Abn logo
Sep 19 2021 @ 08:09AM

AP: ప్రారంభమైన పరిషత్ ఎన్నికల కౌంటింగ్

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రక్రియ 375 స్థానాల్లో నిలిచిపోయింది. కాగా పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 7,220 స్థానాలకుగాను 18,782 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఏప్రిల్‌ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


సర్వం సిద్ధం..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొవిడ్‌ జాగ్రత్తలతో 13 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు నిమిత్తం 209 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ సజావుగా పూర్తి చేయడానికి 11,803 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 32,264 సిబ్బందిని నియమించారు. నిరంత పర్యవేక్షణకు కమిషనరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.