ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

ABN , First Publish Date - 2021-11-10T05:23:01+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం వానాకాలం సీజన్‌ వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

 డిసెంబరు 10న పోలింగ్‌ 

టీఆర్‌ఎ్‌సకు పూర్తిస్థాయి మెజారిటీ

రేసులో తేరా, కోటిరెడ్డి, చాడ 

చాయ్‌, బిస్కెట్‌తోనే సరా?

అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో చర్చ 

అమల్లోకి ఎన్నికల కోడ్‌

ధర్నాలు, సభలకు నో 

 డైలమాలో షర్మిల పాదయాత్ర

 ఉమ్మడి జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారంతో అధికార, ప్రతిపక్ష నేతలు ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నామినేటెడ్‌ పదవులకు నోటిఫికేషన్‌ వెలువడగా, జిల్లా     నుంచి పలువురు నేతలు పోటీలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు డిసెంబరు 10న పోలింగ్‌ నిర్వహించనున్నారు.


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ)

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం వానాకాలం సీజన్‌ వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేయగా, దీనిపై అధికార టీఆర్‌ఎస్‌ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం నిరసనలు కొనసాగుతున్నాయి. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ఉమ్మడి జిల్లా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ సభలు, సమావేశాలకు బ్రేక్‌ పడింది. జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర అయోమయంలో పడింది. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. అధికార పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉండటం, కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఎవ్వరూ ఆసక్తి చూపే పరిస్థితి లేకపోవడంతో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థే ఎమ్మెల్సీ కావడం దాదాపు ఖాయమైంది. ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఖర్చులు వెళ్తాయని అనుకున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అంచనాలు ఈసారి ఏ మేరకు నెరవేరుతాయో చూడాల్సిందే.


మూడేళ్లకే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2015 డిసెంబరు చివరి లో ఎన్నికలు నిర్వహించారు. ఆరేళ్ల పదవీ కాలానికి నాటి ఎన్నికల్లో కాంగ్రె్‌సకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై విజయం సాధించారు. ఆయన 2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మె ల్సీ పదవికి రాజీనామా చేశారు. మూడేళ్ల పదవీకాలం మిగిలి ఉండగా నే రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో తిరిగి ఎన్నిక అనివార్యమైంది. 2019 లో స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసిన తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి పై విజయం సాధించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, మునిసిపల్‌ కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులంతా కలిపి నాడు 1085 మంది ఓటర్లు ఉండగా, 1075 పోలయ్యాయి.


పెరిగిన 200 ఓటర్లు

ఎమ్మెల్సీ సమయంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానికసంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా పరిషత్‌లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అత్యధిక ఎంపీటీసీ, ఎంపీపీ, మునిసిపాలిటీలను సైతం అధికార పార్టీ గెలుచుకుంది. ఇటీవల చండూరు, చిట్యాల, నాగార్జునసాగర్‌, హాలియా వంటి కొత్త మునిసిపాలిటీలు సైతం టీఆర్‌ఎస్‌ ఖాతాల్లోకే వెళ్లాయి. ఎక్స్‌అఫీషియో ఓట్లు సహ, తాజాగా నిర్వహించనున్న ఎన్నికల్లో 1271 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నల్లగొండ జిల్లాలో 566 ఓట్లు ఉన్నాయి. వాస్తవానికి 570 కాగా, నాలుగు ఖాళీ ఏర్పడ్డాయి. సూర్యాపేట జిల్లాలో 402 (వాస్తవానికి 405 కాగా, మూడు ఖాళీ), యాదాద్రి భువనగిరి జిల్లాలో 303 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఓట్లు 1278కు ఏడు ఖాళీలు ఉన్నాయి. గతంతో పోలిస్తే 200మంది ఓటర్లు పెరిగారు.


 అవకాశం ఎవరికో..

దాదాపు ఎన్నిక ఏకపక్షం కానుండటంతో నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూస్తున్న అధికార పార్టీ నేతలు దీన్ని అవకాశంగా భావించి అధినేతపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తేరా చిన్నపరెడ్డికి మరోసారి అవకాశం ఇస్తారన్న వాదన అధికార పార్టీలో వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తానని ఎంసీ కోటిరెడ్డికి సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఆశ పెట్టుకున్నారు. నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవి సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవకాశం దక్కకపోతే, స్థానిక సంస్థల నుంచి అవకాశం కోటిరెడ్డి కోరుతున్నారు. ఇదే కోవలో చాడ కిషన్‌రెడ్డి, కర్నాటి విద్యాసాగర్‌ సైతం రేసులోకి దిగారు.


అమల్లోకి ఎన్నికల కోడ్‌

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఖరారు కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించడానికి వీలు లేదు. రాజకీయ సమావేశాలకు అనుమతి లేదు. 500 మంది కంటే ఎక్కువ మందితో సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు. దీంతో ఈనెల 12న టీఆర్‌ఎస్‌, సీపీఎం నేతలు ఇచ్చిన ఆందోళనల పిలుపులు కోడ్‌ పరిధిలోకి రానున్నాయి. అదేవిధంగా వైఎస్‌ షర్మిల పాదయాత్ర డైలమాలో పడింది. అయితే తమది పాదయాత్ర కావడంతో ఎన్నికల కోడ్‌ పరిధిలోకి రాదని, ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు పోలీస్‌ సిబ్బంది అడ్డుకుంటే అప్పుడు ఆలోచించాలని, అప్పటి వరకు యథాతథంగా పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి తెలిపారు.


ఎన్నిక ఏకపక్షమే!

ఓటర్లలో 90శాతానికి పైగా అధికార టీఆర్‌ఎస్‌ పా ర్టీ చెందిన వారే ఉన్నారు. అధినే త కేసీఆర్‌ సూచించినవారే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకా శం ఉంది. కాంగ్రెస్‌ నుంచి లేదా ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రె్‌సకు నామమాత్రపు ఓట్లే ఉన్నాయి. పోటీకి దిగితే ఎదుటి పార్టీ ఓటర్లకు చెల్లింపులు, ఎన్నికల క్యాంప్‌ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రె్‌సతోపాటు ఇతర పార్టీలు సైతం పోటీకి ఆసక్తి చూపకపోవచ్చు. స్వతంత్రులు ఎవరైనా పోటీకి దిగితే ఎన్నిక ప్రక్రియ అనివార్యం అవుతుంది. ఎన్నిక ఏకపక్షంగా కొనసాగే అవకాశం ఉండటంతో గతానికి భిన్నంగా చాయ్‌, బిస్కెట్‌తో సరిపెట్టుకోవాల్సిందేనా అని అధికార పార్టీలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో చర్చ కొనసాగుతోంది. 







Updated Date - 2021-11-10T05:23:01+05:30 IST