Abn logo
Jul 30 2021 @ 01:27AM

ఉద్యోగుల బిల్లులూ బంద్‌!

ఖజానాలో కాసుల్లేక నిలుపుదల

రాష్ట్రంలో 8 వేలపైనే బిల్లులు పెండింగ్‌

ఆగిన కోట్లాది రూపాయల చెల్లింపులు

జీపీఎఫ్‌, బీమా, డీఏ, మెడికల్‌ బిల్లులకు బ్రేక్‌

ఉద్యోగ విరమణానంతర ఫలాలకూ దిక్కు లేదు

సీపీఎస్‌ ఉద్యోగుల డీఏ బిల్లులు 300 కోట్లపైనే

పెండింగ్‌లో 13 వేల కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు 

చేతులెత్తేస్తున్న ట్రెజరీ, పేఅండ్‌అకౌంట్స్‌ అధికార్లుమంచిర్యాల/హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, భవనాల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్ల బిల్లులే కాదు... ప్రజలకు నిత్యం సేవలందించే ఉద్యోగుల బిల్లులకూ మోక్షం కలగడం లేదు. ఖజానాలో కాసుల్లేక బిల్లులన్నీ ట్రెజరీలు, పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసుల్లోనే మూలుగుతున్నాయి. డ్రాయింగ్‌ అండ్‌ డిస్‌బర్స్‌మెంట్‌ ఆఫీసర్లు(డీడీవోలు) ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ బిల్లులను పంపుతున్నా... ఫలితం దక్కడం లేదు. దీంతో 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఉద్యోగుల బిల్లులే దాదాపు 8వేల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించి వందల కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. ఈ అంశంపై ఎప్పుడు అడిగినా.. రేపు మాపు అంటూ ఆర్థిక శాఖ అధికారులు దాట వేస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు వాపోతున్నారు. వాస్తవానికి గత ఏడాదితోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో సరిపడా నిధుల్లేక సాధారణ బిల్లులనూ ప్రభుత్వం చెల్లించలేకపోతుంది. పలు అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల బిల్లులే రూ.13వేల కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే తీరులో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించిన సప్లిమెంటరీ బిల్లులు కూడా పేరుకుపోయాయి. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వస్తే తప్ప ట్రెజరీల్లో క్లియర్‌ చేయడం లేదు. ముఖ్యంగా జీపీఎఫ్‌, టీఎ్‌సజీఎల్‌ఐఎఫ్‌, టీఎ్‌సఈజీఐఎస్‌, మెడికల్‌ రీ-యింబర్స్‌మెంట్‌, డీఏ, లీవ్‌ఎన్‌క్యా్‌షమెంట్‌ బిల్లులతో పాటు పదవీ విరమణానంతరం కలిగే ఆర్థిక ప్రయోజనాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.


2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బిల్లులన్నింటినీ క్లియర్‌ చేస్తామని ఈ ఏడాది జనవరిలో ఆర్థిక శాఖ ప్రకటించింది. మార్చి31 కల్లా పెండింగ్‌ బిల్లులను ట్రెజరీ కార్యాలయాలకు పంపించాలని ఆదేశించింది. ఆ మేరకు అన్ని శాఖలు తమ ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను పంపించినా.. వాటిని క్లియర్‌ చేయలేకపోయింది. ఈ బిల్లులన్నీ ఇన్‌వ్యాలిడ్‌ అయ్యాయని, మళ్లీ తాజాగా తయారు చేసి పంపించాలంటూ ఏప్రిల్‌లో మరోసారి ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ అన్ని శాఖలు బిల్లులను పంపినా.. ఇప్పటికీ క్లియర్‌ కాలేదు. ఇక, ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ నుంచి కొత్త బిల్లులు.. వీటికి జత కలిశాయి. దీంతో పాత, కొత్త బిల్లులు మొత్తం కలిపి ఇప్పుడు ట్రెజరీ కార్యాలయాల్లో 8 వేల వరకు ఉన్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వివరిస్తున్నాయి. 


పెండింగ్‌లో ఉన్నవి ఈ బిల్లులే...

ఉద్యోగులు, ఉపాధ్యాయుల మూల వేతనం నుంచి జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(జీపీఎఫ్‌) కింద ప్రతి నెలా కనిష్ఠంగా 6ుచొప్పున కట్‌ అవుతుంది. ఉద్యోగ విరమణ సమయంలో ఈ సొమ్మును క్లెయిమ్‌ చేసుకుంటే.. ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.20లక్షల వరకు వస్తాయి. గరిష్ఠంగా రూ.40లక్షలు క్లెయిమ్‌ చేసే వారూ ఉంటారు. అయితే, చాలా మంది సర్వీసు మధ్యలోనే పిల్లల చదువులు, ఇళ్ల స్థలాల కొనుగోలు, నిర్మాణాల కోసం ఇందులో నుంచి 50శాతం మేర అడ్వాన్సులు తీసుకుంటారు. ఇందుకోసం పెట్టిన బిల్లులు క్లియర్‌ కావడం లేదు. 

తెలంగాణ స్టేట్‌ గవర్నమెంట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌(టీఎ్‌సజీఎల్‌ఐ) కింద ఒక్కో ఉద్యోగి వేతనం నుంచి నెలకు రూ.100 నుంచి రూ.2000 వరకు ప్రభుత్వం కట్‌ చేస్తుంది. ఉద్యోగి మరణిస్తే... దాదాపు రూ.5-6లక్షల వరకు బీమా సొమ్ము అందుతుంది. ఇలా చనిపోయినవారి కుటుంబ సభ్యులు పెట్టుకున్న బిల్లులు రావడం లేదు. రిటైర్‌ అయిన తర్వాత వచ్చే రూ.30-40వేల బీమా సొమ్మూ సకాలంలో అందడం లేదు. 

  తెలంగాణ స్టేట్‌ ఎంప్లాయిస్‌ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌(టీఎ్‌సఈజీఐఎస్‌) కింద కూడా వేతనాల నుంచి నెలకు రూ.15 నుంచి రూ.120 వరకు ప్రభుత్వం కట్‌ చేస్తుంది. దీని కింద ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.15,000 నుంచి రూ.1,20,000 వరకు రావాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి బిల్లులు పెట్టినా డబ్బు మంజూరు కావడం లేదు. 

ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) అమల్లో లేనందున.. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారు బిల్లులను రీయింబర్స్‌ చేయాలంటూ ప్రభుత్వానికి బిల్లులు పెడుతున్నారు. సాధారణంగా రూ.50వేల లోపు బిల్లులను ఆయా శాఖల హెచ్‌వోడీలే ఆమోదిస్తారు. అంతకుమించిన బిల్లులను డైరెక్టర్‌ ఆఫ్‌మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిశీలనకు పంపిస్తారు. ఇలా అప్రూవ్‌ అయిన బిల్లులన్నీ ట్రెజరీల్లోనే మూలుగుతున్నాయి. 

పదవీ విరమణ పొందిన ఉద్యోగులపైనా ప్రభుత్వం కనికరం చూపడం లేదు. ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజే అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించి.. సగౌరవంగా వారిని వాహనాల్లో ఇళ్ల వద్ద దింపి రావాలన్న కేసీఆర్‌ ఆదేశాలు.. క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. రిటైర్‌ అయిన తర్వాత ఉద్యోగులకు బీమా, ప్రావిడెంట్‌ ఫండ్‌ సొమ్ముతో పాటు రూ.16లక్షల చొప్పున గ్రాట్యుటీ అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది పదవీ విరమణ చేయగా.. వారికి సంబంధించిన బిల్లులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్‌ అయిన తర్వాత 300వరకు సెలవులను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తారు. ఇవి కూడా ఎన్‌క్యాష్‌ కావడం లేదు. నిజానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించిన సప్లిమెంటరీ బిల్లులను డీడీవోలు తయారు చేసి జిల్లాల్లోనైతే ట్రెజరీ కార్యాలయాలకు, జంటనగరాల్లోనైతే పే అండ్‌ అకౌంట్స్‌ కార్యాలయాలకు పంపిస్తున్నారు. కానీ.. నిధుల్లేక అవి నెలల తరబడి కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. 


సీపీఎస్‌ డీఏ బిల్లులూ పెండింగే

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) ఉద్యోగులకు సంబంధించిన డీఏ(డియర్‌నెస్‌ అలవెన్స్‌) బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. సీపీఎస్‌ ఉద్యోగులకు సంబంధించిన 2019 జూలై డీఏను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ బకాయిలను 2020 సంవత్సరం నవంబరు, డిసెంబరు, 2021 సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో చెల్లిస్తామని చెప్పింది. ఈ నాలుగు వాయిదాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ డీఏ కింద ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.20 వేల వరకు రావాల్సి ఉంది. లక్షా 50 వేల మంది ఉద్యోగులకు సంబంధించి రూ.300 కోట్లు క్లియర్‌ కావాల్సి ఉన్నా.. మోక్షం లభించడం లేదు.


పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌ బిల్లులన్నింటినీ ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఉద్యోగులు తమ ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేసుకొనే జీపీఎఫ్‌, టీఎ్‌సజీఎల్‌ఐ, లీవు ఎన్‌క్యా్‌షమెంట్‌ను మంజూరు చేయాలి. సప్లిమెంటరీ బిల్లులు మంజూరు కావనే అభిప్రాయాన్ని తొలగించి వేతనాలపై ఆధారపడే జీవులకు ఊరట కలిగించాలి. లేనిపక్షంలో తపస్‌ ఆధ్వర్యంలో పెండింగ్‌ సమస్యలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.

బండి రమేశ్‌, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి