ఎమర్జెన్సీ తప్పిదమే

ABN , First Publish Date - 2021-03-03T07:33:52+05:30 IST

1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించడం ఓ తప్పేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించారు. ‘‘ఆనాడు జరిగినది ఓ తప్పిదం. కచ్చితంగా తప్పే. ఈ విషయాన్ని మా నానమ్మ ఇందిరాగాంధీ

ఎమర్జెన్సీ తప్పిదమే

ఈ విషయాన్ని ఇందిర కూడా చెప్పారు

తొలిసారిగా అంగీకరించిన రాహుల్‌

వ్యవస్థల్లోకి సంఘ్‌ తన మనుషుల్ని జొప్పించింది

బీజేపీని ఓడించినా వారిని తొలగించడం కష్టమని వ్యాఖ్య


న్యూఢిల్లీ, మార్చి 2: 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించడం ఓ తప్పేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించారు. ‘‘ఆనాడు జరిగినది ఓ తప్పిదం. కచ్చితంగా తప్పే. ఈ విషయాన్ని మా నానమ్మ ఇందిరాగాంధీ కూడా అంగీకరించారు. కానీ ఇపుడు దేశంలో జరుగుతున్నది మౌలికంగా భిన్నమైనది.  వ్యవస్థలను లోబర్చుకోవాలని కాంగ్రెస్‌ ఎన్నడూ ప్రయత్నించలేదు’’ అని ఆయన  ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత మాజీ ఆర్థిక సలహాదారు, అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ కౌశిక్‌ బసుతో జరిపిన సంభాషణలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ‘‘అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ గౌరవిస్తుంది. స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ, రాజ్యాంగాన్ని అందించిన పార్టీ, ఇపుడు సమానత్వం కోసం నిలబడ్డ పార్టీ మాది. వ్యవస్థలను అదుపాజ్ఞల్లో పెట్టుకునేంత సామర్థ్యం మాకు లేదు. మా పార్టీ రూపొందిన తీరు అందుకు అంగీకరించదు. కానీ ఆర్‌ఎ్‌సఎస్‌ మౌలికంగా భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తోంది. వ్యవస్థల్లో తన భావజాలమున్న వ్యక్తులను జొప్పించింది. మేం ఎన్నికల్లో బీజేపీని ఓడించినా వ్యవస్థల్లోంచి ఈ వ్యక్తులను బయటకు పంపడం వీలుకాదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 


‘‘మధ్యప్రదేశ్‌లో మా ప్రభుత్వం పతనం కావడానికి కొద్ది రోజుల ముందు అప్పటి మా ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ నాతో ఓ విషయం అన్నారు.... బ్యూరోక్రాట్లలో, ప్రభుత్వ ఉన్నతస్థాయి యంత్రాంగంలో చాలా మంది ఆర్‌ఎ్‌సఎస్‌ మనుషులున్నారని, తాను చెప్పిన పనిని వారు చేయరని ఆయన నాతో చెప్పారు.’ అని రాహుల్‌ వివరించారు. జీ-23 నేతలు పార్టీలో సమూల సంస్కరణలకు, ఎన్నికలకు పట్టుబడుతుండడాన్ని రాహుల్‌ పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘యువజన కాంగ్రె్‌సలో, విద్యార్థి సంఘంలో ఉన్నపుడు అంతర్గత ఎన్నికలకు తీవ్రంగా పట్టుబట్టాను. అలా కోరినందుకు మా కాంగ్రె్‌సవాళ్లే నన్ను విమర్శించారు. పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం  ఆవశ్యకం.ఆశ్చర్యమేమంటే అంతర్గత ప్రజాస్వామ్యం మిగిలిన పార్టీల్లో.. అంటే బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మొదలైన పార్టీల్లో ఎంత అన్నది ఎవరూ అడగరు. ఒక్క కాంగ్రె్‌సనే అడుగుతారు. ఈ దేశ రాజ్యాంగపు సిద్ధాంతాలను అనుసరించే పార్టీ అందుకే మేం మరింత ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం’’ అని రాహుల్‌ విశదీకరించారు.

Updated Date - 2021-03-03T07:33:52+05:30 IST