విద్యుత్‌ బిల్లులు, పాల ధరలు పెంచేది లేదు

ABN , First Publish Date - 2022-01-23T16:14:42+05:30 IST

రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా విద్యుత్‌ బిల్లులు, పాల ధరలు, నీటి చార్జీల పెంపు ప్రస్తావనలతోపాటు ప్రతిపక్షాల విమర్శలు జోరుగా సాగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కీలక నిర్ణయాన్ని

విద్యుత్‌ బిల్లులు, పాల ధరలు పెంచేది లేదు

                           - తేల్చి చెప్పిన CM బొమ్మై


బెంగళూరు: రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా విద్యుత్‌ బిల్లులు, పాల ధరలు, నీటి చార్జీల పెంపు ప్రస్తావనలతోపాటు ప్రతిపక్షాల విమర్శలు జోరుగా సాగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితిలో విద్యుత్‌ బిల్లులు, పాలధరలు పెంచే ఆలోచన లేదని తేల్చి పారేశారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్‌, నీరు, పాల ధరల పెంపునకు సంబంధించి వచ్చిన ప్రస్తానలపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోమన్నారు. అన్ని కోణాలను పరిశీలించాల్సి ఉందన్నారు. విద్యుత్‌ ధరల పెంపు అనివార్యమని విద్యుత్‌ శాఖ మంత్రి సునిల్‌కుమార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పాలధరలు పెంచాలని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌) ప్రభుత్వాన్ని కోరగా జలమండలి కూడా నీటి బిల్లులు పెంచాల్సి ఉందని ప్రస్తావించింది. ఇలా మూడు విభాగాల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. ఎప్పుడైనా ధరలు పెరగవచ్చునని చర్చలు సాగుతున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు డీకే శివకుమార్‌ ప్రజల ఆదాయం పెంచి ధరలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి కీలక సమయంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలకు కా స్త ఊరటనిస్తున్నాయి. కాగా విద్యుత్‌శాఖకు గ్రామీణాభివృద్ధి, తాగునీరు, ప్రజాపనులు, సాంఘికసంక్షేమ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ అనుబంధ శాఖలు, సంస్థల నుంచి ఏకంగా రూ.12 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ ఆదేశాలు జారీ చేస్తే బిల్లులు పెంచడం అనివార్యమని మంత్రి సునిల్‌కుమార్‌ వెల్లడించిన ఒక రోజులోనే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సర్వత్రా ఊరటనిచ్చినట్లయింది. 

Updated Date - 2022-01-23T16:14:42+05:30 IST