Abn logo
Apr 9 2021 @ 00:28AM

కారుచోలలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

పది మందికి గాయాలు.. గ్రామంలో పోలీస్‌ పికెట్‌ 

కారుచోల(యడ్లపాడు), ఏప్రిల్‌ 8: పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో గురువారం రాత్రి మండలంలోని కారుచోలలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్ళు, గాజు సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఇరు వర్గాలకు చెందిన పది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పోలింగ్‌ సందర్భంగా  ఓ బూత్‌లో ఓ మహిళ ఓటు వేసే విషయంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం ఏర్పడింది. ఇరు వర్గాల పెద్దలు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పోలింగ్‌ అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఓ వర్గం కులపరమైన పోస్టులు పెట్టినట్లు సమాచారంతో రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. గ్రామం నడిబొడ్డున  రహదారికి ఇరువైపులా ఉన్న ఇళ్ళపై నిలుచుని రాళ్ళు, సీసాలు ఒకరిపై ఒకరు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఓ వర్గానికి చెందిన ఏడుగురికి, మరో వర్గానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ ఎం సుబ్బారావు, యడ్లపాడు ఎస్‌ఐ రాంబాబులు సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసు జీపుపై కూడా రాళ్ళు పడ్డాయి. గాయపడిన వారిని 108లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పికెట్‌ను ఏర్పాటు చేశారు. 

 

దాడులలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న 108 సిబ్బంది


Advertisement
Advertisement
Advertisement