మళ్లీ విద్యుత్‌ షాక్‌ !

ABN , First Publish Date - 2022-01-29T04:56:46+05:30 IST

బిల్లుల మోతతో అల్లాడుతున్న వినియోగదారులకు ఇంకా షాక్‌ ఇవ్వడానికి విద్యుత్‌ శాఖ చర్యలు ప్రారంభించింది. సర్కారు ఖజానాను నింపడమే పరమావధిగా చార్జీల బాదుడుకు తెరతీసింది. ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించి అమలుకు సిద్ధమైపోయింది. ఇప్పటికే సంక్రాంతి నుంచి డెవలప్‌మెంట్‌ చార్జీలు వసూలు మొదలుపెట్టింది. దీంతో కొత్త కనెక్షన్లు భారం అవుతున్నాయి.

మళ్లీ విద్యుత్‌ షాక్‌ !

ఆదాయమే పరమావధిగా చార్జీల పెంపు

షాక్‌ కొడుతున్న విద్యుత్‌ మీటర్లు

వంట ఇల్లు లేకుంటే కనెక్షన్‌ లేదు

ఈనెల 1 నుంచి డెవలప్‌మెంట్‌ మోత

రెండు శ్లాబుల విధానానికి ప్రతిపాదన

ట్రూఅప్‌ చార్జీల కోసం ప్రజాభిప్రాయ సేకరణ

బెంబేలెత్తుతున్న వినియోగదారులు

ఒంగోలు( క్రైం), జనవరి 28: 

బిల్లుల మోతతో అల్లాడుతున్న వినియోగదారులకు ఇంకా షాక్‌ ఇవ్వడానికి విద్యుత్‌ శాఖ చర్యలు ప్రారంభించింది. సర్కారు ఖజానాను నింపడమే పరమావధిగా చార్జీల బాదుడుకు తెరతీసింది. ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించి అమలుకు సిద్ధమైపోయింది. ఇప్పటికే సంక్రాంతి నుంచి డెవలప్‌మెంట్‌ చార్జీలు వసూలు మొదలుపెట్టింది. దీంతో కొత్త కనెక్షన్లు భారం అవుతున్నాయి. పైగా వంట ఇల్లు ఉంటేనే కొత్త మీటర్‌ అంటూ మెలిక పెట్టింది. పనిలోపనిగా ట్రూఅప్‌ చార్జీల వసూలుకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. అదేమంటే విద్యుత్‌ శాఖ ఆర్థిక పరిస్థితి మెరుగు కోసమంటూ సాకులు చెబుతోంది. ఇదిలాఉండగా కీలకమైన శ్లాబుల తగ్గింపునకు రంగం సిద్ధమైంది. వచ్చే ఆగస్టు నుంచి రెండు స్లాబులు అమలు చేసి నిలువుదోపిడీ చేయబోతోంది. ఆ శాఖ తీరుతో బిల్లులు మరింత భారమవుతాయి అంటూ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

ఆదాయం పెంచుకోవడం కోసం విద్యుత్‌ శాఖ వినియోగదారులపై మరింతభారం మోపబోతోంది. ఇప్పటికే సంక్రాంతి ధమాకా పేరుతో ఇప్పటికే డెవలప్‌మెంట్‌ చార్జీల మోత మోగించింది. దీంతో గృహ అవసరాల కోసం మీటర్లు తీసుకునే వారికి ఆ చార్జీలు పెనుభారం అయ్యాయి.    కేటగిరిలు చేసి చిరు వ్యాపారులకు ఊరట అంటూ మిగిలిన వినియోగదారులపై భారం మోపుతున్నారు. సరాసరిగా నూతనంగా విద్యుత్‌ కనెక్షన్లు తీసుకునే వారి నుంచి ఏడాదికి రూ.7కోట్ల వరకు అదనపు భారం మోపేందుకు జిల్లాలో ఆ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అలాగే ఇప్పటికే విద్యుత్‌ బిల్లుల భారం ఎక్కువైతే, ఈ ఏడాది ఆగస్టు నుంచి రెండు శాబ్లుల విధానాన్ని కూడా అమలులోకి తీసుకు రాబోతున్నారు. డిస్కమ్‌లు ప్రతిపాదనలు కూడా తయారుచేశాయి. ట్రూఅప్‌ చార్జీలు పెంచడాన్ని న్యాయస్థానం తప్పుబట్టడంతో వెనక్కి తగ్గి వినియోగదారులకు తిరిగి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఆ చార్జీలను ఏదో ఒక విధంగా వసూలు చేసేందుకూ అధికారులు రంగం సిద్ధం చేశారు. ట్రూఅప్‌ చార్జీలతో శాఖ ఆర్థిక స్థితి పెంచుకునేందుకు అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఆ ప్రక్రియ కాస్త పూర్తయితే ఆ బాదుడూ తప్పేట్లు లేదు. అదేవిధంగా వంట గది ఉంటేనే గృహావసరాల కింద విద్యుత్‌ మీటరు ఇవ్వాలని తాజాగా విద్యుత్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతి ఇంటికి వంట గది ఉండాల్సిందే, లేకుంటే వాణిజ్య కింద మీటర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంకా భారం కానుంది.


ఆగస్టు నుంచి చార్జీలు పెంపు

రెండు శ్లాబులు విధానం ఇప్పటివరకు లేదు. ఇక నుంచి అమలులోకి తేవాలని డిస్కంలు ప్రతిపాదనలు తయారుచేశాయి. ఈ మేరకు ఆగస్టు నుంచి కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కనిష్ట శ్లాబు 50 యూనిట్లు ఉంటే ఆగస్టు నుంచి 30 యూనిట్లకు పరిమితం చేయాలని ప్రతిపాదించారు. దీంతో గృహ విద్యుత్‌ టారీఫ్‌ భారీగా పెంచేందుకు యోచిస్తున్నారు. ప్రస్తుతం 50 యూనిట్లలోపు యూనిట్‌ ధర రూ.1.45 ఉంది. ఆగస్టు నుంచి 30 యూనిట్లకు రూ.1.45, 31 నుంచి 75 యూనిట్ల వరకు రూ.2.80 వసూలు చేస్తారు. అదేవిధంగా గ్రూప్‌ ఏ కింద ఉన్న వారి వద్ద 50 యూనిట్లు వరకు ప్రస్తుతం రూ.2.60 వసూలు చేసున్నారు. దాన్ని ఆగస్టు నుంచి 20 పైసలు పెంచి రూ.2.80 వసూలు చేయనున్నారు. అదేవిధంగా 51 నుంచి 100 వరకు ఇప్పుడు రూ.2.60 కాగా దాన్ని రూ.4కు పెంచనున్నారు. 101 నుంచి 200 వరకు ప్రస్తుతం రూ.3.60 ఉంటే కొత్త టారీఫ్‌ ప్రకారం రూ.5 వసూలు చేయనున్నారు. ఇలా యూనిట్లు పెరిగే కొద్ది ధరలు పెరుగనున్నాయి.


