Abn logo
Oct 18 2020 @ 17:54PM

ఊరంతా ఏనుగులే..

Kaakateeya

ఏనుగులు అడవుల్లో ఉంటాయి. ఎప్పుడైనా ప్రత్యక్షంగా జూలోనో, సర్కస్‌లోనో చూస్తే తెగ సంతోషిస్తాం. పిల్లలైతే కేరింతలు కొడుతూ చప్పట్లు చరుస్తారు. అయితే ఆ ఊరిలోకి వెళ్తే అన్నీ ఏనుగులే కనిపిస్తాయి. ఒకటి కాదు రెండు కాదు... వందకుపైగా ఏనుగులను ఒకే చోట చూడొచ్చు. అదే ఏనుగుల ఊరు... ‘హాథీగావ్‌’!


రాజస్థాన్‌ రాజధానిగానే కాకుండా జైపూర్‌ నగరానికి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరుంది. అనేక కోటలు, అద్భుత కట్టడాలకు ప్రసిద్ధి. ఆయా కోటలపైకి పర్యాటకులు ఏనుగులపై కూర్చుని వెళ్లి చూసొస్తుంటారు. జైపూర్‌కు సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ‘హాథీగావ్‌’ అంటే ఏనుగుల ఊరు అని అర్థం. ఆ ఊరిలో 102 ఏనుగులకు ప్రత్యేకంగా ఇళ్లున్నాయి. ఏనుగులను జీవనాధారంగా చేసుకుని అక్కడ 130 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఏనుగులకు వాటి యజమానులు మైనా, రాధిక... ఇలా పేర్లు పెట్టుకున్నారు. పేర్లతోనే వాటిని పిలుస్తారు. ఏనుగులను కుటుంబసభ్యుల్లాగే జాగ్రత్తగా చూస్తుంటారు. ప్రతీరోజూ ఏనుగులకు స్నానం చేయించి, చెరకు, అరటి గెలలు తినిపించి సవారీకి సిద్ధం చేస్తారు. ఏనుగులు స్నానం చేయడానికి ప్రత్యేకంగా ఒక కొలను కూడా ఏర్పాటు చేశారు.


దీనికో చరిత్ర ఉంది..

రాజస్థాన్‌లో రజ్వాడా సైన్యం ఉన్నప్పుడు అంటే చాలా ఏళ్ల క్రితం ఇక్కడ వెయ్యి ఏనుగుల దాకా ఉండేవట. సైనికుల కోసం ఈ ఏనుగులను వినియోగించేవారు. వాటిని తమ ఇళ్లలో ఉంచుకునేవారు కాబట్టి ఈ ప్రాంతానికి ‘హాథీగావ్‌’ అనే పేరొచ్చింది. రాజ్యాలు అంతరించిన తర్వాత జైపూర్‌ ప్రాంతంలో కోటలు, ప్రసిద్ధ కట్టడాలు పర్యాటక కేంద్రాలుగా మారాయి. దాంతో వాటిని అధిరోహించేందుకు ఏనుగుల సవారీ మొదలైంది. జైపూర్‌ పరిసరాల్లో ఉన్న కోటలను, ఇతర కట్టడాలను ఎక్కేందుకు ఈ గ్రామం నుంచే ఏనుగులను తీసుకెళ్తుంటారు.    


ఎంట్రీ ఫీజు వంద రూపాయలు...

‘హాథీగావ్‌’లోకి సందర్శకులు వెళ్లాలంటే ఒక్కొక్కరు వంద రూపాయల రుసుం చెల్లించాలి. సుమారు 100 ఎకరాల్లో ఉన్న ఈ గ్రామంలోకి వెళ్లాక తప్పనిసరిగా శుభ్రతను పాటించాల్సిందే. ఎక్కడపడితే అక్కడ తినుబండారాలు, వ్యర్థ పదార్థాలు వేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. ‘హాథీగావ్‌’లో ఏనుగులపై సవారీ చేయొచ్చు. అందుకోసం 500 రూపాయల నుంచి 1500 రూపాయలదాకా తీసుకుంటారు. అరకిలోమీటరు మేర ఉన్న ట్రాకులో వాటిని తిప్పుతారు. ప్రతీరోజూ ఈ గ్రామాన్ని సందర్శించేందుకు 300 మందికిపైగా వస్తుంటారని, సెలవుల్లో ఈ సంఖ్య 500 దాకా ఉంటుందని స్థానికులు తెలిపారు. గ్రామంలోకి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలదాకా అనుమతిస్తారు. జైపూర్‌కు వెళ్తే తప్పకుండా ఈ గ్రామాన్ని సందర్శించాలి. ఎందుకంటే ఒకేచోట 100కు పైగా ఏనుగులను చూసే అవకాశం మరెక్కడా లేదు కదా. 


- యం.డి.మునీర్‌, మంచిర్యాల  


Advertisement
Advertisement
Advertisement