సొంతింటి కలను సాకారం చేస్తున్నాం

ABN , First Publish Date - 2021-01-20T06:36:19+05:30 IST

పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేస్తున్నామని డిప్యూటీ ముఖ్య మంత్రులు నారాయణ స్వామి, ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు.

సొంతింటి కలను సాకారం చేస్తున్నాం
బొమ్మన్‌దొడ్ల సమీపంలోని జగనన్న కాలనీలో తాగునీటి మోటారుకు స్విచ్‌ ఆన్‌ చేస్తున్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌

డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కృష్ణదాస్‌ 


వెదురుకుప్పం, జనవరి 19: పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేస్తున్నామని డిప్యూటీ ముఖ్య మంత్రులు నారాయణ స్వామి, ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. వెదురుకుప్పంలో మంగళవారం  ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి ముంగిటకు తీసుకువచ్చా మన్నారు.పేదలందరికీ ఇళ్లు పథకంలో లబ్ధిపొందని అర్హులెవరైనా వుంటే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ,తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ,కలెక్టర్‌ భరత్‌ గుప్తా తదితరులు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 2.55లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోందన్నారు.అనంతరం  పచ్చికాపల్లం పంచాయతీ బొమ్మన్‌దొడ్ల దళితవాడ సమీపంలో  వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలో  గృహ నిర్మాణ సముదాయానికి శంకుస్థాపన చేశారు.జగనన్న కాలనీకి తాగునీటి సరఫరా మోటారును స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. జేసీ మార్కొండేయులు, హౌసింగ్‌ పీడీ పద్మనాభం, ఆర్డీవో సి.రేణుక, హౌసింగ్‌ డీఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 


ఎంత కష్టం..ఎంత కష్టం


 వెదురుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఇంటి పట్టాలందుకునేందుకు వచ్చిన ఇద్దరు అవ్వలు అస్వస్థతకు గురయ్యారు.  లబ్ధిదారులు తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పడంతో వెదురుకుప్పం చేరుకున్న వారిలో నల్లవెంగనపల్లె పంచాయతీ బండకింద ఇండ్లుకు చెందిన పొన్నెమ్మ(70),మాంబేడు పంచాయతీ గెరిగిదొనకు చెందిన గంగులమ్మ(75) సొమ్మసిల్లి పడిపోయారు. ఆరోగ్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. 

Updated Date - 2021-01-20T06:36:19+05:30 IST