బాబా దగ్గరికి అత్తాకోడళ్ల పంచాయితీ.. నిప్పుల్లో నడవమని తీర్పు.. చివరికి ఏమైందంటే..!

ABN , First Publish Date - 2021-08-24T13:21:50+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాకు సంబంధించిన ఒక వీడియో...

బాబా దగ్గరికి అత్తాకోడళ్ల పంచాయితీ.. నిప్పుల్లో నడవమని తీర్పు.. చివరికి ఏమైందంటే..!

ఛింద్వారా: మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఒక మహిళ నిప్పులపై నడుస్తున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది. అత్త... తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించేందుకు ఆ కోడలు నిప్పుల్లో నడిచింది. ఈ ఉదంతం రమాకోనా గ్రామంలోని పురాతన బాబా దర్బార్ ప్రాంగణంలో జరిగింది. ఈ బాబా దర్బార్‌లో మూఢాచారాల తీర్పులు వెలువడుతుంటాయి. ఇదే కోవలో ఆ బాబా... ప్రజా సమస్యలు విన్నాడు. తరువాత  బాబా... మవూ ప్రాంతానికి చెందిన ఒక మహిళను పిలిచాడు.... ‘ఈ మహిళపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈమె భర్తకు ఏదో తినిపించి, వశం చేసుకుంది.... ఈ ఆరోపణ తప్పని నిరూపించాలనుకుంటే ఈమె నిప్పులపై నడవాలంటూ... తనదైన స్టయిల్‌లో తీర్పునిచ్చాడు.


దీంతో ఆ మహిళ బాబా తీర్పును గౌరవిస్తూ... నిప్పుల్లో నడిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నిప్పు కణికల మధ్య ఆమె పాదాలు కాలిన దృశ్యం కూడా వీడియోలో కనిపిస్తోంది. కాగా బాధితురాలి అత్త... ఆమెపై బాబాకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా కోడలు మాట్లాడుతూ తాను బాబా దర్బార్‌లో తన ఇష్టాపూర్వకంగానే నిప్పులపై నడిచి, నిజ నిరూపణ చేసుకున్నానని తెలిపింది. అయితే ఈ వీడియో చూసిన పోలీసులు ఈ ఉదంతంపై దర్యాప్తు ప్రారంభించారు. బాబాను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2021-08-24T13:21:50+05:30 IST