అదే జరిగితే భారత్‌లో కరోనా సునామీనే.. యూకే డాక్టర్ సంచలన కామెంట్స్..!

ABN , First Publish Date - 2022-01-11T18:23:55+05:30 IST

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ గడగడలాడిస్తోంది.

అదే జరిగితే భారత్‌లో కరోనా సునామీనే.. యూకే డాక్టర్ సంచలన కామెంట్స్..!

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ గడగడలాడిస్తోంది. రోజుకు కొన్ని లక్షల్లో కేసులు వస్తున్నాయి. గతంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారు, రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా దీని బారిన పడుతున్నారు. బ్రిటన్‌లో బూస్టర్ డోసు తీసుకున్న వారు దాదాపు 62 శాతం మంది ఉన్నారు. అయినా అక్కడ ప్రస్తుతం రోజుకు 1.5 లక్షల కేసులు వస్తున్నాయి. ప్రసుతం భారత్‌లో కూడా అదే తరహాలో కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇది ప్రారంభం మాత్రమేనని, త్వరలోనే భారత్‌లో కేసులు గణనీయంగా పెరుగతాయని, ముఖ్యంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని భారత సంతతికి చెందిన బ్రిటన్ వైద్యుడు రాజయ్ నారయణ్ తాజాగా వ్యాఖ్యానించారు. 


`ప్రస్తుతం భారత్‌లో 95 శాతం మంది మొదటి డోస్, 82 శాతం మంది రెండో డోస్ తీసుకున్నారు. కొందరు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. అయినా ప్రస్తుతం రోజుకు లక్షన్నర కేసులు వస్తున్నాయి. రాబోయే నాలుగు వారాల్లో భారత్‌లో కేసులు గణనీయంగా పెరుగుతాయి. రోజుకు 4 నుంచి 5 లక్షల కేసులు వస్తాయి. ఫిబ్రవరి రెండో వారంలో తారస్థాయికి చేరుకుంటాయి. ఒమైక్రాన్ బలహీన వైరస్ అని చాలా మంది అనుకుంటున్నారు. ఒమైక్రాన్ ఒక్కొక్కరి శరీరం మీద ఒక్కోలా ప్రభావం చూపిస్తోంది. యూకేలో యువకులు కూడా ఒమైక్రాన్ వల్ల తీవ్ర దుష్ర్పభావాలు ఎదుర్కొటున్నారు. 


భారత్‌లో ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలను వాయిదా వేస్తే మంచిదని నా అభిప్రాయం. లేకపోతే కరోనా సునామీ తప్పదు. ఒక గుంపులో కేవలం 20 మందికి ఒమైక్రాన్ సోకినా వారు ఎంతో వేగంగా వైరస్‌ను వ్యాప్తి చేయగలరు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయాలి. మా అంచనా ప్రకారం ఈ ఏడాది మరిన్ని కొత్త వేరియెంట్లు వస్తాయి. 2024 తర్వాత కరోనా పూర్తిగా బలహీనపడుతుందని అనుకుంటున్నామ`ని నారాయణ్ చెప్పారు. గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. 

Updated Date - 2022-01-11T18:23:55+05:30 IST