స్థానికం రద్దు?

ABN , First Publish Date - 2020-08-05T08:05:07+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ‘ఆర్డినెన్స్‌’ల ఉచ్చులో చిక్కుకుంది. పాత ఆర్డినెన్స్‌కు కాలం చెల్లడంతో సర్కారు కొత్త ఆర్డినెన్స్‌ జారీ చేసింది. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే...

స్థానికం రద్దు?

  • ఆర్డినెన్స్‌ల తకరారుతో తంటా
  • గత నెలలోనే మురిగిపోయిన ఆర్డినెన్స్‌
  • దాని ఆధారంగానే ఎన్నికల నోటిఫికేషన్‌
  • అసంపూర్ణంగానే ఎన్నికల ప్రక్రియ
  • ఆర్డినెన్స్‌ మురిగిపోవడంతో మరొకటి
  • దాని గడువూ ఈనెల 20తో ముగింపు
  • ఈలోపు ఎన్నికల నిర్వహణ అసాధ్యం
  • ఒకే అంశంపై 2 ఆర్డినెన్స్‌లు చెల్లవన్న సుప్రీం
  • బిహార్‌ కేసులో 1986లోనే విస్పష్ట తీర్పు
  • పాతది మురిగిపోయింది... కొత్తది చెల్లదు
  • అంటే... ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దయినట్లే
  • స్పష్టం చేస్తున్న న్యాయ నిపుణులు
  • ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నిర్ణయమే కీలకం


అనేక వివాదాలు, ప్రకంపనలు సృష్టించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం రద్దయినట్లేనా!? మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి.. మొదటి నుంచి ప్రారంభించా ల్సిందేనా? ప్రభుత్వ అనాలోచిత ‘ఆర్డినెన్స్‌’లతో అసలుకే మోసం వచ్చిందా? ఈ ప్రశ్నలన్నింటికీ న్యాయ నిపుణులు ‘ఔను’ అనే సమాధానం చెబుతున్నారు. అది ఎందుకో, ఎలాగో మీరే చూడండి!


నిమ్మగడ్డ ఏం చేస్తారు

నోటిఫికేషన్‌కు ఆధారమైన ఆర్డినెన్స్‌కు కాలం చెల్లిపోవడంతో... ఇప్పుడు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఏ విధంగా చూసినా... పాత నోటిఫికేషన్‌ చెల్లుబాటు కాదని, మళ్లీ తాజాగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం మినహా మరో మార్గం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే,  ఆరునెలల గడువు ముగిసేలోపు (ఈనెల 20వ తేదీ) అసాధారణ రీతిలో శాసనసభను సమావేశపరిచి ఆర్డినెన్స్‌పై ఆమోద ముద్ర వేయించుకోవచ్చు. కానీ... విపక్షాలదే పైచేయిగా ఉన్న శాసన మండలిలో మాత్రం ఇది గట్టెక్కదని కచ్చితంగా చెప్పవచ్చు!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ‘ఆర్డినెన్స్‌’ల ఉచ్చులో చిక్కుకుంది. పాత ఆర్డినెన్స్‌కు కాలం చెల్లడంతో సర్కారు కొత్త ఆర్డినెన్స్‌ జారీ చేసింది. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే... ఈ ఆర్డినెన్స్‌ చెల్లదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వెరసి... పాత ఆర్డినెన్స్‌ ఆధారంగా జారీ చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా చెల్లదని పేర్కొంటున్నారు. శాసనసభ సమావేశాలు జరగని సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీ చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణల పేరిట ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఆర్డినెన్స్‌ నంబరు 2 జారీ చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను 15 రోజులకు కుదించడంతోపాటు.. ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే ఐదేళ్లలో సదరు అభ్యర్థి ఎన్నికను రద్దు చేయవచ్చునంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.


ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకునే ఈ క్రూరమైన నిబంధనలు తెచ్చారంటూ అప్పట్లోనే విపక్షాలు వాపోయాయి.  ఈ సంగతి పక్కన పెడితే... ఆర్డినెన్స్‌ 2కు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) రమేశ్‌ కుమార్‌ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్లు మొదలు కావాల్సి ఉంది. కానీ... కరోనా కమ్ముకుని రావడంతో ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వాయిదా వేశారు. ఆర్డినెన్స్‌ కాల పరిమితి ఆరు నెలలు. ఒకవేళ ఈలోపు అసెంబ్లీ సమావేశమైతే.. భేటీ మొదటి రోజు నుంచి ఆరు వారాల్లోపు ఆర్డినెన్స్‌ ఆమోదం పొందాలి. లేకపోతే ఆరునెలల కంటే ముందుగానే మురిగిపోతుంది. స్థానిక ఎన్నికల ఆర్డినెన్స్‌ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. దీనికి ఈనెల 20వ తేదీతో కాలం చెల్లుతుంది. కానీ, జూన్‌ 16న అసెంబ్లీ సమావేశమైంది. అప్పుడు ఆర్డినెన్స్‌ 2ను శాసనసభలో బిల్లుగా ఆమోదం పొందింది. కానీ, శాసన మండలిలో దీనిని అసలు ప్రవేశపెట్టనేలేదు. ఎంతసేపూ... ‘మూడు రాజధానుల బిల్లు’లపైనే దృష్టి పెట్టారు తప్ప, కీలకమైన పంచాయతీరాజ్‌ ఆర్డినెన్స్‌ని మండలిలో ఆమోదింపచేసుకోవాలని ఆలోచించలేకపోయారు.


ముగిసిన గడువు... 

సభ ప్రారంభమైన తేదీ నుంచి 6వారాల్లోపు ఆర్డినెన్స్‌ ఆమోదం పొంది తీరాలి. ఆ గడువు గత నెల 27నే ముగిసిపోయింది. అధికారులు నింపాదిగా మంగళవారం ఆర్డినెన్స్‌ నంబరు 6ను జారీ చేశారు. ‘జూలై 27తో మురిగిపోయింది’ అంటూనే... ఫిబ్రవరి 20న జారీ చేసిన ఆర్డినెన్స్‌ ఇంకా అమలులో ఉన్నట్లుగా పేర్కొంటూ తాజా ఆర్డినెన్స్‌ జారీ చేశారు. వెనుక తేదీ నుంచి అమలులో ఉండేలా ఆర్డినెన్స్‌లు జారీ చేయడమే ఓ విచిత్రం! నిజానికి పాత ఆర్డినెన్స్‌ మురిగిపోయిందని వారే అంగీకరించారు. ‘ఫిబ్రవరి 20 ఉత్తర్వు’ ఉంటుందన్న కొత్త ఆర్డినెన్స్‌ చూసినా... దానికీ 6 నెలల గడువు ఈనెల 20తో ముగిసిపోతుంది. అంటే, అప్పటికి అదీ మురిగిపోయినట్లే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం! అంటే పాత ఆర్డినెన్స్‌ ఆధారంగా జారీ చేసిన ఎన్నికల ప్రక్రియ అసంపూర్ణంగా ఉన్నందున ఆ నోటిఫికేషన్‌ కూడా చెల్లదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఆటోమేటిక్‌గా రద్దయినట్లేనని పేర్కొంటున్నారు.


సుప్రీంకోర్టు చెప్పిందేమిటి!

రాజ్యాంగ నిబంధనల ప్రకారమేకాదు.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూసినా ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన ఆర్డినెన్స్‌ చెల్లదని స్పష్టమవుతోంది. ఒకే అంశంపై  మళ్లీ ఆర్డినెన్స్‌ జారీ చెల్లదని డీసీ వాద్వా వర్సెస్‌ బిహార్‌ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషనల్‌ కౌన్సిల్‌ ఆర్డినెన్స్‌-1983 అసెంబ్లీలో ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వం మళ్లీ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీనిని వాద్వాతోపాటు మరికొందరు సవాలు చేశారు. 1986 డిసెంబరు 20న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ‘‘ఆర్డినెన్స్‌ను అత్యవసర సమయాల్లో మాత్రమే జారీ చేయాలి. ఇది చట్టసభలకు ప్రత్యామ్నాయం కాదు. చట్టసభలలో చర్చించకుండా, వాటి ఆమోదం లేకుండా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ దాకా చట్టాల అమలు కుదరదు’’ అని స్పష్టం చేసింది. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రపతి ఒకే అంశంపై రెండోసారి ఆర్డినెన్స్‌లు జారీ చేసిన దాఖలాలు లేవని గుర్తు చేసింది. అదే సమయంలో దేశంలో ఆర్డినెన్స్‌ రాజ్‌’ ఉండొద్దని తేల్చిచెప్పింది. అంటే.. పంచాయతీరాజ్‌  ఎన్నికల సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండో ఆర్డినెన్స్‌  కూడా చెల్లనట్లే. దీనిపై ఎవరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా... అంతే సంగతులు! అంటే... మొదటి ఆర్డినెన్స్‌కు కాలం చెల్లింది. రెండోది చెల్లదు! అందువల్ల, అసంపూర్ణగా ఉన్న స్థానిక ఎన్నికల ప్రక్రియ దానంతటదే రద్దయినట్లే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-05T08:05:07+05:30 IST