తెలంగాణలో షాకిస్తున్న కరెంటు బిల్లులు

ABN , First Publish Date - 2021-04-11T16:42:41+05:30 IST

తెలంగాణలో కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. లోడు పెరుగుదల పేరిట..

తెలంగాణలో షాకిస్తున్న కరెంటు బిల్లులు

హైదరాబాద్: తెలంగాణలో కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. లోడు పెరుగుదల పేరిట డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో వాయించేస్తున్నారు. చిన్న కిరాణా దుకాణం నడిపే వ్యాపారికి నెలకు సగటున రూ. 4 వందల నుంచి 5 వందల బిల్లు వచ్చేది. ఈసారి అదనంగా డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో రూ. 3వేలు చెల్లించాలనే తాకీదులు పంపించారు. రెండు విద్యుత్ సంస్థల పంపిణీ పరిధిలో పలువురు వినియోగదారులది ఇదే పరిస్థితి. ఇంట్లో విద్యుత్ ఉపకరణాలు వినియోగించే శక్తి మొత్తాన్ని ఎనర్జీ లోడ్ అంటారు. ఉపకరణాలు పెరిగితే లోడ్ అధికమవుతుంది. ఏసీకి వెయ్యి నుంచి మూడువేల వాట్లు, కంప్యూటర్, వాటర్ హీటర్, మిక్సీ, ఫ్రిజ్ తదిరవాటికి వాడే ఉపకరణాలు పెరిగితే లోడ్ పెరుగుతుంది.


ఒక కిలోవాట్ కనెక్షన్ తీసుకుని రెండు కిలోవాట్లు వినియోగిస్తే అదనపు కిలోవాట్‌కు డెవలప్‌మెంట్ చార్జీల పేరిట రూ. 2,836 వసూలు చేస్తున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 4 వందలు కలిపి మొత్తం రూ. 3,236 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంపై కొన్ని చోట్ల కిరాయిదారులు, ఇంటి యజమానులకు మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. అద్దెకున్నవారే చెల్లించాలని యజమానులు చెబుతుండగా బిల్లు వరకు తాము చెల్లిస్తామని డెవలప్‌మెంట్ ఛార్జీలతో తమకు సంబంధంలేదని అద్దెకుండేవారు వాదిస్తున్నారు.

Updated Date - 2021-04-11T16:42:41+05:30 IST