Abn logo
Sep 25 2021 @ 00:51AM

61 మండలాల్లో ముగిసిన ఎంపీపీల ఎన్నిక..

తలుపుల ఎంపీడీవో కార్యాలయంలో ఆర్‌ఓ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీటీసీ సభ్యులు

ఎన్నిక ప్రశాంతమే కానీ..!

61 మండలాల్లో ముగిసిన ఎంపీపీల ఎన్నిక.. 

అగళి, అమరాపురంలో వాయిదా..

మూడు చోట్ల వివాదం

తలుపుల ఎంపీపీ ఎన్నిక విషయంలో... ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, సీఈసీ సభ్యుడు శ్రీనివాసులురెడ్డి మధ్య వివాదం

తన మద్దతు ఎంపీటీసీలతో రాజీనామాకు సిద్ధమంటున్న శ్రీనివాసులురెడ్డి

నాటకీయ పరిణామాల మధ్య యల్లనూరు ఎంపీపీ ఎన్నిక

బ్రహ్మసముద్రంలోనూ హైడ్రామా... ఆత్మకూరు ఎంపీటీసీ-1 రాజీనామా

అనంతపురం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో-ఆప్షన సభ్యుల ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిసినా.. కొన్ని మండలాల్లో నాటకీయ పరిణామాలు, హైడ్రామాలు చోటుచేసుకున్నాయి. వివాదాలు, రాజీనామాలకు దారితీశాయి. జిల్లాలోని 63 మండలాల్లోనూ అధికార పార్టీకే మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. దీంతో ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ముందుగానే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో-ఆప్షన సభ్యులను ఎంపిక చేశారు. ఆ మేరకు ఎన్నిక సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నప్పటికీ.. కొన్ని నియోజకవర్గాల్లోని మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆ పార్టీలోని ముఖ్య నాయకులే ఎమ్మెల్యేల సిఫార్సులను తిరస్కరించేలా ధిక్కార ధోరణి వినిపించారు. అయినప్పటికీ... స్థానిక ప్రజాప్రతినిధులు ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఇది ఆ పార్టీ ద్వితీయస్థాయి నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. వారు రాజీనామాలు చేసే స్థాయికి దారితీస్తోంది. ఇప్పటికే ఒక ఎంపీటీసీ సభ్యురాలు రాజీనామా చేయగా... మరికొంత మంది అందుకు వెనుకాడటం లేదు. దీనికి ప్రధాన కారణం ఎంపీపీ పదవి ఆశించి భంగపడటమే. తలుపుల ఎంపీపీ ఎన్నిక విషయంలో స్థానిక ఎమ్మెల్యే సిద్దారెడ్డి, ఆ పార్టీ సీఈసీ సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మధ్య వివాదం ముదిరి పాకానపడటంతో తనకున్న మద్దతు ఎంపీటీసీలతో రాజీనామా చేసేందుకు వెనుకాడేది లేదని ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. తలుపుల ఎంపీపీ ఎన్నిక విషయంలో అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ... ఆందోళన కొనసాగిస్తున్నారంటే అక్కడి అధికార పార్టీలో వివాదం చిలికిచిలికి గాలివానగా మారుతోందనడంలో సందేహం లేదు. ఈ పరిణామాల కారణంగా పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయం ఆ వర్గాల నుంచి వినిపిస్తుండటం గమనార్హం. యల్లనూరు, బ్రహ్మసముద్రం ఎంపీపీల ఎన్నిక విషయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏదేమైనప్పటికీ... కొన్ని మండలాల్లో ఎంపీపీ ఎన్నిక ఆ పార్టీలో చిచ్చు రాజేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.


ఆర్డీవో, డీఎస్పీతో మాట్లాడుతున్న వైసీపీ సీఈసీ సభ్యుడు శ్రీనివాసులురెడ్డి

వివాదాలు... రాజీనామాలు... ఆందోళనలు..

- కదిరి నియోజకవర్గంలోని తలుపుల, నంబులపూలకుంట ఎంపీపీల ఎన్నిక సందర్భంగా అధికార పార్టీలో విభేదాలు పొడచూపాయి. ఆ పార్టీలోని ఆయా మండలాల నాయకుల మధ్య విభేదాల నేపథ్యంలో ఇరువర్గాలు తమ వర్గానికే ఎంపీపీ పదవి దక్కాలని పట్టుబట్టడంతో సమస్య జఠిలమైంది. తలుపుల ఎంపీపీ ఎన్నిక విషయంలో స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఆ మండల నాయకుడు, వైసీపీ సీఈసీ సభ్యుడు శ్రీనివాసులురెడ్డి మధ్య వివాదం రేగింది. తన వర్గానికే ఎంపీపీ పదవి కావాలని శ్రీనివాసులురెడ్డి పట్టుబట్టారు. ఎమ్మెల్యే తన వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నిక చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో అధికారులకు తనదైనశైలిలో ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మండలంలో 12 ఎంపీటీసీ సభ్యులుండగా... అందులో ఇద్దరు టీడీపీ సభ్యులు. వీరిలో శ్రీనివాసులురెడ్డి వైపు వైసీపీ సభ్యులు ఆరుగురితోపాటు టీడీపీ సభ్యులు నిలిచారు. ఈ క్రమంలో శ్రీనివాసులురెడ్డి బలపరిచిన సభ్యుడిని ఎంపీపీగా ఎన్నిక చేయకుండా ఎమ్మెల్యే బలపరిచిన మహమ్మద్‌ రఫీనాయక్‌ను ఎన్నిక చేశారు. దీంతో వివాదం చెలరేగింది. శ్రీనివాసులురెడ్డి వర్గీయులతోపాటు ఆయనకు మద్దతిచ్చే సభ్యులు ధర్నాకు దిగారు. మెజార్టీ లేకు న్నా... ఎమ్మెల్యే చెబితే ఎంపీపీగా ఎన్నిక చేస్తారా అని అధికారులను నిలదీశారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో కార్యాలయం వద్దే ధర్నాకు దిగారు. సమస్యను పరిష్కరించే వరకూ ధర్నా విరమించేది లేదని శ్రీనివాసులు రెడ్డి తేల్చిచెప్పారు.


