వేసవిలో సొగసరి కురుల కోసం..

ABN , First Publish Date - 2021-05-05T16:20:05+05:30 IST

వేసవిలో ముఖారవిందానికి సరికొత్త సొబగులద్దే కురులకు కొత్త కష్టాలూ వచ్చాయి. జుట్టు పొడిబారడం, జీవం లేనట్లుగా మారిపోవడం, చివరలు చీలిపోవడం... ఎన్నో సమస్యలు. ఇక

వేసవిలో సొగసరి కురుల కోసం..

వేసవిలో ముఖారవిందానికి సరికొత్త సొబగులద్దే కురులకు కొత్త కష్టాలూ వచ్చాయి. జుట్టు పొడిబారడం, జీవం లేనట్లుగా మారిపోవడం, చివరలు చీలిపోవడం... ఎన్నో సమస్యలు. ఇక వేసవిలో జుట్టు త్వరగా జిడ్డు కారిపోవడమూ కనిపిస్తుంటుంది. ఇవి చాలదన్నట్లు వేసవిలో ఎక్కువగా దుమ్ము, ఎండ వేడి, కాలుష్యం, తేమ వంటివి జుట్టు కుదుళ్ల నుంచి పాడయ్యేటట్లు చేస్తాయి.  నచ్చినట్లుగా లూజ్‌ హెయిర్‌ లేదంటే పోనీ టైల్స్‌తో వయ్యారాలు పోవడానికీ ఇది కష్టకాలంగానే చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలాంటి వాతావరణంలో జుట్టు సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలనే అంశంపై హెయిర్‌స్టైలిస్ట్‌ వెంకటేష్‌ ఏం చెబుతున్నారంటే...


తేమ ఉంచాలి..

తల మీద చర్మాన్ని తేమగా ఉంచడం ఈ వేసవిలో అతి ముఖ్యమైన అంశం. అందువల్ల వారానికి ఒకటి లేదంటే రెండు సార్లు నూనె పెడితే చాలు. ఎందుకంటే ఈ వేసవి సీజన్‌లో మన శరీరం సహజంగానే తల మీద చర్మం తేమగా ఉంచేందుకు అవసరమైన మేర నూనె ఉత్పత్తి చేస్తుంది. ఇలా వద్దనుకుంటే హెయిర్‌ మాస్క్‌ ట్రై చేయవచ్చు. మన నగర వాతావరణంలో గుర్తుంచుకోవాల్సింది ఈ స్ల్కాప్‌ను శుభ్రంగా ఉంచుకోవడం. కాలుష్యం, దుమ్ము కారణంగా నెత్తిమీద చేరే మురికిని తొలగించుకోవడానికి తలస్నానం తరచుగా చేయడం అవసరమే! ఇక చుండ్రు లాంటి సమస్యలతో బాధపడేవారు వారానికి కనీసం నాలుగు లేదా ఐదుసార్లు తలస్నానం చేయడమే మంచిది. 


హీట్‌ స్టైలింగ్‌ జుట్టుకు నష్టం

కర్లింగ్‌ లేదంటే ఫ్లాట్‌ ఐరన్స్‌ జుట్టుకు ఈ సీజన్‌లో  నష్టం చేయవచ్చు. ఇందుకు కారణం అధిక ఉష్ణోగ్రత. హీట్‌ స్టైలింగ్‌ ఏదైనా సరే ముందు హీట్‌ ప్రొటెక్షన్‌ మిస్ట్‌ అప్లయ్‌ చేయడం తప్పనిసరంటున్నారు. టవల్‌తో ఆరబెట్టుకున్న తలపై స్ర్పే చేయడం ద్వారా స్ట్రెయిటనింగ్‌ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మీ జుట్టు బ్రేక్‌ కాకుండా లేదంటే డ్యామేజీ కాకుండా బౌన్సీ హెయిర్‌ లేదంటే బీచీ వేవ్స్‌ను అప్పుడు మాత్రమే పొందగలరు. 


చెమట పట్టడం వల్ల జుట్టు పాడవుతుంది..

