విద్యుత్‌ సంక్షోభం

ABN , First Publish Date - 2021-10-14T08:36:49+05:30 IST

మిగులు విద్యుత్‌ ఉన్న దేశంలో బొగ్గుకొరత గురించి మాట్లాడుతున్నారెందుకు? అంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ఆగ్రహించారు. దేశంలో బొగ్గుకొరత ఉన్నదన్న వ్యాఖ్యలను రెండురోజుల క్రితం విద్యుత్ మంత్రి...

విద్యుత్‌ సంక్షోభం

మిగులు విద్యుత్‌ ఉన్న దేశంలో బొగ్గుకొరత గురించి మాట్లాడుతున్నారెందుకు? అంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ఆగ్రహించారు. దేశంలో బొగ్గుకొరత ఉన్నదన్న వ్యాఖ్యలను రెండురోజుల క్రితం విద్యుత్ మంత్రి ఆర్‌కె సింగ్‌ ఎంతోగట్టిగా ఖండించిన విషయం తెలిసిందే. విపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేస్తూ కేంద్రం పరువు తీస్తున్నాయని ఆయన భావన. కేంద్రం వాదన, రాష్ట్రాలపై దాని ఆరోపణలు ఏమైనప్పటికీ, భారీ బొగ్గుకొరత దిశగా దేశం పరుగులుతీస్తోందనీ, త్వరలోనే చాలా రాష్ట్రాలు అంధకారంలోకి జారుకుంటాయని విశ్లేషణలు వెలువడుతూనే ఉన్నాయి. కనీసం డజను రాష్ట్రాలు అధికారికంగానో, అనధికారికంగానో పవర్‌కట్‌ అమలు చేస్తుంటే, కొరత లేనేలేదని కేంద్రం ఎందుకు అంటోందో, ఏ ధైర్యంతో అంటోందో అర్థంకాదు.


తగిన బొగ్గు నిల్వలు లేక కనీసం అరడజను రాష్ట్రాలు మూడునాలుగు గంటల విద్యుత్‌ కోత అధికారికంగా అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు అనధికారికంగా కుదిరినంత మేరకు కోతబెడుతున్నాయి. పరిశ్రమల విద్యుత్‌ డిమాండ్‌ను సంపూర్ణంగా తట్టుకోగలిగే స్థితి ఎక్కువ రాష్ట్రాల్లో లేదు. గృహావసరాలు తీర్చగలిగే మంచికాలం కూడా ముందుముందున ఉండబోదని అంచనా. ఉన్న ఆ కాసిన్నినిల్వలూ కొద్దిరోజుల్లోనే హరించుకుపోతాయని, సరఫరాతో ఆదుకోవాలని చాలా రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు మూతబడుతున్న వార్తలు కూడా కేంద్రానికి ఎందుకో అబద్ధంగానే తోస్తున్నది. వాడకం తగ్గించండి, విద్యుత్‌ ఆదాచేయండి అంటూ ప్రభుత్వాలు ప్రజలకు సున్నితంగా విజ్ఞప్తి చేస్తూనే, అనధికారికంగా తామే కోతలు పెడుతున్నాయి. విద్యుదుత్పత్తికి అవసరమైనంత బొగ్గు దొరకని స్థితి వల్ల సుదీర్ఘకాల విద్యుత్‌ కోతలు ఇకపై నిత్యకృత్యం కావచ్చు. థర్మల్‌ కేంద్రాలు ఒక్కటొక్కటిగా మూతబడుతున్న స్థితిలో చాలా రాష్ట్రాల్లో విద్యుత్‌ కొరత అధికంగా ఉంది. అధికధరకు కొనేందుకు పాలకులు సిద్ధపడినా ఆ భారాన్ని అంతిమంగా భరించాల్సింది సామాన్యులే.


ప్రస్తుత విద్యుత్‌సంక్షోభం బొగ్గుకొరతకు మాత్రమే పరిమితం కాదనీ, మొత్తం విద్యుత్‌ రంగమే కుప్పకూలేస్థితిలో ఉన్నదని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిస్కమ్‌లకు అండాదండా దండీగా ఇవ్వాల్సిన ‘ఉజ్వల్‌ డిస్కమ్‌ ఎస్యూరెన్స్‌ యోజన–ఉదయ్‌’ విఫలమైందనీ, డిస్కమ్‌లు జెన్కోలకు లక్షకోట్లకుపైగా బకాయీపడినందువల్ల జెన్‌కోలు కోల్‌ ఇండియాను భారీ బకాయీతో ముంచేశాయని అంటున్నారు. కోల్‌ ఇండియా వద్ద సరిపడా నిల్వలు లేవన్న రాష్ట్రాల ఆరోపణ, ఉన్నాయన్న కేంద్రం సమర్థింపునూ అటుంచితే, ఈ సంక్షోభానికి రాష్ట్రాలే కారణమని కేంద్ర ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఉత్పత్తి అవుతున్న బొగ్గును థర్మల్‌ పవర్‌ప్లాంట్లు వెంటనే తరలించుకోకపోవడం వల్ల కోల్‌ ఇండియా వద్ద ఈ ఏడాది ఆరంభానికి వందకోట్ల మెట్రిక్‌ టన్నుల బొగ్గునిల్వలు పేరుకున్నాయనీ, తీవ్రమైన వేసవిలో బొగ్గు తగలబడే ప్రమాదం ఉన్నందునా, ఎలాగూ భారీ నిల్వలు ఉన్నందునా కోల్‌ ఇండియా ఉత్పత్తిని తగ్గించిందని అంటారు. ఆగస్టునాటికి కరోనా ఆంక్షలన్నీ తొలగిపోయి, రోగభయం లేని వాతావరణంలో ఆర్థికరంగం ఒక్కసారిగా జోరందుకోవడంతో విద్యుత్‌ డిమాండ్‌ విపరీతంగా హెచ్చి, థర్మల్‌పవర్‌ప్లాంట్ల వద్ద ఉన్న నిల్వలు వేగంగా హరించుకుపోయాయని అంటారు. ఆర్థికరంగంలో చురుకుదనం, కరోనా పూర్వపు విద్యుత్‌ డిమాండ్‌లను రాష్ట్రాలు  అంచనావేయలేకపోవడంతో నిల్వ నిర్వహణలో అవి దెబ్బతిన్నాయనీ, ఇక, విదేశీబొగ్గుమీద ఆధారపడిన విద్యుత్‌ప్లాంట్లు అంతర్జాతీయంగా బొగ్గు ధరలు యాభైశాతం పెరగడంతో ఒక్కసారిగా కేంద్రం మీద పడ్డాయని కూడా అంటున్నారు. దేశం ఒక ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థితిలో ఈ పరస్పర ఆరోపణలు, విమర్శలు పక్కనబెట్టి సమస్య పరిష్కారంకోసం కృషిచేయడం అవసరం. ఇప్పుడిప్పుడే ఆర్థికం కాస్తంత గాడినపడుతున్నదశలో, విద్యుత్‌ సంక్షోభం ఆ మొగ్గను చిదిపివేయకుండా కాపాడుకోవడం ముఖ్యం.  

Updated Date - 2021-10-14T08:36:49+05:30 IST