బ్రహ్మసముద్రం ఎంపీడీవో కార్యాలయం ఎదుట పోలీసుల బందోబస్తు

- కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం ఎంపీపీ ఎన్నిక విషయంలో హైడ్రామా సాగింది. ఇక్కడ 12 ఎంపీటీసీ స్థానాలుండగా... అన్నీ వైసీపీకే దక్కాయి. ఎంపీపీ పదవి కోసం పలువురు పోటీపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ వస్తున్న సింగిల్‌ విండో అధ్యక్షుడు రామాంజనేయులు తన భార్య రేణుకకు ఎంపీపీ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌.. రేణుకకు కాకుండా ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన చంద్రశేఖర్‌రెడ్డికి ఎంపీపీ పదవి కట్టబెట్టారు. దీంతో ఆ పార్టీలో అసంతృప్తులు బయటపడ్డాయి.


యల్లనూరు ఎంపీడీవో కార్యాలయంలోకి వస్తున్న ఆలూరు సాంబశివారెడ్డి

- యల్లనూరు ఎంపీపీ ఎన్నికలో నాటకీయ పరిణామాలు తలెత్తాయి. మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలుండగా... అన్నీ వైసీపీకే దక్కాయి. ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఉదయం 10 గంటలకు ఇద్దరు ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 8 మంది మధ్యాహ్నం 12 గంటలైనా అక్కడకు చేరుకోలేదు. ఆ 8 మంది వస్తారా... రారా.. అని ఉత్కంఠగా ఎదురుచూశారు. ముందుగా అనుకున్న మేరకు... ఎంపీటీసీ సభ్యురాలు సావిత్రికి ఎంపీపీ పదవి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే పద్మావతితోపాటు ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి అనుకున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సొంత మండలం కావడంతో ఆయన వర్గం సావిత్రికి ఆ పదవి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయంలో సాంబశివారెడ్డి కలుగజేసుకుని ఎమ్మెల్యే పెద్దారెడ్డితో సంప్రదింపులు సాగించారు. చివరికి ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. అటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి... ఇటు సాంబశివారెడ్డికి సూచించిన వారికి కాకుండా మధ్యస్థంగా బుక్కాపురం ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవిని ఎంపీపీగా ఎన్నిక చేశారు. ఈ తతంగమంతా పూర్తికావడంతో మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ ఎన్నికతోపాటు వైస్‌ ఎంపీపీ, కో-ఆప్షన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది.

ఆగళి, అమరాపురంలో ఎన్నిక వాయిదా

మడకశిర నియోజకవర్గంలోని ఆ గళి, అమరాపురం ఎంపీపీల ఎన్నిక వాయిదా పడింది. అగళి మండలంలో ఎంపీటీసీగా గెలుపొందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నజీర్‌సాబ్‌ తన ఉద్యోగానికి గురువారం రాజీనామా చేశారు. అతని రాజీనామా ఆమోదించలేదు. ఈ క్రమంలో నజీర్‌తో కో-ఆప్షన సభ్యుడిగా నామినేషన వేయించారు. దీంతో అతని నామినేషనను తిరస్కరించారు. ఈ క్రమంలోనే ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. అమరాపురం మండలం లో ఎంపీపీ పదవికి త్రిముఖ పోటీ నెలకొంది. దీంతో వారి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోపాటు ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరు కావడంతో ఆ ఎన్నికను వాయిదా వేశారు.


ఆత్మకూరు ఎంపీటీసీ-1 రాజీనామా

రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు ఎంపీపీ ఆనరిజర్వుడ్‌ కావడంతో ఆత్మకూరు ఎంపీటీసీ-1 నుంచి పోటీచేసిన అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన ఆవుల లీలావతి ఆశించారు. ఎంపీపీగా ఆత్మకూరు ఎంపీటీసీ-2 స్థానం నుంచి గెలుపొందిన బీసీ సామాజికవర్గానికి చెందిన హేమలతను ఎన్నిక చేయడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆవుల లీలావతి ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని అధికారులకు అందజేశారు.