సమర సన్నాహాలు

ABN , First Publish Date - 2022-01-24T08:30:12+05:30 IST

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా మూకుమ్మడిగా ఉద్యమించాలని ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి.

సమర సన్నాహాలు

జిల్లాల్లో జోరుగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు

వేతన సవరణ పేరిట మోసం

మనల్ని దోషులుగా చిత్రిస్తూ ప్రచారం

దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని తీర్మానాలు

రేపు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు

డీఏలు కలిపిన పాత జీతాలే ఇవ్వాలి

నేటి నుంచి ఫిబ్రవరి 7వరకుఉద్యమ కార్యాచరణ


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా మూకుమ్మడిగా ఉద్యమించాలని ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాల్సిందేనని తేల్చిచెప్పాయి. డీఏలు కలిపి పాత వేతనాలనే ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించాయి. అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చి సమావేశాల్లో పాల్గొన్నారు. ఉద్యమ కార్యాచరణపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చర్చించారు. అశుతోష్‌ మిశ్రా కమషన్‌ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడం అత్యంత దారుణమన్నారు. పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేయకుండా ఫిట్‌మెంట్‌ ప్రకటించడం చరిత్రలో ఎన్నడూ లేదని ధ్వజమెత్తారు. సమ్మెబాటపట్టడానికి సిద్ధమని ప్రకటించారు.


ఉద్యోగుల ఆశలను సీఎం జగన్‌ అడియాస చేశారని మండిపడ్డారు. ఐఆర్‌ 27 శాతం ఇచ్చినట్లే ఇచ్చి ఫిట్‌మెంట్‌ను 23 శాతానికి పరిమితం చేయడంపై మండిపడ్డారు. వారంలో రద్దుచేస్తామని చెప్పిన సీపీఎస్‌ రద్దు ఊసే లేకపోవడం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల పెంపు వంటి అంశాలపైనా రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించారు. సోమవారం నుంచి ఫిబ్రవరి 7 వరకు చేపట్టే ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రభుత్వం ప్రచారం చేయిస్తోందని.. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ కరపత్రాలు పంచుతోందని దుయ్యబట్టారు. ఉద్యోగులను ప్రజల్లో దోషులుగా చిత్రీకరించే వ్యూహాలను సమర్ధంగా ఎదుర్కోవాలని పిలుపిచ్చారు, ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని.. ఉద్యోగుల సత్తా చూపి డిమాండ్లను పరిష్కరించుకోవాలని పిలుపిచ్చారు. ఉద్యోగులను అణగదొక్కాలని చూసిన వారంతా భ్రష్టుపట్టారని తెలిపారు. రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఇందుకు క్షేత్ర స్థాయిలోని ఉద్యోగులు నడుం బిగించాలని సంఘాల నేతలు సూచించారు. ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వేతన సవరణపేరిట ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరించాలని నిశ్చయించారు.


మంగళవారం (25న) జిల్లా కేంద్రాల్లో వేలాది మందితో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించాలని.. వాటిని అడ్డుకునేందుకు సర్కారు కుట్ర పన్నుతోందని.. నాయకుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలు ఏ పార్టీకీ అనుబంధం కాదని, అదే సమయంలో పార్టీలు సంఘీభావం తెలిపితే స్వీకరిస్తామన్నారు. కార్మిక సంఘాలు, ఏఐటీయూసీ, సీఐటీయూ ట్రేడ్‌ యూనియన్లు సంపూర్ణ మద్ధతు ప్రకటించాయి. ఉద్యోగులకు తోడుగా ఆశ, అంగన్‌వాడీ, మున్సిపల్‌, పంచాయతీ పారిశుధ్య కార్మికులను సమ్మెలో భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చాయి. ఆర్టీసీ ఉద్యోగులు, న్యాయ శాఖ ఉద్యోగులు కూడా సమ్మెలో భాగసామ్యం కానున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, సచివాలయ ఉద్యోగులను కలుపుకొని ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపజేసేలా ఉద్యమాన్ని నడపాలని తీర్మానించారు.


ఉద్యోగులతో యుద్ధమా..?


(అమరావతి-ఆంధ్రజ్యోతి):  ‘‘ఉద్యోగులతో యుద్ధమా? మీతో చర్చల కోసం తాత్కాలికంగా ఉద్యమాన్ని విరమించినందుకు సాధారణ ఉద్యోగులతో మేము తిట్లు తిట్టించుకుంటున్నాం. ప్రభుత్వం మీద నమ్మకంతో ఎక్కడికక్కడ సానుకూల వాతావరణంతో ముందుకు వెళితే మీరు చేసిందేమిటి? సోషల్‌ మీడియాలో, ఒక మీడియాలో, ఒక రాజకీయ పక్షంతో మా మీద ప్రజలలో దురభిప్రాయాన్ని కలిగిస్తారా? మీరు చేసిన పని మాకు బాధ, ఆవేదనను కలిగిస్తోంది. పౌర సమాజానికి అర్థమయ్యేలా మా సమస్యలు మేము చెప్పుకొంటాం. మీతో చర్చలకు రావాలంటే పీఆర్‌సీ జీవోలు రద్దు చేసిన తర్వాతే!’’ - స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో సంఘాల నేతలు 

Updated Date - 2022-01-24T08:30:12+05:30 IST