సంక్రా0తి ధమాకా 

సంక్రా0తి ధమాకా పేరుతో విద్యుత్‌ శాఖ కొత్త కనెక్షన్లకు ఇచ్చే మీటర్లపై డెవలప్‌మెంట్‌ చార్జీలు పెంచి మోత మోగించనున్నాయి. ఆమేరకు రంగం సిద్దం అయింది. ఈ నెల 15 నుంచి కొత్త కనెక్షన్లు తీసుకునే వారిని కేటగిరిలు చేసి ఆదాయం పెంపు పేరుతో సామాన్యులపై భారం మోపేందుకు నిర్ణయం తీసుకుంది. గృహావసరాలకు గతంలో కొత్త కనెక్షను తీసుకోవాలంటే ఒక కిలోవాట్‌ రూ.1000 చెల్లించాలి. అదనంగా ఎన్ని కిలోవాట్లు తీసుకుంటే కిలోవాట్‌కు రూ.1200 చొప్పున వసూలు చేస్తారు. అయితే వినియోగదారులకు అర్థం కాకుండా ప్రస్తుతం మూడు కేటగిరిలు చేసి డెవలప్‌మెంట్‌ చార్జీలు పేరుతో అధికభారం మోపేందుకు రంగం సిద్దమైంది. కొత్త విధానం ప్రకారం 500 వాట్స్‌కు రూ.800, 501 నుంచి ఒక కిలోవాట్‌ వరకు రూ.1500 వసూలు చేయనున్నారు. ఆపైన రూ.1500తోపాటు కిలోవాట్‌కు రూ.2వేల చొప్పున వసూలు చేస్తారు. అదేవిధంగా వ్యాపార సంబంధమైన వారికి గతంలో ఒక కిలోవాట్‌లోపు వారికి రూ.2వేలు, అపైన పెరిగిన ప్రతి కిలోవాట్‌కు మరో రూ.2వేలు వసూలు చేసేవారు. ప్రస్తుతం దీనిలో నాలుగు కేటగిరిలుగా మార్పు చేసి 250 వాట్స్‌కు రూ.600, 251 నుంచి 500 వరకు రూ.1000, 501 నుంచి 1000 యూనిట్ల వరకు రూ.1800లు ఆపైన రూ.1800తో పాటు కిలోవాట్‌కు రూ.2వేల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ఽవిధంగా డెవలప్‌మెంట్‌ చార్జీలు మోత ఈనెల 1 నుంచి మోగించింది. ఏడాదికి 50 వేల నుంచి 60వేల వరకు కొత్త కనెక్షలు ఉంటాయి. సుమారుగా ఏడాదికి డెవలప్‌మెంట్‌ చార్జీల పెంపుతో జిల్లాలో రూ.7కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారుల అంచనా. 


వంట ఇల్లు లేకుంటే మీటర్‌ లేదు

వంట గది ఉంటేనే గృహావసరం కింద విద్యుత్‌ మీటరు ఇవ్వనున్నారు. లేకుంటే వాణిజ్యపరమైన కనెక్షన్‌ ఏర్పాటు చేసుకోవాల్సిందే. దీంతో ఇప్పటివరకు డూప్లెక్స్‌, తదితర ఇళ్లలో రెండు మీటర్లు వినియోగిస్తుంటే ఒక మీటరకు వాణిజపరమైన చార్జీలు వసూలు చేస్తారు. పేదలు ప్రత్యేకంగా వంట గది లేకుండా ఇల్లు నిర్మాణం చేసుకున్నా విద్యుత్‌ మీటర్‌ ఇచ్చే అవకాశం లేదు. తప్పనిసరిగా విద్యుత్‌ శాఖ అధికారులకు వంటగది ఉన్నట్లు చూపాల్సిందే. దీంతో సామాన్యులపై మరింత భారం పడనుంది.


చిరు వ్యాపారులకు ఊరట

-కెవిజి.సత్యనారాయణ, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ

ఈనెల 15 నుంచి డెవలప్‌మెంట్‌ చార్జీలు కేటగిరీలుగా విభజించి వసూలు చేస్తున్నాం. ఈ మార్పులలో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి కొంత ఊరట కలగ నుంది. గతం కంటే ఇప్పుడు తక్కువ వాట్స్‌ వినియోగించుకునే వారికి డెవలప్‌మెంట్‌ చార్జీలు తగ్గుతున్నాయి. అందుకే ఒక కిలోవాట్‌లోపు వారికి నాలుగు కేటగిరిలుగా విభజించాం. అదేవిధంగా వంట గది ఉంటేనే గృహ అవసరం కింద మీటరు ఇస్తాం. ఒక వ్వక్తి పేరుతో ఎన్ని మీటర్లు అయినా ఉండవచ్చు అని వాటిని ప్రత్యేకంగానే పరిగణిస్తాం. అలాంటి సర్వీసులన్నీ ఒకే శ్లాబు కిందకు వస్తుందనేది అపోహ మాత్రమే.

Updated Date - 2022-01-29T04:56:46+05:30 IST