Bengaluru: పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలు

ABN , First Publish Date - 2021-11-13T18:09:30+05:30 IST

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, నగరాభివృద్ధితోపాటు బెంగళూరు మహానగర పాలికెలతో కలిపి విద్యుత్‌శాఖకు రూ.20వేలకోట్ల బకాయిలు పెండింగ్‌ ఉండడంతో ఇక సరఫరా చేయలేమని ఆ శాఖ తేల్చి చెప్పింది.

Bengaluru: పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలు

- పంచాయతీ, మున్సిపాలిటీలకు కరెంట్‌ షాక్‌ 

- రూ. 20 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని నోటీసులు 


బెంగళూరు: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, నగరాభివృద్ధితోపాటు బెంగళూరు మహానగర పాలికెలతో కలిపి విద్యుత్‌శాఖకు రూ.20వేలకోట్ల బకాయిలు పెండింగ్‌ ఉండడంతో ఇక సరఫరా చేయలేమని ఆ శాఖ తేల్చి చెప్పింది. దీంతో పంచాయతీలూ, నగర పాలక సంస్థలు, మహానగర పాలికెలకు కరెంటు షాక్‌ తగిలినట్టయింది. బెస్కాం, మెస్కాం, హెస్కాం, జెస్కాం, సెస్క్‌ల పరిధిలో గ్రామ పంచాయతీలు, విద్యాసంస్థలకు బకాయిలు చెల్లించాలని గురువారం నోటీసులు జారీ చేశారు. వెంటనే స్పందించకపోతే కరెంట్‌ను పూర్తిగా తొలగిస్తామని తేల్చి చెప్పారు. గ్రామీణాభివృద్ధిశాఖ పంచాయతీల పరిధిలోని వీధిదీపాలు, కార్యాలయాలకు సంబంధించి రూ.4,100 కోట్లు, నగరసభ, పురసభల నుంచి రూ.625 కోట్లు, బెంగళూరు మహానగర పాలికె నుంచి రూ.510 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ పరిధిలోని వివిధశాఖల నుంచి రూ.12వేల కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్టు విద్యుత్‌శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 6వేల గ్రామపంచాయతీల పరిధిలోని నీటి మోటార్ల బిల్లులు 2017 నుంచి చెల్లించలేదు. ఒక్కో గ్రామ పంచాయతీకి సంబంధించి లక్ష నుంచి రూ.60-70 లక్షల దాకా చేరింది. రాష్ట్రంలోని ఐదు విద్యుత్‌ కంపెనీలు ఇప్పటికే పలుమార్లు బకాయిల కోసం నోటీసులు జారీ చేశాయి. డిసెంబరులోగా బకాయిలు చెల్లించకపోతే పూర్తిగా కరెంట్‌ను తొలగిస్తామని నోటీసులలో స్పష్టం చేశారు. ఇదే జరిగితే గ్రామ పంచాయతీలలో వీధి దీపాలు, తాగునీటి మోటర్లు నిలిచిపోతాయి. నాలుగేళ్లుగా ప్రభుత్వశాఖల నుంచే వేలకోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉండడంతో ప్రస్తుతానికి పూర్తిగా వసూలు చేసి ప్రీపెయిడ్‌ రూపంలో విద్యుత్‌ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తున్నారు. బెస్కాం పరిధిలోని 8 జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి మరో 3,617 కోట్ల రూపాయల బకాయి ఉంది. 


బొగ్గు కొనుగోలుకు నిధులు అవసరం 

విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కొనుగోలుకు నిధులు కీలకమని వెంటనే ప్రభుత్వశాఖలు బకాయిలు చెల్లించాలని విద్యుత్‌శాఖ మంత్రి సునీల్‌కుమార్‌ కోరారు. ఇదే విషయమై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఈశ్వరప్ప స్పందిస్తూ బకాయిలు చెల్లించాలని నోటీసులు వచ్చాయన్నారు. జిల్లా పంచాయతీ సీఈఓలతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-11-13T18:09:30+05:30 IST