ఆ మాత్రం డబ్బొస్తే చాలనుకున్నా...

ABN , First Publish Date - 2021-09-15T05:38:16+05:30 IST

ఏ మాత్రం అంచనాలు లేకుండా గ్రాండ్‌స్లామ్‌లో అడుగుపెట్టి... టైటిల్‌ గెలిచి, ఎన్నో రికార్డులు సాధించిన ఎమ్మా రదుకాను ఇప్పుడు క్రీడా రంగంలో సరికొత్త సెలబ్రిటీ...

ఆ మాత్రం డబ్బొస్తే చాలనుకున్నా...

ఏ మాత్రం అంచనాలు లేకుండా గ్రాండ్‌స్లామ్‌లో అడుగుపెట్టి... టైటిల్‌ గెలిచి, ఎన్నో రికార్డులు సాధించిన ఎమ్మా రదుకాను ఇప్పుడు క్రీడా రంగంలో సరికొత్త సెలబ్రిటీ. ‘‘అంకితభావం, మనో స్థైర్యం ఉన్నప్పుడు... మనం ఏది కోరుకుంటే అది సాధించగలం’’ అని చెబుతున్న పద్ధెనిమిదేళ్ళ ఎమ్మా ‘‘మనమీద అందరికీ ఉన్న అంచనాలే విజయానికి చోదక శక్తి’’ అంటోంది.


‘‘నేను బాగా ఆడగలననుకున్నా. కానీ ఫైనల్స్‌కు చేరుతాననీ, టైటిల్‌ సాధిస్తాననీ ఊహించలేదు. అందుకే రెండువారాల కిందటే ఇంగ్లండ్‌కి విమానం టిక్కెట్లు కూడా బుక్‌ చేసుకున్నా’’ అని చెప్పిన ఎమ్మా రదుకాను పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. గత వారం న్యూయార్క్‌లో జరిగిన యుఎస్‌ ఓపెన్‌లో అసాధారణ ప్రదర్శన చేసిన ఎమ్మా 150వ ర్యాంక్‌ నుంచి ఏకంగా 23వ ర్యాంక్‌కు దూసుకెళ్ళింది. యాభై మూడేళ్ళ తరువాత యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన బ్రిటన్‌ క్రీడాకారిణిగా, గెలుపు సాధించిన తొలి క్వాలిఫయర్‌గా, రెండవ అతి పిన్నవయస్కురాలుగా... ఇలా ఎన్నో రికార్డుల్ని తిరగరాసింది. ఈ ఏడాది జూలైలో జరిగిన వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో శ్వాసకు సంబంధించిన ఇబ్బందితో నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లోంచీ అర్థంతరంగా తప్పుకున్న ఆమె... రెండు నెలల్లో నేలకు కొట్టిన బంతిలా పైకి లేచి... ఈ టోర్నమెంట్‌లో ఒక్క సెట్‌నూ కోల్పోకుండా నిలిచిన తీరు అపూర్వం.


టెన్నిస్‌ కోర్టులో స్కూల్‌ వర్క్‌...

ఎమ్మా పుట్టింది కెనడాలో. ఆమె తల్లితండ్రులు ఆర్థిక రంగ నిపుణులు. తల్లి రెనీ స్వదేశం చైనా, తండ్రి ఇయాన్‌ది రూమేనియా. రెండేళ్ళ వయసులోనే ఆ కుటుంబం కెనడా నుంచి ఇంగ్లండ్‌ వచ్చి స్థిరపడింది. తన బహుళ జాతుల మూలాల విషయంలో గర్వపడతానని చెప్పే ఎమ్మా మాండరిన్‌ భాష చక్కగా మాట్లాడుతుంది. టీవీలో తైవానీస్‌ కార్యక్రమాలు చూస్తుంది. అయిదేళ్ళ వయసులో టెన్నిస్‌ ఆడడం మొదలుపెట్టినా అదే తన కెరీర్‌ అవుతుందని ఆమె అనుకోలేదు. బ్రూమ్లీ టెన్నిస్‌ సెంటర్‌లో పదేళ్ళ వయసు నుంచి పదహారేళ్ళ వరకూ ఎమ్మా శిక్షణ తీసుకుంది. ‘‘ఆమెది బాగా కష్టపడే తత్వం. వాళ్ళ స్కూల్‌ పక్కనే మా టెన్నిస్‌ సెంటర్‌ ఉంది. తరగతులకు వెళ్ళడానికి ముందు, బడి అయిపోయిన తరువాత, అప్పుడపుడు ఖాళీ సమయాల్లో కూడా ఆమె ప్రాక్టీస్‌కు వస్తూ ఉండేది’’ అని గుర్తు చేసుకున్నారు ఆ సెంటర్‌కు చెందిన ట్రైనర్స్‌. మరోవైపు చదువులోనూ ఆమె టాప్‌.  ‘‘సమయం వృథా చెయ్యడం ఆమెకు ఇష్టం ఉండదు. ఒక విషయం మీద దృష్టి పెడితే... ఆమెకు అదే లోకం. ఫుల్‌టైమ్‌ స్టూడెంట్‌ అయినా ప్రతిరోజూ కనీసం మూడు నాలుగు గంటలు టెన్నిస్‌ ప్రాక్టీస్‌ చేసేది. మరి కొంత సమయం జిమ్‌లో గడిపేది. ప్రాక్టీస్‌ మధ్య విరామంలో ఆమె స్కూల్‌ వర్క్‌ చేసుకుంటూ కనిపించేదం’’టారు ఆమెతో పాటు శిక్షణ పొందినవాళ్ళు.  


అది చాలా పెద్ద గౌరవం...

