బార్క్‌లే x ఖవాజా

ABN , First Publish Date - 2020-10-20T09:05:16+05:30 IST

ఓవైపు క్రికెట్‌ ప్రపంచమంతా ఐపీఎల్‌ మజాలో మునిగి తేలుతుండగా, మరోవైపు ఐసీసీ చైర్మన్‌ ఎన్నిక హడావుడి మొదలైంది.

బార్క్‌లే x ఖవాజా

ఐసీసీ చైర్మన్‌ బరిలో ఇద్దరే

 ముగిసిన నామినేషన్ల గడువు


ముంబై: ఓవైపు క్రికెట్‌ ప్రపంచమంతా ఐపీఎల్‌ మజాలో మునిగి తేలుతుండగా, మరోవైపు ఐసీసీ చైర్మన్‌ ఎన్నిక హడావుడి మొదలైంది. చాపకింద నీరులా ప్రారంభమైన ఎన్నిక ప్రక్రియకు ఆదివారం నామినేషన్ల గడువు ముగిసింది. న్యూజిలాండ్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ గ్రెగ్‌ బార్క్‌లే, సింగపూర్‌కు చెందిన ఇమ్రాన్‌ ఖవాజా మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.


చైర్మన్‌ ఎన్నిక డిసెంబరులో జరగనుంది. బార్క్‌లే ప్రస్తుతం ఐసీసీలో న్యూజిలాండ్‌ ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు ‘బిగ్‌ త్రీ’ భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డులు మద్దతు ఇస్తున్నాయి. అయితే బార్క్‌లే విజయం సాధించాలంటే.. మొత్తం 16 మంది బోర్డు డైరెక్టర్లలో 2/3 వంతు ఓట్లు సాధించాల్సి ఉంటుంది. అంటే 11 దేశాల ఓట్లను బార్క్‌లే దక్కించుకోవాల్సి ఉంటుంది. 12 పూర్తిస్థాయి సభ్య దేశాలు, మూడు అసోసియేట్‌, ఒక స్వతంత్ర మహిళతో కలిపి ఐసీసీ బోర్డులో మొత్తం 16 మంది డైరెక్టర్లు ఉన్నారు. 


ఖవాజాకు పాక్‌ మద్దతు

అసోసియేట్‌ సభ్య దేశం సింగపూర్‌ నుంచి ఖవాజా ఐసీసీలో ఆ దేశ ప్రతినిధిగా ఉన్నారు. గత జూలైలో శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం ముగిసినప్పటి నుంచి ఆయన ఐసీసీ తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఖవాజాను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సమర్థిస్తోంది. పీసీబీతో పాటు ఐసీసీ స్వతంత్ర డైరెక్టర్‌ ఇంద్రా నూయీ, శ్రీలంక, జింబాబ్వే క్రికెట్‌ బోర్డులు ఇమ్రాన్‌ అభ్యర్థిత్వానికి సై అంటున్నాయి. ఖవాజా గెలవాలంటే ఈ ఐదు ఓట్లు కాకుండా మరో ఆరుగురి మద్దతు పొందాల్సి ఉంటుంది.


పీసీబీలో  ఆందోళన! 

బార్క్‌లే గెలిస్తే ఐసీసీపై మళ్లీ బీసీసీఐ పట్టు పెరుగుతుందేమోనని పాకిస్థాన్‌ ఆందోళన చెందుతోంది. దాంతో ఖవాజాను గెలిపించేందుకు పాక్‌ బోర్డు (పీసీబీ) నడుం బిగించినట్టు సమాచారం. అయితే మరో రెండు అసోసియేట్‌ దేశాలు స్కాట్లాండ్‌, మలేసియా.. ఖవాజాను సమర్థిస్తున్నట్టు మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ఐసీసీ పూర్తిస్థాయి సభ్యదేశాలు మద్దతిస్తున్న బార్క్‌లే..ఏకాభిప్రాయ అభ్యర్థిగా ఎన్నికయ్యే అవకాశాలూ లేకపోలేదు. మొత్తంగా చైర్మన్‌ పదవికి ఎన్నిక జరుగుతుందా..లేక సభ్యదేశాలన్నీ పరస్పర అంగీకారానికొచ్చి ‘తటస్థ’ వ్యక్తిని ఎన్నుకుంటాయా అన్నది తేలాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే. 

Updated Date - 2020-10-20T09:05:16+05:30 IST