పోరుబాటలో ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-21T05:51:26+05:30 IST

ప్రభుత్వం ఉద్యోగులను వంచిస్తూ విడుదల చేసిన చీకటి జీవోలను రద్దు చేసే వరకు సమైక్య పోరుతో ఉద్యోగులంతా పోరాడతామని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.

పోరుబాటలో ఉద్యోగులు
నిరసన తెలిపేందుకు వెళుతున్న ఉపాధ్యాయులు

ఒంగోలులో ధర్నాకు తరలిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు

కనిగిరి, జనవరి 20: ప్రభుత్వం ఉద్యోగులను వంచిస్తూ విడుదల చేసిన చీకటి జీవోలను రద్దు చేసే వరకు సమైక్య పోరుతో ఉద్యోగులంతా పోరాడతామని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఒంగోలులో జరిగే కలక్టరేట్‌ ముట్టడికి కనిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో గురువారం ఉద్యోగులంతా తరలివెళ్లారు. ఈ సందర్భంగా పాల్గొన్న యూటీఎఫ్‌ నాయకులు ఖాజా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ వల్ల ఎలాంటి నష్టమూ లేదంటూ సీఎం జగన్‌రెడ్డి చెప్పే అసత్యపు మాటలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తగ్గించడం గతంలో ఏ పాలకులు చేయలేదని పేర్కొన్నారు. చర్చల పేరుతో ఉద్యోగ సంఘాల నాయకులను మభ్యపెట్టి ఉద్యోగులను నిండా మోసం చేశారని విమర్శించారు. నేటి నుంచి ఆందోళనలు ఉధృతం చేసి సమ్మెబాటలో హక్కులు సాధించుకుంటామని పేర్కొన్నారు. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వివిధశాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. 

పామూరులో : అప్రజాస్వామ్యకంగా ఉన్న పీఆర్‌సీ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ పామూరు ప్యాఫ్టో పిలుపు మేరకు గురువారం ఛలో కలక్టరేట్‌ కార్యాక్రమానికి పామూరు నుంచి 100 మందికి పైగా ఉపాధ్యాయులు ప్రత్యేక వాహనాల్లో తరళివెళ్లారు. ఒంగోలుకు తరళివెళ్లిన వారిలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. 

ఉపాధ్యాయులకు పోలీసుల నోటీసులు

సీఎ్‌సపురం : ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్‌సీ జీవోను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల సమైక్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఒంగోలు కలెక్టరేట్‌ ముట్టడికి వెళుతున్న ఉపాధ్యాయులకు సీ.ఎ్‌స.పురం పోలీసులు గురువారం నోటీసులు అందజేశారు. కలక్టరేట్‌ ముట్టడికి వెళుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో నోటీసులు అందజేశారు. ఒంగోలులో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మండలం నుంచి దాదాపు  50 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌.నాయబ్‌రసూల్‌ తెలిపారు. 

ఒంగోలు తరలిన ఉపాధ్యాయులు

పీసీపల్లి :ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు సంబంధించిన 11వ వేతన సవరణ ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులోని కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. పీసీపల్లి నుంచి బయలుదేరిన ఉపాధ్యాయులను మార్గమధ్యలో పోలీసులు తనిఖీలు పెట్టి వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేసినప్పటికీ, ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయ మార్గాలలో ఒంగోలుకు చేరుకుని కలెక్టరేట్‌ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన 40 మంది ఉపాధ్యాయులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినట్లు మండలంలోని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు తెలిపారు.

Updated Date - 2022-01-21T05:51:26+05:30 IST