ఉద్యోగుల విలవిల!

ABN , First Publish Date - 2020-07-06T09:51:51+05:30 IST

జూన్‌ నెల ఒకటో తేదీ నుంచి ఉద్యోగులంతా 100శాతం విధులకు హాజరు కావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఉద్యోగుల విలవిల!

అన్‌లాక్‌ ప్రారంభంలో ఉద్యోగులంతా డ్యూటీకి రావాలని ఆదేశాలు

కార్యాలయాల్లో భౌతిక దూరం, శానిటైజేషన్‌ శూన్యం

ఫలితంగా పలువురు ఉద్యోగులకు వైరస్‌ 

మళ్లీ 50 శాతం హాజరు నిబంధన తీసుకొచ్చిన కలెక్టర్‌


గుంటూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జూన్‌ నెల ఒకటో తేదీ నుంచి ఉద్యోగులంతా 100శాతం విధులకు హాజరు కావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు  జారీ చేసింది. పలు కార్యాలయాల్లో భౌతిక దూరం పాటించలేని విధంగా వాతావరణం ఉండటం, శానిటైజేషన్‌ ప్రక్రియ నిత్యం జరగకపోవడం, ఉద్యోగుల్లో నిర్లక్ష్యం వెరసి చాలామంది ఇప్పటికే కరోనా గుప్పిట్లో చిక్కుకొన్నారు. పోలీసు, విద్యుత్‌, స్త్రీ, శిశు సంక్షేమం, జిల్లాపరిషత్తు, రెవెన్యూ తదితర శాఖల్లో పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. తమకు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని కోరినప్పటికీ గత నెల రోజుల వ్యవధిలో అధికారులు సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు రోజుకు 150కి పైగా కేసులు నమోదు అవుతోండటంతో అధికారులు దిగి వచ్చి మళ్లీ వర్క్‌ ఫ్రం హోం, ఆఫీసుల్లో 50 శాతం ఉద్యోగులే పని చేయాలన్న నిబంధనని తీసుకొచ్చారు.


జిల్లాలో పరిస్థితి అదుపు తప్పుతుండటంతో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. మళ్లీ వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని ఉద్యోగులకు సోమవారం నుంచి తీసుకొచ్చారు. ఏ ఫైలు అయినా సరే ఈ- ఆఫీసులోనే నడపాలన్నారు. ఫిజికల్‌ కాంటాక్ట్‌ ఉండటానికి వీల్లేదన్నారు. ఒక్క భూసేకరణ ఫైళ్లని మాత్రమే ఫిజికల్‌గా చూడాలన్నారు. సెక్షన్ల సూపరింటెండెంట్‌లు బాధ్యత తీసుకొని 50 శాతం ఉద్యోగులే హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుతానికి కలెక్టరేట్‌ వరకు ఈ విధానాన్ని అమలు చేస్తారు. కేసుల ఉద్ధృతి ఇలానే ఉంటే అన్ని శాఖల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. 

Updated Date - 2020-07-06T09:51:51+05:30 IST