వద్దన్నా..వినరే!

ABN , First Publish Date - 2020-04-07T11:56:36+05:30 IST

ఇతర జిల్లాల నుంచి ఇంకా కొందరు వస్తూనే ఉన్నారు. చెక్‌పోస్టు వద్ద అడ్డుకట్ట వేస్తున్నా ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి

వద్దన్నా..వినరే!

జిల్లా సరిహద్దులు దాటుతున్న ఉద్యోగులు

నిన్న తహసీల్దారులు.. నేడు వైద్య సిబ్బంది

రహస్యంగా వస్తున్న వారు ఎందరో 

మత్స్యకార గ్రామాల్లో వందల సంఖ్యలో చొరబాట్లు


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): ఇతర జిల్లాల నుంచి ఇంకా కొందరు వస్తూనే ఉన్నారు. చెక్‌పోస్టు వద్ద అడ్డుకట్ట వేస్తున్నా ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి కొందరు.. నాయకుల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా మరికొందరు హద్దు దాటుతున్నారు. విశాఖ నుంచి విజయనగరం వైపు వస్తున్న వారిని పోలీసులు చాలా వరకు అడ్డుకుంటున్నారు. ఎవరినీ జిల్లాలోకి అనుమతించకుండా చూడాలని ఎస్పీ సైతం ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి వస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్దేశించారు. అందుకు తగ్గట్టుగా జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా ఏదోలా పోలీసుల కళ్లు గప్పి కొందరు విశాఖ నుంచి వచ్చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖలో నివాసం ఉంటూ విజయగనరం జిల్లాలో ఉద్యోగాలు చేస్తున్న అనేక మంది ఉద్యోగులను యంత్రాంగం అదుపు చేయలేకపోతోంది. నిన్నటికి నిన్న నలుగురు తహసీల్దారులను పోలీసులు విజయనగరం పట్టణంలోకి రాకుండా అడ్డుకున్నారు. కానీ కొంతమంది అధికారులు కోవిడ్‌-19 ప్రత్యేక అధికారులుగా చెప్పి విశాఖ నుంచి కారుల్లో జిల్లాలోకి చొరబడుతున్నారు. ఇటువంటి వారిపట్ల పోలీస్‌ శాఖ కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. 


విజయనగరం జిల్లాకు ప్రత్యేక అధికారిగా వచ్చిన వివేక్‌ యాదవ్‌ సైతం విశాఖ నగరంలో ఉంటూ విజయనగరం జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. తాత్కాలిక ప్రత్యేక అధికారి కావడం వల్ల కొంత మినహాయింపు ఉంటే ఉండవచ్చు. సోమవారం ఉదయం జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు మోదవలస చెక్‌ పోస్టు వద్ద పోలీసులతో గొడవ పడినట్లు సమాచారం. తాము జిల్లా అధికారులమని చెప్పినప్పటికీ పోలీసులు విడిచిపెట్టక పోవటంతో ఉన్నతాధికారికి ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో వారిని వదిలేసినట్లు తెలిసింది. జిల్లాలో ఉండాల్సిన అధికారులు విశాఖ వెళ్తూ ఇష్టారాజ్యంగా తిరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వైద్య సిబ్బంది కూడా అనేక మంది విశాఖ నుంచి వచ్చి వెళుతున్నారు. ఇటువంటి వారికి శాఖా పరంగా తాజాగా శ్రీముఖాలు ఇచ్చారు. ఖచ్చితంగా స్థానికంగా ఉండి సేవలు అందించాలని ఆదేశించారు.  కొంతమంది అధికారులకు జోనల్‌ అధికారి హోదా లేకపోయినా ఆ హోదాలో విశాఖ వెళ్లి వస్తున్నారు. వారికి కాస్త వెసులుబాటు ఇస్తున్న కారణంగానే పోలీస్‌ శాఖ సిబ్బంది కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇలా అధికారులు ఇష్టారాజ్యంగా తిరుగుతుండగా అటోలపై వెళ్లే వారి పట్ల మాత్రం పోలీసులు కఠువుగా వ్యవహరిస్తున్నారు.


వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. ఇదే తరహాలో ప్రభుత్వ సిబ్బంది, అధికార యంత్రాంగం పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా మత్స్యకార గ్రామాల్లోకి నేరుగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి చొరబడుతున్నారు. సొంత ఇళ్లకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గ్రామస్థులు అడ్డుకుంటున్న చోట్ల రభస జరుగుతోంది. ఇంతలో రాజకీయ నాయకులు కలుగజేసుకుని సద్దుమణిగేలా చేస్తున్నారు.  దీంతో గ్రామాల్లోకి ఇతర జిల్లాల నుంచి చొరబాట్లు ఉంటూనే ఉన్నాయి.


Updated Date - 2020-04-07T11:56:36+05:30 IST