మండిపడిన ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-20T05:20:33+05:30 IST

పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడ్డారు..

మండిపడిన ఉద్యోగులు
మాకొద్దు మీ పీఆర్‌సీ :ఆకివీడులో జీవో ప్రతులను దహనం చేస్తున్న ఉద్యోగులు

రెండో రోజూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసన


పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడ్డారు.. రెండో రోజూ బుధవారం ఆందోళ నకు దిగారు.. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. జీవో ప్రతులను దహనం చేసి తమ నిరసన వెళ్లగక్కారు.. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ తగ్గేది లేదని తేల్చి చెప్పారు. తాడోపేడో తేల్చుకుంటామని ప్రతినబూనారు..


భీమవరం అర్బన్‌, జనవరి 19 :
రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీని సవరించి కనీసం 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని సీఐటీయూ పట్టణ కార్యదర్శి వాసుదేవరావు అన్నారు.తిరోగమన పీఆర్సీ ప్రతిఘటించండి అంటూ సీఐటీ యూ ఆధ్వర్యంలో బుధవారం కరపత్రాలు పంపిణీ చేశారు. జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు చేసి మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకు మెండి చెయ్యి చూపించారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


ఆకివీడు :
వైసీపీ ప్రభుత్వం తడి గుడ్డతో ఉద్యోగుల గొంతు కోసిందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌ బాలురు ఉన్నత పాఠశాలలో రెండో రోజు బుధవారం ఉపాధ్యాయులు, ఉద్యో గులు నల్ల రిబ్బన్లు ధరించి పీఆర్సీ రద్దు చేయాలంటూ జీవో ప్రతులను దహనం చేశారు. రివర్స్‌ పీఆర్సీని రద్దు చేసే వరకూ ఉద్యమిస్తామన్నారు.


పాలకోడేరు : 
రివర్స్‌ పీఆర్‌సీని రద్దు చేయాలని పాలకోడేరు మండల పరిషత్‌ అధికారులు, గ్రామ కార్యదర్శులు నల్ల రిబ్బన్లు ధరించి బుధ వారం నిరసన తెలిపారు.నిరసనలో ఎంపీడీవో వెంకటఅప్పారావు, ఈవోపీ ఆర్‌డి రెడ్డియ్య, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-20T05:20:33+05:30 IST