Advertisement
Advertisement
Abn logo
Advertisement

కమిషన్‌ నిబంధనల మేరకు ఎన్నికలు : కలెక్టర్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 30: ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల నిబంధనల మేరకు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్‌, పోలింగ్‌, జోనల్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలను సమర్థవంతంగా ఎన్నికల నియమావళి మేరకు నిర్వహించాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 937 మంది ఓటర్లు ఈ ఎన్ని కల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో రెండు చొప్పున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల నిర్వాహణకు ఆదిలాబాద్‌ జిల్లాలోని అదనపు కలెక్టర్లను సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా నియమించడం జరిగిందని, 12 ప్రిసైడింగ్‌, మరో 12 మంది జోనల్‌ అధికారులను, 28 మంది పోలింగ్‌ అధికారులను, 12 మంది మైక్రో పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ ఉంటుందన్నారు. ఈ శిక్షణలో ప్రతి ఒక్కరు పోలింగ్‌ నిర్వాహణ, రిపోర్టులు సమర్పణ వంటి వాటి పై క్షుణంగా తెలుసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు, అనుమానాలు ఉంటే వెంటనే సంప్రదించాలన్నారు. మరో సారి శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం మాస్టర్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌ ఎన్నికల నిర్వాహణ, బ్యాలెట్‌ పేపర్‌ పరిశీలన, మెటేరియల్‌ స్వీకరణ, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు,సిబ్బందికివిధుల కేటాయింపు, కంపార్ట్‌మెంట్‌, చేయాల్సిన అభ్యర్థుల జాబితా, ఓటర్ల వివరాలు, పోలింగ్‌ కేంద్రం సంఖ్య, అభ్యర్థుల ఏజెంట్లు, పోలింగ్‌ అనంతరం చేయాల్సిన నివేదికల సమర్పణ, బ్యాలెట్‌ బాక్స్‌ ఓపెన్‌, పేపర్‌సీల్‌ తదితర వివరాల పై వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నటరాజ్‌,ఆర్డీఓ రాజేశ్వర్‌,ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

లాటరీ పద్ధతిన మద్యం దుకాణాల ఎంపిక

జిల్లాలో నూతన మద్యం పాలసీ 2021 నుంచి 2023 సంవత్సరానికి గాను వాయిదా పడిన మూడు మద్యం దుకాణలను లాటరీ పద్ధతిన ఎంపిక చేసినట్లు  కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం లో డ్రా ద్వారా సంబంధిత లబ్దిదారులకు దుకాణాల కేటాయింపు నిర్వహించారు. ఇందులో తలమడుగు, తాంసి, గుడిహత్నూర్‌ మండలంలోని మన్నూర్‌ గెజిట్‌లకు అందిన దరఖాస్తులను పరిశీలించి లాటరీ ద్వారా కేటాయింపులు చేశామని కలెక్టర్‌ తెలిపారు. ఇందులో జిల్లా ప్రోహిబిషన్‌ ఎక్సైజ్‌ అధికారి రవీందర్‌రాజు, సీఐ శ్రీనివాస్‌, ఎస్సైలు, సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement