Abn logo
Apr 8 2021 @ 02:27AM

ఊరు కన్నీరాయె!

  • మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో భావోద్వేగం.. 
  • ఇళ్లు, బంధాలు, తల్లిలాంటి ఊరుకు భారంగా వీడ్కోలు
  • రోదిస్తూ ఆలింగనాలు, సామాన్లతో పునరావాస కాలనీకి.. 
  • ఖాళీ అవుతున్న మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలు

ఆ ఇల్లు ఇల్లులా లేదు. చెంబు, చాట, పలుగు, పార ఇలా సామాన్లన్నీ వ్యాన్లలోకి తరలుతూ ఒక్కొక్క గదీ ఖాళీ అవుతుంటే ఆ ఇల్లే కళ తప్పింది. ఇన్నాళ్లూ నీడనిచ్చి చక్కని గూడుగా వెలుగొందిన తాను ఇక  నీటి ముంపులో శిథిలమై.. మట్టిలో మట్టిగా కలిసిపోతానని తెలిసి బోసిపోయింది. మునుపటిలా నీళ్లతో కడిగి.. సానిపి చల్లి.. ముగ్గులు పెట్టేవారుండరని కావొచ్చు ఆ ఇళ్ల గడపలు, వాకిళ్లు కూడా కళ కోల్పోయాయి. ఈ బాధంతా ఆ ఊరి ప్రజల గుండెలను కరిగించి.. కన్నీరుగా బయటపడింది.  ప్రాణం లాంటి ఇంటిని, కన్నతల్లిలాంటి ఊరును, ఏళ్లుగా అరమరికలు లేకుండా  కలిసి మెలిసి ఉంటూ పెనవేసుకుపోయిన బంధాలను వీడలేక.. వీడక తప్పదనే వాస్తవం జీర్ణించుకోలేక.. వీడ్కోలంటూ ఒక్కొక్కరిగా ఊర్ల నుంచి తరలిపోతున్నారు! ఖాళీ అయ్యే ఏ గడప వద్ద చూసినా అక్కా.. పైలం.. చెల్లె పైలం.. అత్తా పైలం అని చెప్పుకొంటూ రోదిస్తున్న మహిళలే కనిపిస్తున్నారు. ఇలా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ముంపు గ్రామాల బాధితుల్లో ఎవ్వరిని కదిలించినా  భోరుమంటున్నారు.


సిద్దిపేట, ఆంధ్రజ్యోతి/తొగుట, ఏప్రిల్‌ 7:  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా  సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మిస్తున్న 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ ముంపు గ్రామాలు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. ఊళ్లు విడిచిన వారంతా తిరిగి ముట్రాజ్‌పల్లి పునరావాస కాలనీలో స్థిరపడేవారే. కానీ ఇన్నాళ్లూ తమ ఊరితో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేక వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ఇంట్లోంచి బయటకు వస్తూ గుమ్మాలను, గోడలను అప్యాయంగా తడుముకుంటూ, గ్రామ పరిసరాలను తనివితీరా చూసుకుంటున్నారు. ప్రభుత్వ భవనాలు, పాఠశాల భవనాలు, చేతిపంపులు, గ్రామదేవతల ఆలయాల వద్దకు చేరుకొని భావోద్వేగ వాతావరణంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే భూములు కోల్పోయామని, మరికొద్ది రోజుల్లో ఈ ఇండ్లు కూడా కానరావని గుర్తుచేసుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకోవడం కనిపించింది.

ఆ తొమ్మిది గ్రామాలు పూర్తిగా..  

కాగా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌తో తొగుట మండలంలో 7 గ్రామాలు, కొండపాక మండలంలో 2గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల నిర్వాసితులకు గజ్వేల్‌ పట్టణ సమీపంలోని ముట్రాజ్‌పల్లిలో అన్ని వసతులతో పునరావాస కాలనీని నిర్మించారు. దాదాపు అందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, ఇతర లబ్ధి చేకూర్చారు. ఈ క్రమంలో మల్లన్నసాగర్‌ కట్టలోపల ఉన్న ఈ గ్రామాలను ఖాళీ చేయిస్తే నీటిని నింపవచ్చునని అధికారులు భావిస్తున్నారు. అందుకే గ్రామాలు ఖాళీ చేసి వెళ్లాలంటూ సూచనలు ఇచ్చారు. పూర్తి పరిహారాలు అందినవారు అధికారుల మాటకు కట్టుబడి వెళ్లిపోతున్నారు. ఇంకొందరు పలు అభ్యంతరాలు చెబుతున్నారు. గతంలో కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం, తొగుట మండలం రాంపూర్‌, లక్ష్మాపూర్‌ గ్రామాల ప్రజలు ఖాళీ చేశారు. తాజాగా ఏటిగడ్డకిష్టాపూర్‌, వేములఘాట్‌, పల్లెపహడ్‌ గ్రామాల ప్రజలు ఖాళీ చేస్తున్నారు. 

పోతుంటే బాదైతాంది..

కన్నతల్లి లాంటి ఊరువిడిచి పోతుంటే బాదైతాంది. ఇన్నిరోజులు ఇక్కడ అందరం ఒకరికి ఒకరం కలిసి ఉన్నం. ఇప్పుడు కానరాని కాడికి పోవాల్సి వచ్చింది. ఎట్లా బతుకుతామో అని భయమైతాంది. మాకు ప్యాకేజీ డబ్బులు వచ్చినాయి. ఓపెన్‌ ప్లాట్‌ ఇచ్చిండ్రు. ఆ డబ్బులతో ఇల్లు కట్టుకుంటం. 

                                                                                                రాణమ్మ, వేములఘాట్‌

ఎట్ల బతుకతమో ఏమో?

ఊరిలో ఉన్నపుడు ఉన్న రోజు తిన్నం. లేని రోజు ఉపాసమున్నాం. కలో, గంజో తాగి బతికినం. ఇప్పుడు పోవడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. కానీ ఊరు దాటితే మా బతుకులు ఏమైతాయో అనే భయం కూడా ఉన్నది. ఎట్లా బతుకుతామో తెలుస్తలేదు. మాకు ప్యాకేజీ వచ్చింది. ఇంకా కొంత పరిహారం రావాలె. డబుల్‌ బెడ్రూం వద్దనుకున్న. ఓపెన్‌ ప్లాటు ఇచ్చిన్రు.

                                                                                                       ఎం.డీ రజబ్‌ అలీ

Advertisement
Advertisement
Advertisement