Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగులు ఉద్యమబాట

నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు

పలుచోట్ల నిర సన ప్రదర్శనలు

ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై నేతల ధ్వజం

పీఆర్‌సీ, ఇతర సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌

ఒంగోలు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు. వేలాదిమంది మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పలుచోట్ల ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు అమలు చేయాల్సిన 11వ పీఆర్సీ, ఇతర 71 డిమాండ్లపై నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదన్న ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటానికి నిర్ణయించాయి. ఏపీఎన్‌జీవో సంఘం నేతృత్వంలో ఉద్యోగ జేఏసీ, రెవెన్యూ అసోసియేషన్‌ నేతృత్వంలోని అమరావతి జేఏసీలు సంయు క్తంగా ప్రభుత్వంపై పోరును మంగళవారం నుంచి ప్రారంభించాయి. జిల్లాలో 95శాతానికిపైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు వివిధ కార్పొరేషన్ల పరిధిలో పనిచేసేవారు ఆ సంఘాల్లో భాగస్వాములుగా ఉన్నారు. దీంతో వారంతా మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడంతోపాటు పలుచోట్ల నిరసనలు కూడా నిర్వహించారు. ఎన్‌జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కూచిపూడి శరత్‌బాబు, ఆర్‌సీహెచ్‌ కృష్ణారెడ్డి నేతృత్వంలో వివిధ శాఖల ఉద్యోగులు ఒంగోలులోని కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్‌, వైద్యారోగ్య శాఖ, ఇరిగేషన్‌, ట్రెజరీ, ఆర్టీసీ ఇలా అన్నిశాఖల ఉద్యోగులు ఈ నిరసనలో పాల్గొన్నారు. చీరాల, అద్దంకి, కందుకూరు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి, దర్శి, వైపాలెం తదితర ప్రాంతాల్లో జేఏసీ నేతలు నిరసనలను పర్యవేక్షించారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లోనూ, వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు పీహెచ్‌సీలలో నిరసనలు నిర్వహించారు. తక్షణం 11వ పీఆర్సీని అమలుచేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్‌ చేశారు. Advertisement
Advertisement