Abn logo
Sep 23 2021 @ 23:56PM

కొలువుదీరనున్న మండలాధీశులు

ప్రమాణస్వీకారోత్సవానికి ముస్తాబవుతున్న రైల్వేకోడూరు మండల పరిషత కార్యాలయం

నేడు అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కో-ఆప్షన సభ్యుల ఎంపిక
ఆ తరువాత ప్రమాణస్వీకారం
ఘనంగా ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
నేటితో రెండేళ్ల ప్రత్యేక పాలనకు తెర
(కడప-ఆంధ్రజ్యోతి):
జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులకు రెండేళ్ల తరువాత నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టనున్నారు. నేడు (శుక్రవారం) మండలం పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కో-ఆప్షన సభ్యుల ఎంపిక ఉంటుది. ఆ వెంటనే నూతన పాలకవర్గ సభ్యులతో ఎంపీడీఓలు పదవి ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇందుకోసం మండల పరిషత సమావేశ భవనాలను తీర్చిదిద్దారు. 2014 జూలై 4న మండల పరిషత్తు, 5న జడ్పీ పాలకవర్గం కొలుదీరింది. 2019 జూలై 4వ తేదిన పాలకవర్గం ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. వివిధ కారణాల వల్ల ఎన్నికల నోటిఫికేషన వచ్చి పోలింగ్‌ జరిగినా, ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నా ఓట్ల లెక్కింపు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయింది. నేడు 50 మండలాల్లో అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో పాటు 549 మంది ఎంపీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రిజర్వేషన ప్రకారం 19 మండలాల్లో ఎస్సీ జనరల్‌ 4, మహిళలు 4 కలిపి 8, బీసీ సామాజిక వర్గంలో జనరల్‌ 6, మహిళలు ఐదుగురు మండల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. జనరల్‌ కేటగిరీలో 31 మంది కూడా సగానికి పైగా ఎస్సీ, బీసీ, మైనార్టీలు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అలాగే.. మండలానికి ఒకరు చొప్పున కో-ఆప్ఫన సభ్యులను ఎన్నుకుంటారు. నేటి నుంచి మండల పరిషత్తులు పూర్తి స్థాయిలో పాలన బాధ్యతలు నిర్వర్తిస్తాయి. మండల పరిషత్తు అధికారులు, సిబ్బంది పాలకవర్గం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల ప్రత్యేక పాలనకు తెర పడనుంది.

రేపు జడ్పీ పాలకవర్గం
జిల్లా పరిషత్తు పాలకవర్గం రేపు శనివారం ప్రమాణస్వీకారం చేయనుంది. ఇప్పటికే జడ్పీ చైర్మనగా రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డిని అధికారికంగా ప్రకటించారు. ఇద్దరు వైస్‌ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. శుక్రవారం రాత్రికి వైస్‌ చైర్మన్లు ఎవరనేది స్పష్టత వస్తుంది. 50 మంది జడ్పీటీసీ సభ్యుల్లో రిజర్వేషన ప్రకారం ఎస్టీ మహిళ ఒకరు, ఎస్సీ జనరల్‌ 5, మహిళలు 4, బీసీ జనరల్‌ 6, మహిళలు 6 మంది కలిపి 22 మంది బాధ్యతలు చేపట్టనున్నారు. అన రిజర్వుర్డు స్థానాలు 28లో కూడా పలువురు ఎస్సీ, బీసీలు, మైనార్టీలు ఎంపిక అయ్యారు. ఇద్దరు కో-ఆప్షన సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.