ఖజానాకు విద్యుత్‌ షాక్‌

ABN , First Publish Date - 2021-08-01T05:49:38+05:30 IST

అభివృద్ధిలో తమ మార్క్‌ చూపించాలని పరితపిస్తున్న సర్పంచ్‌లకు పంచాయతీ ఖాతాల్లో ఖాళీ ఖజానాలు వెక్కిరిస్తున్నాయి. సర్పంచ్‌లుగా ఎన్నికైన తరువాత చెక్‌పవర్‌, సచివాలయాల నిర్వహణ వంటి విషయాల్లో ప్రభుత్వం ఝలక్‌లు ఇస్తూ వస్తోంది. తాజాగా సర్పంచ్‌లకు తెలియకుండానే..14వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్‌ బకాయిల కింద జమ చేసింది. ఇలాగైతే పాలన కష్టమని వారు పెదవివిరుస్తున్నారు. జిల్లాలో 1,194 పంచాయతీలు ఉన్నాయి.

ఖజానాకు విద్యుత్‌ షాక్‌


ఆర్థిక సంఘం నిధులు విద్యుత్‌ బకాయిలకు మళ్లింపు

సర్పంచ్‌, కార్యదర్శులకు తెలియకుండా సర్దుబాటు

ఆందోళనలో పంచాయతీ పాలకవర్గాలు 

(ఇచ్ఛాపురం రూరల్‌)

అభివృద్ధిలో తమ మార్క్‌ చూపించాలని పరితపిస్తున్న సర్పంచ్‌లకు పంచాయతీ ఖాతాల్లో ఖాళీ ఖజానాలు వెక్కిరిస్తున్నాయి. సర్పంచ్‌లుగా ఎన్నికైన తరువాత చెక్‌పవర్‌, సచివాలయాల నిర్వహణ వంటి విషయాల్లో ప్రభుత్వం ఝలక్‌లు ఇస్తూ వస్తోంది. తాజాగా సర్పంచ్‌లకు తెలియకుండానే..14వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్‌ బకాయిల కింద జమ చేసింది. ఇలాగైతే పాలన కష్టమని వారు పెదవివిరుస్తున్నారు. జిల్లాలో 1,194 పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీలకు ఏడాదికి సగటున రూ.100 కోట్ల వరకూ ఆర్థిక సంఘం నిధులు సమకూరుతాయి. వీటితో సీసీ రోడ్లు, కాలువలు, తాగునీటి నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ మూడేళ్లుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడంతో పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో 14వ ఆర్థిక సంఘం నిధులు రెండు విడతల్లో...మొత్తం రూ.147 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో మార్చి నాటికి రూ. 25 కోట్లు ఖర్చు చేశారు.  రూ.122 కోట్లు మిగులు నిధులుగానే ఉన్నాయి. వీటికి తోడు 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాలో జమ కావడంతో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సర్పంచ్‌లు భావించారు. కానీ విద్యుత్‌ బకాయిల రూపంలో వాటిని మళ్లించడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. 


 ప్రభుత్వ నిర్ణయం మేరకే..

మార్చిలో ఆర్థిక సంఘం నిధులు మురిగిపోతాయన్న ప్రభుత్వ నిర్ణయం మేరకే ఇంధన శాఖ ప్రత్యేక జీవో జారీచేసింది. జూన్‌ నెలాఖరు వరకూ ఉన్న బకాయిలను తమ ఖాతాకు జమ చేయాలని కోరుతూ వివరాలు తెలియజేస్తూ ఏపీసీఎప్‌ఎస్‌ఎస్‌ సీఈవోకు ఇందన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌ ఈ నెల 15న జీవో 90ను జారీ చేశారు. వెంటనే పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు కనీస సమాచారం లేకుండా పంచాయతీ ఖాతాల్లో ఉన్న నగదు సర్దుబాటయ్యింది.  ఫలితంగా జిల్లాలోని అత్యధిక శాతం పంచాయతీల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌ దర్శనమిస్తోంది. జిల్లావ్యాప్తంగా పంచాయతీల విద్యుత్‌ బకాయిలు రూ. 140 కోట్లు మేర ఉంటే... 14వ ఆర్థిక సంఘం మిగులు నిధుల నుంచి రూ. 120 కోట్లు జమచేశారు. తమకు తెలియకుండా ఇలా ఖాతాల్లోని నగదు ఇష్టానుసారం సర్దుబాటు చేసుకుంటే ఇక పంచాయతీల పరిపాలన ఎలా సాగించాలన్న  ప్రశ్న పాలక వర్గాల్లో వ్యక్తమవుతుంది. 


ఉత్తర్వులు రాలేదు

14వ ఆర్థిక సంఘం నిధులు విద్యుత్‌ బకాయిలకు జమ చేస్తున్న విషయంపై ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ మేరకే నిధులు ఖర్చుపెట్టాలి. ఎటువంటి సర్దుబాటుకు అవకాశం లేదు. 

-హరిహరరావు, డీఎల్‌పీవో, టెక్కలి.


Updated Date - 2021-08-01T05:49:38+05:30 IST