జగన్ ప్రభుత్వంపై ఉద్యోగుల పోరుబాట.. సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయం..

ABN , First Publish Date - 2022-01-20T17:06:10+05:30 IST

పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన జగన్ ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగ సంఘాలు సమరానికి సిద్ధమయ్యాయి.

జగన్ ప్రభుత్వంపై ఉద్యోగుల పోరుబాట.. సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయం..

అమరావతి: పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన జగన్ ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగ సంఘాలు సమరానికి సిద్ధమయ్యాయి. సమ్మె అస్త్రాన్ని ప్రయోగించనున్నాయి. అంతేకాదు.. కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇచ్చాయి. శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధమయ్యారు. అన్ని సంఘాలు, ఇరు జేఏసీల ఐక్య కార్యాచరణ వేదిక చర్చించుకుని నిర్ణయం తీసుకోనున్నాయి. పీఆర్సీ కోసం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు గతంలో ఎన్నాడూ సమ్మె చేయలేదు. ఇప్పుడు సమ్మె వరకు వెళితే తొలి పీఆర్సీ సాధన సమ్మె అవుతుంది.


కాగా పీఆర్సీపై గురువారం అమరావతి జేఏసీ ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో వేరువేరుగా సమావేశాలు నిర్వహించనున్నాయి. పీఆర్సీపై ఏ విధంగా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలన్న దానిపై  సమావేశంలో ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. రెవెన్యూ భవన్‌లో బొప్పరాజు, బండి శ్రీనివాసరావు భేటీ కానున్నారు. 21వ తేదీన (శుక్రవారం) ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలన్న ఆలోచనలో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం... అన్ని జిల్లాల్లో ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం నుంచి దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసే విధంగా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. గురువారం  సాయంత్రం అమరావతి జేఏసీ ఎన్జీవో, జేఏసీ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించనున్నాయి.

Updated Date - 2022-01-20T17:06:10+05:30 IST