దీక్ష..బూని సాగరా..

ABN , First Publish Date - 2022-01-28T06:22:53+05:30 IST

దీక్ష..బూని సాగరా..

దీక్ష..బూని సాగరా..

విజయవాడ వేదికగా ఉద్యోగుల ఉక్కు పిడికిలి

బెదిరేది లేదంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు

ఉద్యమమే ఊపిరి అంటూ నినాదాలు

సమస్యలు పరిష్కరించే వరకూ తగ్గబోమని స్పష్టీకరణ

ధర్నాచౌక్‌లో రిలే దీక్షలు ప్రారంభం

వందల సంఖ్యలో తరలివచ్చిన ఉద్యోగులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ‘భయపెడితే భయపడటానికి ఒక్కరం కాదు.. మేము మహాశక్తి.. ఉద్యోగాలు తొలగించినా సరే మా ఉద్యమ పథం ఆగదు. అధికారం ఉందన్న మాటలు సరికాదు. ఎప్పుడూ మీరు ఇలానే మాట్లాడలేరు. మాకు మీ బెదిరింపులు కొత్తేమీ కాదు. ఇంకా నియంతృత్వంతో వ్యవహరించాలని చూస్తే ఖబడ్దార్‌.. మా తడాఖా చూపిస్తాం..’ 

అంటూ ఉద్యోగులు గర్జించారు. సమ్మె దగ్గర పడుతున్నకొద్దీ ప్రభుత్వం నుంచి బెదిరింపులు ఎక్కువ అవుతుండటంతో గురువారం నగరంలోని ధర్నాచౌక్‌లో తలపెట్టిన రిలే నిరాహార దీక్షల్లో ధిక్కార స్వరం వినిపించారు. నాలుగు రోజుల దీక్షలను పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ అగ్రనేత బండి శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ముజఫర్‌ అహ్మద్‌ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 

ఆ లేఖకు సమాధానమేదీ?

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్‌ అధ్యక్షత వహించారు.  ముఖ్య అతిథిగా హాజరైన బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం మరోసారి ఆలోచించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇప్పటికే తొమ్మిది మంది సభ్యులు మంత్రుల కమిటీని కలిశారన్నారు. ఆశుతోష్‌ మిశ్రా ఇచ్చిన పీఆర్సీ రిపోర్టును బయట పెట్టాలని, జనవరికి పాత జీతాన్నే ఇవ్వాలని, రాత్రిపూట ఇచ్చిన చీకటి పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరారు. తాము ఇచ్చిన లేఖకు ప్రభుత్వం నుంచి సమాధానం రానందునే చర్చలకు వెళ్లట్లేదన్నారు. డీడీవోలు అత్యుత్సాహం చూపి బిల్లులు వేస్తున్నారని, ట్రెజరీ అధికారులు కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కొత్త పీఆర్సీ ఇవ్వాలంటే ఆప్షన్‌ ఇవ్వాలని, ఏదో ఒక యాప్‌ను తీసుకొచ్చి అమలు చేయాలనుకోవటం తగదన్నారు. పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ సభ్యుడు అరవపాల్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు. అమరావతి రైతులను ఇబ్బందులు పెట్టారని, అదే మాదిరిగా ఉద్యోగులను కూడా పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఉద్యమం తప్పని పరిస్థితిలో ఏర్పడిందని, చావోరేవో తేల్చుకోవాల్సి వస్తోందన్నారు. స్ట్రగుల్‌ కమిటీ సభ్యుడు గంగాధరరెడ్డి మాట్లాడుతూ అధికారులు ఏవిధంగా లెక్కలు తయారు చేస్తూ జీవోలు ఇస్తారని ప్రశ్నించారు. ఉద్యోగులు ఆందోళన బాట పడితే ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దాసు మాట్లాడుతూ సమన్వయం చేసుకోవటం లేదని మంత్రులు అంటున్నార ని, ఉద్యోగులు చేపడుతున్న దీక్షలకు రావాల్సిందిగా వారిని కోరుతున్నామన్నారు. మీది న్యాయమో, మాది న్యాయమో తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు రావట్లేదని అంటున్నారని, అలా అన్నవారు ఇక్కడకు వస్తే సమాధానాలు చెబుతామన్నారు. 



Updated Date - 2022-01-28T06:22:53+05:30 IST