స్కాన్‌ చేయండి.. బిల్లు కట్టండి

ABN , First Publish Date - 2021-06-22T05:13:23+05:30 IST

కరోనా నేపఽథ్యంలో ఇటీవల విద్యుత్‌ రీడింగ్‌ తీయడం కష్టతరంగా తయారైంది

స్కాన్‌ చేయండి.. బిల్లు కట్టండి

మన చేతుల్లోనే విద్యుత్‌ బిల్లుల రీడింగ్‌

యాప్‌ ప్రవేశ పెట్టిన విద్యుత్‌ శాఖ

సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ ద్వారా చెల్లింపు


ఏలూరుసిటీ, జూన్‌ 21 : కరోనా నేపఽథ్యంలో ఇటీవల విద్యుత్‌ రీడింగ్‌ తీయడం కష్టతరంగా తయారైంది. కరోనా భయంతో చాలాగ్రామాల్లో మీటర్‌ రీడర్స్‌ రీడింగ్‌ తీయడానికి ఆసక్తి కనబరచలేదు. కొన్ని గ్రామాల్లో అసలు బయట వ్యక్తులు ఎవరినీ రానీయక పోవడంతో మీటర్‌ రీడింగ్‌లో జాప్యం జరిగింది. విద్యుత్‌ బిల్లులు తీయడంలో జాప్యాన్ని నివారిం చటానికి సెల్ఫ్‌మీటర్‌ రీడింగ్‌ విధానాన్ని విద్యుత్‌ శాఖ (ఏపీఈడీసీఎల్‌) ప్రవేశ పెట్టింది. దీనికోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. 

వినియోగదారులు తమ మీటర్‌ రీడింగ్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో స్కాన్‌చేసి పంపించేలా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విధానం ఈ నెల నుంచే అమలులోకి వచ్చింది. విద్యుత్‌ వినియోగ దారులు తమ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఏపీఈ డీసీఎల్‌ అని టైప్‌ చేస్తే ఈస్టర్న్‌ పవర్‌ అని కనిపిస్తుంది. దానిని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అనంతరం లాగిన్‌ అయి 16 అంకెల విద్యుత్‌ సర్వీస్‌ సంఖ్యను, నిక్‌నేమ్‌ పూరించాలి. ఆ తరువాత సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌పై నొక్కి రిజిస్టరు చేసుకున్న సర్వీస్‌ నెంబర్‌పై క్లిక్‌ చేయాలి. ఖాతాకు ఫోన్‌ నెంబరు అనుసంధానం అయితే నేరుగా ప్రాసెస్‌ అవుతుంది. లేకపోతే ఫోన్‌ నెంబర్‌ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి మీటర్‌ రీడింగ్‌ స్కాన్‌ చేయాలి. అక్కడ కేడబ్ల్యుహెచ్‌ రీడింగ్‌ కనిపించిన తరువాత క్లిక్‌ చేయాలి. తరువాత నిబంధనలు, షరతులు దగ్గర యాక్సెప్ట్‌ క్లిక్‌ చేస్తే వివరాలు సర్వీస్‌ పరిధిలోని సంబంధిత ఏఈవో దగ్గరికి వెళతాయి. నిర్ధారణ జరిగిన తర్వాత వినియోగదారుడి ఫోన్‌ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో బిల్లు వస్తుంది. ఆ తరువాత సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌లోకి వెళ్లి సర్వీస్‌ నెంబర్‌పై క్లిక్‌ చేస్తే బిల్లును చూసు కునే అవకాశం ఉంది. ఆ బిల్లును డౌన్‌లోడ్‌ కూడా చేసుకో వచ్చు. బిల్లు ఆన్‌లైన్‌లో చెల్లించాలనుకుంటే బిల్లు పే–ఆర్డరును వినియోగించుకోవచ్చు. 

బిల్లు మీద మీటర్‌ రీడింగ్‌ తేదీ ఉంటుంది. ఆ రోజునే మీటర్‌ రీడింగ్‌ తీయాలి. ప్రస్తుతం మీటర్‌ రీడింగ్‌ తీసే రెండు రోజులు ముందుగానే మీటర్‌ రీడింగ్‌ తీసుకోవచ్చు. సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ యాప్‌ను ఇప్పటి వరకు నాలుగు వేల మంది వినియోగించుకున్నారని విద్యుత్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ కేవలం డొమెస్టిక్‌ వినియోగ దారులకు మాత్రమే అని చెబుతున్నారు. జిల్లాలో 14 లక్షలకు పైగా డొమెస్టిక్‌ విద్యుత్‌ సర్వీసులున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యుత్‌ బిల్లులను నగదు రహితంగా చెల్లించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎస్‌.జనార్దనరావు కోరారు. మీటర్‌ రీడింగ్‌లో జాప్యాన్ని నివారించటానికి సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ యాప్‌ తీసుకు వచ్చామని ఇప్పటికే  చాలా మంది ఈ యాప్‌ ద్వారా బిల్లులు పంపిస్తున్నారన్నారు.


Updated Date - 2021-06-22T05:13:23+05:30 IST