Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగుల పోరుబాట

నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు

పీఆర్‌సీ ప్రకటన, డీఏ విడుదల, సీపీఎస్‌ రద్దు తదితర సమస్యల పరిష్కారానికి డిమాండ్‌

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

దశల వారీగా ఆందోళన ఉధృతం చేయనున్నట్టు ప్రకటన


విశాఖపట్నం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం నుంచి పోరుబాట పట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రతి కార్యాలయం వద్ద కొద్దిసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 11వ పీఆర్సీని వెంటనే ప్రకటించడంతోపాటు డీఏల విడుదల, సీపీఎస్‌ రద్దు, పీఎఫ్‌ రుణాల మంజూరు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం తదితర డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందుకురావాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు  ఉద్యోగులు, ఉపాద్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారని ఏపీ ఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, ఫ్యాప్టో ప్రతినిధి ఈ.పైడిరాజు తెలిపారు. కాగా ఈ విధంగా పదో తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, తాలుకా, డివిజన్లు, జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో హెచ్‌వోడీలు, ఏపీఎస్‌ ఆర్టీసీ డిపోల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు. పదో తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తంచేస్తారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో  13 తేదీన అన్ని తాలుకాలు, డివిజన్‌ కేంద్రాలు, బస్సు డిపోల్లో నిరసన ప్రదర్శనలు చేపడతారు. 16న అన్ని డివిజన్లలో, 21న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపడతారు. 27న విశాఖపట్నం, 30న తిరుపతి, జనవరి 3న ఏలూరు, 6న ఒంగోలులో డివిజనల్‌ సమావేశాలు నిర్వహించనున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.

Advertisement
Advertisement