రైళ్లకు బలవుతున్న ఏనుగులు

ABN , First Publish Date - 2022-01-17T13:29:38+05:30 IST

రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో (వెస్ట్రన్‌ ఘాట్స్‌) ప్రాంతంలో గజరాజుల మృత్యుఘోష కొనసాగుతోంది. గత రెండు దశాబ్దాల కాలంలో 29 ఏనుగులు మృత్యువాతపడ్డాయి. ఇవన్నీ ఈ అటవీ ప్రాంతం

రైళ్లకు బలవుతున్న ఏనుగులు

                      - రెండు దశాబ్దాల్లో 29 గజరాజుల బలి


అడయార్‌(చెన్నై): రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో (వెస్ట్రన్‌ ఘాట్స్‌) ప్రాంతంలో గజరాజుల మృత్యుఘోష కొనసాగుతోంది. గత రెండు దశాబ్దాల కాలంలో 29 ఏనుగులు మృత్యువాతపడ్డాయి. ఇవన్నీ ఈ అటవీ ప్రాంతం మీదుగా నడిచే రైళ్ళు ఢీకొనడం వల్లే చనిపోవడం గమనార్హం. ఈ ఏనుగుల మృత్యుఘోషను ఆపేందుకు ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, అటవీశాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటకీ పెద్దగా ప్రయోజనం కనిపించడంలేదు. కోయంబత్తూరు - పాలక్కాడు రైల్వే మార్గంలో పోత్తనూరు జంక్షన్‌, కంజిక్కాడు రైల్వే స్టేషన్ల మధ్య 2002 నుంచి 2010 వరకు  జరిగిన వివిధ రైలు ప్రమాదాల్లో 13 ఏనుగులు చనిపోయాయి. వీటిలో 2008 సంవత్సరం ఫిబ్రవరి 2న పోత్తనూరు, మదుక్కరై రైల్వే స్టేషన్ల  మధ్య జరిగిన ప్రమాదంలో మూడు ఏనుగులు మృత్యువాతపడ్డాయి.అదే విధంగా 2016 నుంచి 2021 మధ్య కాలంలో జరిగిన రైలు ప్రమాదంలో మరో 8 ఏనుగులు చనిపోయాయి. ఇలా గత 19 యేళ్ళ కాలంలో 29 ఏనుగుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అయితే, ఈ రైలు ప్రమాదాలను నివారించి ఏనుగుల ప్రాణాలు రక్షించేందుకు తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మార్గంలో రైళ్ళ వేగాన్ని గణనీయంగా తగ్గించారు. అయినప్పటికీ, ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అదేసమయంలో ఏనుగుల ప్రాణాలు రక్షించేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల కోర్టు కూడా ఆదేశాలు జారీచేసింది. దీంతో రైల్వే శాఖ కూడా ఈ మార్గంలో రైళ్ళను నడిపే డ్రైవర్లకు ప్రత్యేక సూచనలు కూడా చేసింది. 

Updated Date - 2022-01-17T13:29:38+05:30 IST