భగ్గుమన్న ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-19T05:27:44+05:30 IST

ఐఆర్‌ కన్నా తక్కువ ఫిట్‌మెంట్‌ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ ఇవ్వలేదని కాళ్ళ మండల ఫ్యాప్టో నాయకులు అన్నారు.

భగ్గుమన్న ఉద్యోగులు
పాలకోడేరులో జీవో ప్రతులను దహనం చేస్తున్న ఉద్యోగులు

మండల కేంద్రాలో నిరసన

జీవో ప్రతుల దహనం



కాళ్ళ, జనవరి 18: :
ఐఆర్‌ కన్నా తక్కువ ఫిట్‌మెంట్‌ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ ఇవ్వలేదని కాళ్ళ మండల ఫ్యాప్టో నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి, ఉపాధ్యాయ, పెన్షనర్ల హక్కులను కాలరాసే విధంగా జారీ చేసిన జీవో ప్రతులను మంగళవారం కాళ్ళ బస్టాండ్‌ సెంటర్‌లో దహనం చేశారు.  అప్రజాస్వామికంగా ఫిట్‌మెంట్‌ ప్రకటించి నేడు హెచ్‌ఆర్‌ఏలు కూడా తగ్గించే విధంగా జీవోలు జారీ చేయడం ఉద్యోగుల హక్కులను కాలరాయడమేనన్నారు. సీపీఎస్‌ రద్దు అంశాన్ని పక్కన పెట్టి బకాయి పడ్డ డీఏలను ఇవ్వకుండా హెచ్‌ఆర్‌ఏ స్లాబులను తొలగించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు సీహెచ్‌ పట్టాభిరామయ్య, డి.దావీదు, వి.జనార్దన్‌, బీఆర్‌కే.స్వామి, జి.రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.


భీమవరం అర్బన్‌ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలు కుట్రపూరితమని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపాలన్‌, కే రాజారామ్మోహన్‌రాయ్‌ అన్నారు.సీఐటీయు నాయకులు మంగళవారం  ఒక ప్రటన విడుదల చేశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాఽధ్యాయులను వంచించిందన్నారు.వేతనాల్లో కోత విధించడం దారుణమన్నారు.  


ఆకివీడు : రివర్స్‌ పీఆర్సీతో ఉద్యోగులకు జీతాలు తగ్గించిన ఘనత జగన్‌ ప్రభుత్వానిదేనని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడ్డారు. అర్ధరాత్రి జీవోను వ్యతిరేకిస్తూ మంగళవారం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నల్ల రిబ్బన్లు పెట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు.    


ఆచంట :
ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ఎంఈవో కార్యాలయం వద్ద మండల  యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేశారు. జీవో కాపీలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కె.కాశీ, కె.నాగేశ్వరరావు, బి.ప్రసాద్‌, డి.పుష్పలత, ఆర్‌.కమల్‌నాథ్‌, ఎం.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


పెనుగొండ :
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన  అసంబద్ధ  పీఆర్‌సీ జీవోను వ్యతిరేకిస్తున్నామని ఎస్‌టీయూ రాష్ట్ర  కార్యదర్శి భూపతిరాజుజవహర్‌లాల్‌రాజు అన్నారు. పెనుగొండ ఎంఆర్‌సీ వద్ద మంగళవారం ప్యాప్టో నాయకులు జీవో ప్రతులను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో పాపా జనార్దనస్వామి, వర్ధనపు రవికుమార్‌, కె.సతీష్‌కుమార్‌, ఎ.గణేశ్వరరావు పాల్గొన్నారు.


పాలకోడేరు :
ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఉపా ధ్యాయ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలను ధరించి పీఆర్‌సీ ప్రతులను దహనం చేశారు.  


వీరవాసరం :
జీవోపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. వీరవాసరం బస్టాండ్‌ సెంటర్‌లో  మంగళవారం ప్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అనంతరం పత్రాలను దహనం చేశారు. కార్యక్రమంలో ముద్రగళ్ళ శ్రీనివాసరావు, కె.నాగమునేశ్వరరావు, పంపన సాయిబాబు,  డి.పుల్లారావు, నక్కెళ్ళ శ్రీనివాస్‌, కరక సత్యనారాయణ, డి.శ్రీనివాస్‌, పద్మజ, శ్రీదేవి, రాజమణి  తదితరులు పాల్గొన్నారు.


పెనుమంట్ర :
పీఆర్‌సీ జీవో రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి  జీవోను పునఃసమీక్షించాలని లేకపోతే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు.



Updated Date - 2022-01-19T05:27:44+05:30 IST