ఇక యుద్ధమే

ABN , First Publish Date - 2022-01-26T07:03:39+05:30 IST

ఉద్యోగులను మోసం చేసిన అత్యంత దుర్మార్గపు ప్రభుత్వమని రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటివరకు చూడలేదని పలువురు ఉద్యోగ సంఘ నాయకులు దుమ్మెత్తిపోశారు.

ఇక యుద్ధమే
ఏలూరులో ర్యాలీ చేస్తున్న ఉద్యోగులు

ప్రభుత్వ మొండి వైఖరిపై ఉద్యోగుల ఆగ్రహం
దద్దమ్మ ప్రభుత్వమిది
చీకటి జీవోలను ఉపసంహరించుకోవలసిందే
పాతజీతాలు, హెచ్‌ఆర్‌ఏలు చాలు
62 ఏళ్లకు రిటైర్మెంట్‌, స్థలాలు అడగలేదు కదా  
జగన్‌  మొండి కాదు.. బలహీనుడు
సీఎంలలో ఇతనిపైనే ఎక్కువ కేసులు
ఏలూరులో మహా ర్యాలీ, ధర్నాలతో నిరసన



ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 25 :
ఉద్యోగులను మోసం చేసిన అత్యంత దుర్మార్గపు ప్రభుత్వమని రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటివరకు చూడలేదని పలువురు ఉద్యోగ సంఘ నాయకులు దుమ్మెత్తిపోశారు. నవరత్నాల సాకుతో ఉద్యోగుల నెత్తిన నవరత్న ఆయిల్‌తో ప్రభుత్వం మర్ధన చేసిందని ఎద్దేవా చేశారు. కొత్త పీఆర్‌సీతో ప్రభుత్వంపై ఏటా రూ.10,800 కోట్ల అదనపు భారం పడుతోందని చెబుతున్న జగన్‌ ప్రభుత్వం ఆ అదనపు సొమ్మును తన వద్దే ఉంచుకుని ఇప్పుడిస్తున్న పాతజీతాలు, హెచ్‌ఆర్‌ఏ, డీఏలు మాత్రం ఇస్తే చాలునని అభ్యర్థించారు. బేషరతుగా నల్లజీవోలను రద్దు చేయకపోతే ప్రభుత్వంపై ఇక యుద్ధమేనని తేల్చి చెప్పారు. పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి మహార్యాలీ, అనంతరం కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు అన్ని శాఖల ఉద్యోగులు పోటెత్తారు. విధులకు క్యాజువల్‌ లీవ్‌ (సీఎల్‌) పెట్టుకుని జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, పెన్షనర్లు తరలి రావడంతో జిల్లా పరిషత్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు దారులన్నీ కిక్కిరిశాయి. పీఆర్‌సీ సాధన సమితిలో 59 భాగస్వామ్య సంఘాల ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. అవసరమైన ఖర్చుల కోసం పలువురు ఉద్యోగులతో పాటు ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా విరాళాలు అందజేశాయి. ధర్నాలో ఉద్యోగ నేతలు రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిపై ఉద్వేగంగా చురకలంటించారు.

ఈ ప్రభుత్వం సంగతేంటో తేలుస్తాం

కొత్త పీఆర్‌సీ వల్ల ఈ ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నట్లయితే ఒక్కొ ఉద్యోగి జీతభత్యాల నుంచి రూ.3 లక్షల వరకు మినహాయించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో సీఎం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగుల నుంచి ఎంత లాక్కున్నారో బయట పెట్టాలి. 5 డీఏ బకాయిలను జీతంతో కలిపి ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. అందరూ అనుకున్నట్టుగా జగన్‌ జగమొండి కాదు. చాలా బలహీనుడు. ఎందుకంటే దేశంలో ఎవరిపైనా లేనన్న కేసులు జగన్‌పై ఉన్నాయి. మూడు రాజధానులు, శాసన మండలి, సీపీఎస్‌ వెనక్కి పోయినట్టే పీఆర్‌సీ జీవోలపైనా సీఎం వెనక్కి తగ్గడం ఖాయం. ఉద్యోగులపై అసత్య ప్రచారం చేస్తున్న అధికార పార్టీ పత్రికకు చందాదారులుగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయు లందరూ ఆ పత్రికను బ్యాన్‌ చేసినట్లయితే అది కూడా ఉద్యమంలో భాగమే అవుతుంది. ఉద్యోగులను బెదిరిస్తే పీఆర్‌సీ సాధన సమితి అండగా ఉంటుంది. దెబ్బలు తినడానికైనా ఉద్యోగులు సిద్ధంగా ఉండాలి. ఈ ప్రభుత్వ సంగతేంటో తేలుస్తాం.
–షేక్‌ సాబ్జీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ


అన్ని కార్యాలయాలకు  తాళాలు వేస్తాం
సీఆర్‌పీ జీవోలు జారీ చేసి, మళ్లీ ఇప్పుడు కమిటీలు వేయడం ప్రభుత్వ దొంగనాటకమే. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచే వరకు అవసరమైతే ఆమరణ దీక్షలు చేపట్టి ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. కాంట్రాక్ట్‌, సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగే వరకు సమ్మె ఉపసంహరణ ఉండదు. పాఠశాలలు, ఆసుపత్రులతో సహా అన్ని కార్యాలయాలకు తాళాలు వేస్తాం. 2024లో ప్రభుత్వానికి ఓటుతో బుద్ది చెబుతాం.
– కె.రమేష్‌కుమార్‌, జేఏసీ–అమరావతి జిల్లా చైర్మన్‌


