‘ధరణి’తో దళారీ వ్యవస్థ నిర్మూలన

ABN , First Publish Date - 2021-01-21T06:08:02+05:30 IST

ధరణి పోర్టల్‌ ద్వారా భూరిజిస్ట్రేషన్లలో దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. లంచాలు లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌ చేయడానికి ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

‘ధరణి’తో దళారీ వ్యవస్థ నిర్మూలన
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


మెదక్‌ రూరల్‌; జనవరి 20 : ధరణి పోర్టల్‌ ద్వారా భూరిజిస్ట్రేషన్లలో దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. లంచాలు లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌ చేయడానికి ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. బుధవారం మెదక్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ధరణి పోర్టల్‌, విద్యాసంస్థల పునఃప్రారంభంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో 70 ఏళ్లుగా ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండానే ఉన్నాయని పేర్కొన్నారు. భూముల విషయంలో పోలీ్‌సస్టేషన్‌, కోర్టుల్లో ఎన్నో వివాదాలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పహాణీలో పేరు మార్పిడిని ధరణి పోర్టల్‌ ద్వారా చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఈ సేవలు వేగంగా అందుతున్నాయని తెలియజేశారు. మీ సేవా కేంద్రంలో స్లాట్‌ బుక్‌ చేసుకొని మండల రెవెన్యూ కార్యాలయానికి వెళితే పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ అవుతుందని వివరించారు. గతంలో వీఆర్వోల వల్ల భూ సర్వేల్లో అనేక మార్పులు జరిగేవని, కానీ ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత కలెక్టర్‌ కూడా భూముల విషయాల్లో తలదూర్చేందుకు అవకాశం లేనంతగా పారదర్శకంగా ఉందని తెలియజేశారు. పార్ట్‌-బీలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లాలో 519 రెవెన్యూ భూముల కేసులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలియజేశారు. వీటన్నింటిని నెల రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించామని చెప్పారు. జిల్లాలో 31 వేల సాదాబైనామాల దరఖాస్తులు ఉన్నామని, నెల రోజుల్లో పరిష్కరించేలా చూస్తామని వెల్లడించారు. 

పాఠశాలల్లో తప్పనిసరిగా శానిటైజేషన్‌ చేయాలి

పది నెలల తర్వాత ప్రారంభమవుతున్న పాఠశాలల్లో తప్పనిసరిగా శానిటైజేషన్‌ చేయాలని మంత్రి ఆదేశించారు.   స్కూళ్లు, హస్టళ్లల్లో ఉన్న వస్తువులను పరిశీలించిన తర్వాతనే వినియోగించాలని సూచించారు. ప్రధానంగా పరిసరాలు, తాగునీరు, టాయిలెట్లు మంచిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పారిశుధ్య నిర్వహణకు ఉపాధి హామీ కూలీలను, పంచాయతీ సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులను పాఠశాలలకు పంపేలా పేరెంట్స్‌ కమిటీ సమావేశాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. మూడు రోజుల ముందే అన్ని పాఠశాలలకు సన్నబియ్యం అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, మధ్యాహ్న భోజనం వండేందుకు ఏజెన్సీలు ముందుకు రాకుంటే అక్షయ పాత్ర ద్వారా అందజేయాలని తెలిపారు. గురుకులాల్లో గతంలో ఉన్న కాంట్రాక్టర్‌లనే కొనసాగించాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే ఏంఈవోలు, మండల ప్రత్యేకాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు తప్పనిసరిగా థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు పద్మారెడ్డి, క్రాంతికిరణ్‌, రఘునందర్‌రావు, అటవీశాఖ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, ఇప్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, డీఈవో రమేశ్‌కుమార్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T06:08:02+05:30 IST