Abn logo
Aug 3 2020 @ 14:12PM

స్థానిక సంస్థల విద్యుత్‌ బకాయిలు రూ.149.09 కోట్లు

పేరుకుపోయిన మున్సిపాలిటీలు, పంచాయతీల కరెంటు బిల్లులు

చెల్లించాలంటూ అడిషనల్‌ కలెక్టర్‌కు విద్యుత్‌ ఎస్‌ఈ లేఖ

పలు సర్కారు శాఖలు కూడా చెల్లించని బకాయిలు 


సంగారెడ్డి (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): విద్యుత్‌ శాఖకు ప్రభుత్వ కార్యాలయాల కరెంటు బిల్లులు గుదిబండగా మారాయి. కోట్లకు కోట్ల బిల్లులు వసూలు కావడం లేదు. స్థానిక సంస్థలకు సంబంధించిన విద్యుత్‌ చార్జీలు అయితే నెలనెలా పేరుకుపోతూనే ఉన్నాయి. జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలు ఉండగా ఒక్క బల్దియా కూడా కరెంటు బిల్లును పూర్తిగా చెల్లించలేదు. అన్ని మున్సిపాలిటీలు కలిపి రూ.131.73 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని పంచాయతీల బకాయిలు రూ.16.36 కోట్ల వరకు పేరుకుపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల తీరు కూడా ఇలాగే ఉంది. పలు జిల్లా శాఖలు రూ.లక్షల్లో కరెంటు బిల్లులను చెల్లించాల్సి ఉంది.


జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు కలిపి రూ.148.09 కోట్ల బకాయిలను విద్యుత్‌ సంస్థకు చెల్లించాల్సి ఉన్నది. ఆయా స్థానిక సంస్థలు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తున్నప్పటికీ బకాయిలు కోట్లల్లో పేరుకుపోవడంతో విద్యుత్‌ సంస్థకు గుదిబండగా మారాయి. రూ.148.09 కోట్లను చెల్లించేటట్టు చూడాల్సిందిగా విద్యుత్‌ శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ రవికుమార్‌ స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషాకు లేఖను పంపించారు. స్థానిక సంస్థల్లో వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి అవసరాలకు కరెంట్‌ను వినియోగించుకుంటున్నా వాటికి సంబంధించి బకాయిలు చెల్లించకపోతే కరెంట్‌ కనెక్షన్లు తొలగించాల్సి వస్తుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అలా అయితే సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి కావల్సి వస్తుందని, అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా చూడాలని రవికుమార్‌ తన లేఖలో కోరారు. 


జహీరాబాద్‌ మున్సిపాలిటీ బకాయిలే అధికం

జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు కలిపి రూ.131.73 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో జహీరాబాద్‌ అత్యధికంగా విద్యుత్‌ సంస్థకు బాకీ పడింది. జహీరాబాద్‌ మున్సిపాలిటీ రూ.28.29 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఆ తర్వాత స్థానంలో అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ ఉన్నది. కొత్తగా ఏర్పడ్డ ఈ మున్సిపాలిటీ అంతకుముందు ఉన్న పంచాయతీ బకాయిలతో కలిపి రూ.22.98 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఇక సంగారెడ్డి మున్సిపాలిటీ రూ.15.69 కోట్లు, తెల్లాపూర్‌ మున్సిపాలిటీ రూ.9.47 కోట్లు, సదాశివపేట మున్సిపాలిటీ రూ.2 కోట్లు, బొల్లారం మున్సిపాలిటీ రూ.1.56 కోట్లు, అందోలు-జోగిపేట మున్సిపాలిటీ రూ.19.27 కోట్లు, నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ రూ.13.63 కోట్ల వరకు విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ రవికుమార్‌ అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషాకు పంపించిన లేఖలో పేర్కొన్నారు.  


పంచాయతీల బకాయిలు రూ.16.36 కోట్లు

జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలు విద్యుత్‌ సంస్థకు రూ.16.36 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉన్నది. నూతన చట్టం ప్రకారం ప్రభుత్వం ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నది. ఈ నిధుల నుంచి కరెంట్‌ బిల్లులను, బకాయిలను విద్యుత్‌ సంస్థకు చెల్లిస్తున్నది. అయినా ఇంకా బాకీ పడిన రూ.16.36 కోట్లను కూడా చెల్లించేట్టు చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ ఎస్‌ఈ రవికుమార్‌ అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషాను కోరారు.


ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించని బిల్లులు 

ఇలా ఉండగా తమ కార్యాలయాల నిర్వహణకు కరెంట్‌ను వినియోగించుకుని బిల్లులు చెల్లించకుండా ఉన్న బకాయిల జాబితాలో సర్కారు శాఖలు కూడా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా విద్యాశాఖ రూ.1.51 కోట్లను చెల్లించాల్సి ఉన్నది. అలాగే హోంశాఖ (పోలీస్‌ విభాగం) రూ.89.59 లక్షలు, నీటి పారుదల శాఖ రూ.79.91 లక్షలు, పరిశ్రమల శాఖ రూ.41.88 లక్షలు, రెవెన్యూ శాఖ రూ.39.33 లక్షల బకాయిలను చెల్లించాలి. ఇక వైద్య ఆరోగ్య శాఖ రూ.18.62 లక్షలు, ఉన్నత విద్యాశాఖ రూ.3 లక్షలు, మూసేసిన గృహ నిర్మాణ సంస్థ రూ.1.37 లక్షలు, అటవీ శాఖ రూ.1.26 లక్షలు, న్యాయశాఖ రూ.4.26 లక్షలు, సాంఘిక సంక్షేమ శాఖ రూ.15.50 లక్షలు, రవాణా, రోడ్లు, భవనాల శాఖ రూ.11.82 లక్షలు చెల్లించాల్సి ఉంది. మిగిలిన శాఖలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండర్‌ టేకింగ్‌ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు వేల రూపాయల్లో ఉన్నాయి. ఈ బకాయిలను కూడా చెల్లించి, విద్యుత్‌ సంస్థ ఆర్థిక అభ్యున్నతికి సహకరించాల్సిందిగా సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ రవికుమార్‌ ఆయా శాఖల అధికారులను కోరారు. 

Advertisement
Advertisement