హోరాహోరీగా ఎమ్మెల్సీ ఎన్నికలు

ABN , First Publish Date - 2021-03-03T09:37:36+05:30 IST

రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఖాళీ ల భర్తీకి మార్చి 14న జరగనున్న ఎన్నికలకు హోరాహోరీ పోటీ జరుగుతోంది. మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

హోరాహోరీగా ఎమ్మెల్సీ ఎన్నికలు

కృష్ణా-గుంటూరులో 19 మంది అభ్యర్థులు

తూర్పు-పశ్చిమ గోదావరిలో 11 మంది అభ్యర్థులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఖాళీ ల భర్తీకి మార్చి 14న జరగనున్న ఎన్నికలకు హోరాహోరీ పోటీ జరుగుతోంది. మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగానే వీరు రంగంలోకి దిగినా పరోక్షంగా రాజకీయపార్టీలు, ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగడుతున్నారు. 13 వేలకు పైగా ఓటర్లున్న కృష్ణా-గుంటూరు జిల్లాల నియోజక వర్గం నుంచి 19మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, ఏఎస్‌ రామకృష్ణతో పాటు పరుచూరి పాండురంగవరప్రసాద్‌(ఏపీటీఎఫ్‌-257), టి.కల్పలత(ఎ్‌ససీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాపరెడ్డి సతీమణి), పి.మల్లికార్జునరావు(ఎ్‌సటీయూ)గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే.. అసలైన పోరు ముగ్గురు, నలుగురు అభ్యర్థుల మధ్యే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో బోడ్డు నాగేశ్వరరావుకు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలతో పాటు యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌(1938) ఉపాధ్యాయ సంఘాలు పలు అధ్యాపక సంఘాలు  మద్దతు ప్రకటించాయి.


మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ గత ఎన్నికల్లో 33 ఉపాద్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో పాటు అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయన విజయం కోసం శ్రమించారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. పీఆర్‌టీయూ, ఏపీటీఎఫ్‌, ఎస్‌టీయూ అభ్యర్థులను దింపాయి. దీంతో ఆయన విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


కల్పలతకు కలిసి వస్తున్న ‘వైసీపీ’

ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నప్పటికీ టి.కల్పలత అధికార వైసీపీ పరోక్ష అండతో ప్రచారం చేసుకుంటున్నారు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాపరెడ్డి సతీమణి కావడం ఆమెకు కలసి వస్తోంది. అధికార, అర్థబలంతో ఆమె ప్రధాన పోటీదారుగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించినా.. కల్పలతకు వైసీపీ మద్దతు ఉందనే ప్రచారం సాగుతుండడం గమనార్హం. ప్రస్తుతం సెలవులో ఉన్నప్పటికీ నాలుగైదు నెలలు ముందునుంచే ప్రతాపరెడ్డి పాఠశాల విద్యాశాఖలోని ఆర్‌జేడీలు, డీఈవోలకు కల్పలత పోటీ చేస్తున్న విషయాన్ని తెలియజేసి ఆ మేరకు ప్రచారం చేస్తున్నారని సమాచారం. ఏపీటీఎఫ్‌(257) మద్దతులో పరుచూరి పాండురంగ వరప్రసాదరావు పోటీ చేస్తున్నారు. ఆయన గత 9ఏళ్లుగా ఏపీటీఎఫ్‌ జనరల్‌ సెక్రెటరీగా ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేస్తున్నారు. ఆయనకు డీటీఎఫ్‌, పలు కాలేజ్‌ లెక్చరర్స్‌ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ఎస్‌టీయూ మద్దతుతో పి.మల్లికార్జునరావు పోటీ చేస్తున్నారు. ఆయన రాజధాని ప్రాంతంలో చార్టెడ్‌ అకౌంటెంట్‌. ఇప్పటి వరకు ఆయనకు ఉపాధ్యాయ సంఘాల నుంచి మద్దతు అంతగా లభిస్తున్ననట్లు లేదు. అయునా ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ నియోజకవర్గంలో ముగ్గురు లేదా నలుగురి మధ్యనే ఉంటుందని సమాచారం. 


ఉభయ గోదావరి జిల్లాల్లో

17 వేలకు పైగా ఓటర్లు ఉన్న తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల నియోజక వర్గం నుంచి 11మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ సాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ చెరుకూరి సుభాశ్‌ చంద్రబోస్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ గంధం నారాయణరావు(వైసీపీ పరోక్ష మద్దతు) బరిలో ఉన్నారు. వీరిలో షేక్‌ సాబ్జీకి పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల మద్దతు ఉంది. ఉపాధ్యాయ వర్గంలో ఆయనకు పట్టుంది. ఖచ్చితమైన యూటీఎఫ్‌ ఓటు బ్యాంక్‌ ఉంది. ప్రిన్సిపాల్స్‌, జూనియర్‌, కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌, గురుకుల సంఘాల మద్దతు కూడా ఆయనకు ఉండడం గమనార్హం. మాజీ ఎమ్మెల్సీ చెరుకూరి సుభాశ్‌ చంద్రబో్‌సకు కూడా మంచి పేరుంది. గత రెండు(2007, 2009) ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన ఆయనపై ఉపాధ్యాయ, అధ్యాయపక వర్గంలో సానుభూతి ఉండడం గమనార్హం. బోస్‌కు కాంట్రాక్‌ లెక్చరర్స్‌, గురుకుల సంఘా లు, పీఈటీ, పండిట్ల మద్దతు ఉంది. రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ గంధం నారాయణరావు వైసీపీ మద్దతుతో బరిలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆయనకు అల్లుడు. నారాయణరావుకు వైసీపీ మద్దతు లభించినట్లు చెబుతున్నారు. మొత్తంమీద ఇక్కడ ఈ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ జరుగుతున్నట్లు అంచనావేస్తున్నారు. 

Updated Date - 2021-03-03T09:37:36+05:30 IST