చెమట వల్ల జుట్టు పాడవుతుందనేది అపోహ మాత్రమే. నిజానికి వేసవిలో చెమటలు సహజంగానే పడతాయి. ఇక వర్కవుట్స్‌ వల్ల కూడా చెమటలు భారీగానే పడతాయి. ఈ చెమట నిజానికి జుట్టుకు మంచిదే. అయితే ఎక్కువ కాలం ఈ చెమట అలాగే పట్టనిస్తే అది జుట్టు జిడ్డుగా మారి, తల మీద మురికి, ఆ తరువాత చుండ్రు చేరడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా చెమట పట్టే వారు తలస్నానం చేస్తే మంచిది.


జుట్టు రాలుతుందేమో చూడాలి...

సాధారణంగా సీజన్‌ మారినప్పుడల్లా జుట్టు రాలుతుండటం సాధారణంగా కనిపిస్తుంటుంది. ఇది ఎక్కువ కనిపిస్తుందేమో జాగ్రత్తగా గమనించాలి. ఎక్కువ సార్లు తల దువ్వితే జుట్టు ఎంతగా ప్రకాశిస్తుందో తెలియదు కానీ ఊడిపోవడం మాత్రం ఖాయం.  అలాగని దువ్వొద్దా అని అంటే, జుట్టు దువ్వాలి. కానీ నెమ్మదిగా సహజసిద్ధంగా చర్మం ఉత్పత్తి చేసే నూనెలు జుట్టంతా విస్తరించేలా దువ్వాలి.


వేసవిలో కండీషనర్‌ వాడటం వల్ల జుట్టు జిడ్డు కారుతుంది..

వేసవిలో జుట్టుకు అదనపు కండీషనింగ్‌ కావాల్సి ఉంటుంది. చాలామంది తమ జుట్టు పొడి బారడం లేదు కాబట్టి కండీషనర్‌ వాడరు. దానివల్ల నష్టమే ఎక్కువ. మీరు సాధారణంగా వాడే కండీషనర్‌తో పాటు కండీషనింగ్‌ మాస్క్‌ను వారానికోమారు వాడటం వల్ల పాడయిన జుట్టు కూడా తిరిగి బాగయ్యేందుకు అవకాశం ఉంది.


జుట్టు కత్తిరించుకోవడం వల్ల  దాన్ని సరిగా మేనేజ్‌ చేయవచ్చు..

షార్ట్‌ హెయిర్‌ వేసవిలో సౌకర్యాన్ని ఇచ్చినా దీనికి కూడా సరైన మెయిన్‌టెనెన్స్‌ కావాలి. ఆరోగ్యంగా ఉండాలంటే జుట్టుకు తగిన పోషకాలు అందించాల్సిందే.


హ్యాట్స్‌ పెట్టుకోవడం మంచిది..

అతి నీల లోహిత కిరణాల వల్ల చర్మం మాత్రమే కాదు జుట్టు కూడా పాడవుతుంది. వేసవిలో హ్యాట్స్‌ పెట్టుకోవడంవల్ల జుట్టు నష్టపోకుండా కాపాడుకోవచ్చు. కాకపోతే ఈ టోపీల వల్ల నెత్తి మీద మరింత చెమట పట్టేందుకు అవకాశం ఉంది. మరీ టైట్‌గా ఉండే హ్యాట్స్‌ కాకుండా జుట్టుకు తగిన శ్వాస తీసుకునే అవకాశం కల్పించడం. ఒకవేళ హ్యాట్స్‌ ధరించడం ఇష్టం లేకపోతే.. స్కార్ఫ్‌తో జుట్టను కవర్‌ చేసుకోవడం మంచిది.


రసాయనాలకు దూరం దూరం...

వేసవిలో జుట్టుకు రసాయనాలు పట్టించడం శ్రేయస్కరం కాదు. మరీ ముఖ్యంగా కలరింగ్‌, బ్లీచింగ్‌, స్ర్టిప్పింగ్‌ వంటివి ఈ సీజన్‌లో చేయకపోవడం మంచిది.

- హైదరాబాద్‌సిటీ, (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2021-05-05T16:20:05+05:30 IST