‘సాగర్‌’లో ఎన్నికల కమిషన్‌ విఫలం

ABN , First Publish Date - 2021-04-11T07:58:50+05:30 IST

డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగంతో సాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలిచే ప్రయత్నం చేస్తోందని, వాటిని నిలువరించడంలో ఎన్నికల కమిషన్‌, సిబ్బంది విఫలమయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

‘సాగర్‌’లో ఎన్నికల కమిషన్‌ విఫలం

కోట్లలో డబ్బు, మద్యం పంచుతున్న అధికార పార్టీ: ఉత్తమ్‌

నల్లగొండ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగంతో సాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలిచే ప్రయత్నం చేస్తోందని, వాటిని నిలువరించడంలో ఎన్నికల కమిషన్‌, సిబ్బంది విఫలమయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శనివారం నల్లగొండలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ పరిశీలకుడు చవాన్‌ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. రాబోయే 24గంటల్లో ఎన్నికల కమిషన్‌ సిబ్బంది స్థానికంగా చర్యలు చేపట్టకపోతే ఫొటో, వీడియో ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అధికార టీఆర్‌ఎస్‌ సగం కేబినెట్‌, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు సాగర్‌లో ఉంటూ డబ్బు, మద్యం పంచుతుంటే ఎన్నికల, కొవిడ్‌ నిబంధనలు ఏవీ అమలు చే యకుండా స్థానిక పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. 


సాగర్‌ నియోజకవర్గంలో కోట్ల రూపాయల మద్యం విక్రయిస్తుంటే ఎన్ని కేసులు నమోదు చేశారని ప్రశ్నించారు. వందల మంది అనుచరులు, పదుల సంఖ్య లో వాహనాలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సాగర్‌ నియోజకవర్గంలో విహారం చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర హోంమంత్రుల వాహనాలను ఎందుకు తనిఖీ చేయడం ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు డబ్బు, మద్యం పంచుతుంటే కాంగ్రెస్‌ నేతల ఇళ్లపైనే దాడులు చేస్తున్నారని, తమ పార్టీ నాయకులు వీటికి భయపడరని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎ్‌సను ఓడించకపోతే సాగర్‌ డ్యామ్‌ ఎడారిగా మారుతుందన్నారు. సీఎం కేసీఆర్‌.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో కుమ్మక్కయ్యారని, అందుకే సంగమేశ్వర లిఫ్టు, పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచే పనులు నిరాటంకంగా సాగుతున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా తమ అభ్యర్థి జానారెడ్డి 50వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన తెలిపారు.

Updated Date - 2021-04-11T07:58:50+05:30 IST