కదంతొక్కిన ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-26T06:32:57+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మంగళవారం మరోసారి రోడ్డెక్కారు.

కదంతొక్కిన ఉద్యోగులు

పీఆర్‌సీ సాధన కోసం నగరంలో భారీ ర్యాలీ

వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు

పాత హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లు కొనసాగించాలని, చీకటి పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌

జగదాంబ జంక్షన్‌లో మానవహారం

నేడు తాలూకా కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ

రేపటి నుంచి జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు


విశాఖపట్నం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):


ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మంగళవారం మరోసారి రోడ్డెక్కారు. రాష్ట్ర పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ...కేజీహెచ్‌, జగదాంబ జంక్షన్‌, దండుబజార్‌ మీదుగా తిరిగి కలెక్టరేట్‌కు చేరుకుంది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ర్యాలీ ఆద్యంతం ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పాత హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లు కొనసాగించాలని, చీకటి పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జగదాంబ జంక్షన్‌లో భారీ మానవహారాన్ని నిర్మించారు. సుమారు 20 నిమిషాలపాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగులు మోకాళ్లపై కూర్చుని తమ నిరసన తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఒకరు తల కింద, కాళ్లు పైకి లేపి...తమ జీవితాలను ప్రభుత్వం తలకిందులు చేయడానికి యత్నిస్తోందంటూ వినూత్న రీతిలో నిరసనను తెలియజేశారు. ర్యాలీ ప్రారంభానికి ముందు కలెక్టరేట్‌ వద్ద వివిధ సంఘాలకు చెందిన నాయకులు మీడియాతో మాట్లాడుతూ పీఆర్‌సీపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు.


ప్రలోభాలకు లొంగొద్దు.. 

ర్యాలీలో పలు శాఖలకు చెందిన వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్‌ ప్రాంగణంలో గల ఏపీ ఎన్‌జీవో భవన్‌ వద్ద ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ ఉద్యోగులు బలంగా పోరాటాన్ని సాగిస్తే..ఏ ప్రభుత్వమైనా దిగి రావాల్సిందేనన్నారు. రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం తరువాత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. పదమూడు జిల్లాల్లో ఉద్యమం జరుగుతున్న తీరు గొప్పగా ఉందన్నారు. ఉద్యోగుల ఆగ్రహానికి గురైతే...ప్రభుత్వం పతనం కాక తప్పదని హెచ్చరించారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో జిల్లా, రాష్ట్ర నాయకత్వం ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని, అర్ధాంతరంగా ఉద్యమాన్ని నీరుగార్చకుండా చూడాలని సూచించారు. ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్‌ కె.ఈశ్వరరావు మాట్లాడుతూ చీకటి జీవోలు రద్దు చేసేంత వరకు చర్చలకు వెళ్లబోమని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ర్యాలీ స్ఫూర్తితో రాష్ట్ర నాయకత్వం రూపొందించిన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. బుధవారం తాలూకా స్థాయిలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి మెమోరాండం సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే 27, 28, 29, 30 తేదీల్లో జిల్లా కేంద్రంలో చేపట్టనున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగులు వందలాదిగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీ రమణ మాట్లాడుతూ పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు భవిష్యత్తులో ఉద్యమాన్ని నడిపిస్తామని, అందుకు అనుగుణంగా ఉద్యోగులు కార్యోన్ముఖులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ కృష్ణకుమార్‌, జాక్టో చైర్మన్‌ గోపీనాథ్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటపతిరాజు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చిన్నబ్బాయి, ఎస్‌టీయూ జిల్లా ప్రెసిడెంట్‌ రామిరెడ్డి, డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మధు, ఏపీ ఎన్‌జీవో జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ పీఎం జవహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T06:32:57+05:30 IST