2018లో వరల్డ్‌ జూనియర్‌ ర్యాంకింగ్ప్‌లో 20వ స్థానం సాధించిన తరువాత... ఆమె కెరీర్‌ ఊపందుకుంది. పద్ధెనిమిదేళ్ళు వచ్చాక... నాటింగ్‌హామ్‌లో జరిగిన వికింగ్‌ ఓపెన్‌లో అవకాశం వచ్చినా... ఫస్ట్‌ రౌండ్‌లోనే వెనుతిరగాల్సి వచ్చింది. కానీ వారం రోజుల తరువాత జరిగిన మరో టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌ చేరింది. తన ఆట తీరుతో వింబుల్డన్‌లో ఎంట్రీ సాధించింది. ఇక, యుఎస్‌ ఓపెన్‌లో లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ (ఎల్‌టిఎ) పూర్తి మద్దతు సైతం ఆమెకు లభించింది. అయితే టైటిల్‌ గెలుస్తానని ఆమె ఊహించలేదు. ‘‘యుఎస్‌ ఓపెన్‌ ఫస్ట్‌ రౌండ్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌కు ముందు నా ఎయిర్‌ పాడ్స్‌ పోయాయి. నా లక్ష్యం ఒక్కటే... కొత్తవి కొనుక్కోడానికి సరిపోయే డబ్బు సంపాదించాలని’’ అని చెబుతోందామె. ఈ గెలుపుతో ఆమెకు ప్రైజ్‌ మనీగా రూ. 18 కోట్లకు పైనే వచ్చాయి. ‘‘ఫైనల్‌ మ్యాచ్‌ ముందు కొంచెం నెర్వస్‌గా అనిపించింది. అమ్మా, నాన్నా దగ్గరుంటే బావుండేదనిపించింది. ఈ స్థాయికి తను చేరడానికి కారణం తన తల్లితండ్రులే. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఓ స్పోర్ట్స్‌ ఐకాన్‌గా నిలవాలన్న కోరికను కలిగించింది వాళ్ళే. అయితే... డెల్టా వేరియంట్‌ కేసులు ఎక్కువగా ఉండడంతో... ప్రయాణాలపై ఆంక్షలున్నాయి. దాంతో వాళ్ళు న్యూయార్క్‌ రావడానికి వీలు పడలేదు’’ అని చెప్పింది ఎమ్మా. తాజా విజయంతో వచ్చిన సెలబ్రిటీ స్టేటస్‌కు ఇప్పుడిప్పుడే ఆమె అలవాటుపడుతోంది. ‘‘నాకు సిగ్గెక్కువ. కొన్నాళ్ళ క్రితం వరకూ ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఆట కారణంగా నా దృక్పథం క్రమంగా మారుతూ వస్తోంది. కానీ మీడియాలో మాట్లాడ్డం కాస్త ఇబ్బందే’’ అంటోందామె. ‘‘నాకు నా స్కూల్‌ ఫ్రెండ్స్‌ నుంచి చాలా మెసేజ్‌లు వస్తున్నాయి, ఎందరో క్రీడాతారలు, ప్రముఖులు అభినందిస్తున్నారు. అయితే ‘‘ఇంత చిన్న వయసులో ఇది అద్వితీయమైన విజయం, నీ కృషికీ, అంకిత భావానికీ ఇది నిదర్శనం’’ అంటూ ఇంగ్లండ్‌ రాణి నుంచి వచ్చిన అభినందన సందేశాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా’’ అని చెబుతోంది ఎమ్మా.




టెన్నిస్‌ స్టార్‌ కాకపోతే...

ఎమ్మా రదుకాను పేరు ప్రపంచానికి ఇప్పుడు తెలిసి ఉండొచ్చు, కానీ ఆమె ఎక్కణ్ణించో హఠాత్తుగా ఊడిపడలేదు. టెన్నిస్‌ వర్గాల్లో ఆమె పేరు సుపరిచితమే. తొమ్మిదేళ్ళ వయసులో ఎల్‌టిఎ వింటర్‌ నేషనల్స్‌లో ఆమె విజేత. ఫ్రాన్స్‌లో జరిగిన ‘టెన్నిస్‌ యూరప్‌ 11 అండర్‌’ ఈవెంట్‌లో విజేతగా నిలిచి, తొలి అంతర్జాతీయ విజయాన్ని ఆమె దక్కించుకుంది. పదమూడేళ్ళప్పుడు మొదటి ‘జూనియర్‌ ఐఎఫ్‌టి’ టైటిల్‌ గెలిచింది. తరువాత రెండేళ్ళకు ‘బ్రిటిష్‌ జూనియర్‌ నెంబర్‌వన్‌’గా ఆవిర్భవించింది. హార్స్‌ రైడింగ్‌, ట్యాప్‌ డ్యాన్సింగ్‌, బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌బాల్‌, గోల్ఫ్‌, స్కీయింగ్‌... ఇలా ఆమెకు ఎన్నో హాబీలు ఉన్నాయి. టెన్నిస్‌ క్రీడాకారిణి కాకపోయి ఉంటే లాయర్ని అయ్యేదాన్నని చెప్పే ఎమ్మా తీరు మామూలు టీనేజ్‌ అమ్మాయిలానే ఉంటుందంటారు ఆమె స్నేహితులు. ఆమె వాళ్ళతో సెల్ఫీలు తీసుకుంటుంది. సరదాగా టూర్స్‌ వెళ్తుంది. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటుంది. కొరియన్‌ వంటకాలు ఇష్టం. చాక్లెట్లంటే ప్రాణం.

Updated Date - 2021-09-15T05:38:16+05:30 IST