మంచి చేస్తాడని దబా..దబా ఓట్లు గుద్దేశాం
ఈ ఏడాది అక్టోబరు ఒకటిన నా పుట్టిన రోజు. అంతకంటే ఒక రోజు ముందుగానే రిటైర్‌ అయ్యే నేను ఇంటికి వచ్చి పిల్లలను చూసుకుంటానని అమ్మాయితో ఇటీవల చెప్పా.. ఈ లోగానే ఉద్యోగులు ఎవరూ అడగకుండా రిటైర్మెంట్‌ వయసును 62 సంవత్సరాలకు పెంచేశారు. అసలు రిటైర్మెంట్‌ వయసు 58 సంవత్సరాలే ఎక్కువ. ప్రభుత్వ పరిస్థితి చూస్తుంటే గద్దె దిగేలోగా దీన్ని 65 సంవత్సరాలకు పెంచుతారా అనే సందేహం కలుగుతోంది. ఏదో మంచి చేస్తాడని నాతో సహా ఉద్యోగులందరం జగనన్నకు దబాదబా ఓట్లు గుద్దేశాం. తెలంగాణ సీఎం కంటే మా సీఎం తోపు అనుకుంటే 23 శాతం ఫిట్‌మెంట్‌  మాత్రమే ఇచ్చాడు. జగన్‌ సిగ్గుందా..? కబడ్దార్‌. సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఎవరు...? ఉద్యోగులను బెదిరిస్తారా...? మా ఉద్యోగం తీసేసే ముందు రోజే మీ ఉద్యోగం తీసేస్తాం.
–ఎల్‌.విద్యాసాగర్‌, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా చైర్మన్‌



కడుపుమండిన పోరాటం
ఉద్యోగుల కడుపు మండిన పోరాటమిది. గ్రామ వలంటీర్ల ద్వారా ఉద్యోగుల పట్ల దుష్ప్రచారం చేయడం తగదు. ప్రభుత్వం నియమించుకున్న 46 మంది సలహాదారులకు ఒక్కొక్కరికీ వేతనం, కారు, ఇంటి అద్దె, ఇతర అలవెన్స్‌లు కలిపి నెలకు రూ.4లక్షలు చొప్పున ఖర్చు చేస్తోంది. కొత్త పీఆర్‌సీ వలన రూ.25 వేలు బేసిక్‌ పే ఉన్న ఉద్యోగికి హెచ్‌ఆర్‌ఏగా రూ.2 వేలు మాత్రమే ఇస్తారు. ఈ సొమ్ముకు ఏలూరులో తాటాకు ఇళ్లయినా అద్దెకు దొరుకుతుందా...? చంద్రబాబు ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ 71 శాతం ఇవ్వగా ఈ ప్రభుత్వం 23 శాతమే ఇవ్వడం అన్యాయం కాదా...? ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే సమ్మెలో ఆర్‌టీసీ, విద్యుత్‌, వైద్య ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు కూడా అన్ని శాఖల ఉద్యోగులతో పాటు పాల్గొంటారు.
–ఆర్‌.ఎస్‌ హరనాథ్‌, ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌

ఇంకా ఎవరేమన్నారంటే..


62 సంవత్సరాల రిటైర్మెంట్‌, జగనన్న స్మార్ట్‌ సిటీలో ఇళ్ల స్ధలాల్లో 10 శాతం రిబేటు, ఉద్యోగులు అడగనే లేదు. 1994వ సంవత్సరంలోనే హెచ్‌ఆర్‌ఏ 20 శాతంపై జీవోలు జారీచేయగా ఈ ప్రభుత్వం దానిని 8 శాతానికి తగ్గించింది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా ఉద్యోగుల సమ్మె ఆగదు.
–సీహెచ్‌ శ్రీనివాస్‌, ఏపీ జేఏసీ జిల్లా కన్వీనర్‌


ఉద్యోగులపై ప్రభుత్వ దుష్ప్రచారం తిప్పికొట్టండి. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రభుత్వ అసత్య ప్రచారం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. టీచర్లు ఉదయం 9:15 గంటలకు అంటే పావుగంట ఆలస్యంగా వస్తున్నారంటూ చాలా చోట్ల స్కూల్స్‌కు తాళాలు వేస్తున్నారు.
 – భూపతిరాజు రవీంధ్రనాథ్‌రాజు, వీఆర్వోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు



చీకటి జీవోలను జారీచేసి ఆ తరువాత ఉద్యోగుల వ్యతిరేకత ప్రారంభమయ్యే సరికి బుజ్జగింపుల కమిటీ, మంత్రుల కమిటీలను వేయడం సరికాదు. నేరుగా సీఎం జోక్యం చేసుకుని పరిష్కరించాలి. ఉపాధ్యాయ ఉద్యమమే ఈ పోరాటానికి స్పూర్తిగా నిలిచింది.
– శ్రీమన్నారాయణ, ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్‌

Updated Date - 2022-01-26T07:03:39+05:30 IST