్సన్ న్యాయశాస్త్ర ప్రాథమిక సూత్రమని వివరించింది. 


ఎన్నికల కమిషన్‌పై మద్రాస్ హైకోర్టు సోమవారం చేసిన వ్యాఖ్యలేమిటంటే, ‘‘కోవిడ్-19 రెండో ప్రభంజనానికి కేవలం మీ వ్యవస్థే బాధ్యురాలు. హత్యా నేరాన్ని ఆరోపిస్తూ మీ అధికారులపై కేసులు నమోదు చేయాలి బహుశా. ఎన్నికల ప్రచార సభలు జరిగినపుడు మీరంతా వేరొక గ్రహం మీద ఉన్నారా?’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ వ్యాఖ్యలు హైకోర్టు ఆర్డర్‌లో లేవు. కోవిడ్-19 మహమ్మారి మరింత విజృంభించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్ల లెక్కింపు కారణం కాకూడదని ఆర్డర్‌లో పేర్కొంది. 



Updated Date - 2021-04-30T17:25:53+05:30 IST