ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-20T05:19:46+05:30 IST

ప్రభుత్వం పీఆర్సీ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేసిందని ఫ్యాప్టో ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేసిన ప్రభుత్వం
చింతలపూడిలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన ఫ్యాప్టో నేతలు

చింతలపూడి, జనవరి 19: ప్రభుత్వం పీఆర్సీ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేసిందని ఫ్యాప్టో ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడిలో బుధవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలియజేశారు. ఉద్యోగులకు అన్యా యం జరిగే జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు రాంబాబు, శామ్యూల్‌, ధామోధర్‌, ప్రభాకర్‌, అప్పారావు, బుచ్చిబాబు, కాంతారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


చీకటి పీఆర్సీ మాకొద్దు


కుక్కునూరు: పీఆర్సీ అమలు పేరిట హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను తగ్గిస్తూ జారీ చేసిన జీవోలతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌ గౌరవ సలహాదారు సరి యం బుచ్చయ్య అన్నారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ చీకటి జీవోలు మాకొద్దని స్పష్టం చేశారు. జగన్మోహనరెడ్డి పాదయాత్రలో పీఆర్సీ, డీఏ, సీపీఎస్‌ విషయంలో న్యాయం చేస్తామని మాటిచ్చారని, ఇప్పుడు నష్టం కలిగే జీవోలను ఇచ్చారన్నారు. జీవోలను ఉపసంహరించుకోకపోతే ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమన్నారు. కారం దారయ్య, సీతారామయ్య, పోసిరత్నం, ఇమ్మానియేల్‌, నాగేంద్రప్రసాద్‌, సునీత తదితరులు పాల్గొన్నారు.


జీవోలను ఉపసంహరించాలి


జంగారెడ్డిగూడెం: ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలపై మోడల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఎంప్లాయీస్‌ జిల్లా, అధ్యక్ష, కార్యదర్శులు లాగు జయరాజు, కొక్కిరపాటి మధు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను అవమానపరిచే రీతిలో పీఆర్సీ ఉందన్నారు. ఈ జీవోలను తక్షణమే వెనక్కి తీసుకుని ఫిట్‌మెంట్‌ 27 శాతం ప్రకటిస్తూ హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను, క్వాంటం పెన్షన్‌ విధానాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. గాలింకి అరుణ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు ఎ.ఏసుదాస్‌, ట్రెజరర్‌ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.


నేడు కలెక్టరేట్‌ ముట్టడి


కొవ్వూరు: అప్రజాస్వామిక పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయాలని యూటీఎఫ్‌  మండల అధ్యక్షుడు డి.ప్రకాశరావు కోరారు. పీఆర్సీ జీవోలను ఉపసంహరించుకోవాలని, పాత హెచ్‌ఆర్‌ఏ పాలసీ కొనసాగించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, సచివాలయ కార్యదర్శులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ముట్టడిలో అదికసంఖ్యలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2022-01-20T05:19:46+05:30 IST