మహాగ్రహం

ABN , First Publish Date - 2022-01-26T05:09:03+05:30 IST

రివర్స్‌ పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమానికి దిగిన ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్లు సమ్మె నోటీసు ఇచ్చిన మరుసటిరోజే ఆందోళన ఉధృతం చేశారు.

మహాగ్రహం
కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాకు హాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు


కదంతొక్కిన ఉద్యోగులు, 

ఉపాధ్యాయులు, పెన్షనర్లు

ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద 

పీఆర్సీ సాధన సమితి భారీ ధర్నా

ప్రభుత్వ తీరుపై మండిపాటు

సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు

పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని

ముక్తకంఠంతో డిమాండ్‌

నేడు అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతులు

రివర్స్‌ పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చేపట్టిన ఉద్యమం మహోధృతమైంది. సమ్మె నోటీసు ఇచ్చిన మరుసటి రోజే నిరసనాగ్రహం పెల్లుబికింది. రాష్ట్రస్థాయి పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన మహాధర్నాతో ఒంగోలులోని కలెక్టరేట్‌ ప్రాంతం దద్దరిల్లింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చి పాల్గొన్నారు. అంతకు ముందు ఆయా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలతో కదం తొక్కారు. మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా పెద్దసంఖ్యలో అటు ర్యాలీలతోపాటు, ఇటు ధర్నాలో పాల్గొన్నారు. రివర్స్‌ పీఆర్సీ రద్దు చేయాలని, ఐఆర్‌ కన్నా అధికంగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, హెచ్‌ఆర్‌ఏ పాతశ్లాబ్‌లు కొనసాగించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని ఆందోళనకారులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. 



ఒంగోలు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి/కలెక్టరేట్‌) : రివర్స్‌ పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమానికి దిగిన ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్లు సమ్మె నోటీసు ఇచ్చిన మరుసటిరోజే ఆందోళన ఉధృతం చేశారు. రాష్ట్రస్థాయి పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. విధులకు సెలవులు పెట్టి ఒంగోలుతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తరలివచ్చి పాల్గొన్నారు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. దీంతో కలెక్టరేట్‌కు వచ్చే రోడ్లన్నీ కిక్కిరిశాయి. జిల్లాస్థాయి ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు కె.శరత్‌బాబు, కృష్ణమోహన్‌, మాధవి, ఉపాఽధ్యాయ సంఘాల నేతలు ఎస్‌.రవి, వీరారెడ్డి, ఐ.విజయసారథి, అశోక్‌కుమార్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధి పిన్నిక మధుసూదన్‌తోపాటు వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నేతలు ధర్నాకు నేతృత్వం వహించారు. ధర్నాలో  ఉద్యోగ సంఘాల నాయకులు విద్యాసాగర్‌రెడ్డి, మంజుల, జాలా రామయ్య, ఎం.వెంకటేశ్వర్లు, చింతా శేషుబాబు ఖాదర్‌బాషా, కొత్తపల్లి మంజేష్‌, ఏడుకొండలు, తోట శ్రీనివాసరావు, మాధవి, లక్ష్మయ్య, రత్నాకర్‌బాబు, ప్రసాద్‌, కోమటిగుంట వెంకటేశ్వర్లు, రవితేజ, పి.వివేకానంద, సత్యనారాయణ, రామ్మోహన్‌, రమణారెడ్డి, ఎస్‌డీరసూల్‌,విజయనిర్మల పాల్గొన్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా కొనసాగింది.  ఇదిలా ఉండగా ఆందోళనలు కొనసాగింపులో భాగంగా రిపబ్లిక్‌ డే పురస్కరించుకొని బుధవారం జిల్లా వ్యాప్తంగా పాత తాలూకా కేంద్రాలలో నిరసనలు, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు నేతలు తెలిపారు. 


సమ్మెనోటీసు ఇచ్చిన మరుసటి రోజే ఉధృతం

ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీలో పేర్కొన్న ప్రకారం ఇప్పటి వరకు వస్తున్న వేతనాలు, అలవెన్స్‌లు, పెన్షన్లు తగ్గిపోతున్నాయని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ రివర్స్‌ పీఆర్సీ జీవోలు రద్దు చేసి మొత్తం పీఆర్సీని సమీక్షించి సవరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రస్థాయిలో ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా సమ్మెకు సిద్ధమయ్యాయి. వచ్చేనెల 6వతేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించిన పీఆర్సీ సాధన సమితి ఆమేరకు సోమవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చింది. ఈలోపు దశల వారీ ఆందోళనకు షెడ్యూల్‌ ఇచ్చిన సాధన సమితి అందులో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ వద్దభారీ ధర్నాలకు పిలుపునిచ్చింది. ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా చేపట్టగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భారీగా పాల్గొన్నారు.


ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల భారీ ర్యాలీలు 

ధర్నాకు ముందు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఒంగోలులో భారీ ర్యాలీలు నిర్వహించాయి. స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌ ఎదురుగా ఉన్న యూటీఎఫ్‌ ఆఫీసు, ధారావారితోటలోని ఏపీటీఎఫ్‌ కార్యాలయాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ప్రదర్శనగా కలెక్టరే ట్‌ వద్దకు చేరుకున్నారు. మరోవైపు ఎన్‌జీవో భవన్‌ నుంచి వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు వందలాది మంది ర్యాలీగా వచ్చారు. అలాగే సంక్షేమ, పంచాయతీరాజ్‌, హౌసింగ్‌ తదితర శాఖల అసోసియేషన్ల నేతృత్వంలో ఉద్యోగులు ప్రదర్శనగా తరలిరావడంతో కలెక్టరేట్‌ ప్రాంతమంతా నిరసనకారులతో కిటకిటలాడింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు తక్షణం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు.


మా సత్తా ఏమిటో చూపిస్తాం

ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నేతల మండిపాటు

ప్రభుత్వం రివర్స్‌ పీఆర్సీ జీవోలను రద్దు చేయకపోతే  సత్తా ఏమిటో చూపిస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా ల నేతలు హెచ్చరించారు. మహాధర్నాకు అధ్యక్షతన వహించిన ఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శరత్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన చీకటి జీవోలను రద్దుచేయాలని డిమాం డ్‌ చేశారు. 27శాతం తగ్గకుండా పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

 ఏపీఆర్‌ఎ్‌సఎ జిల్లా అధ్యక్షుడు ఆర్‌వీఎస్‌ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ అశుతోష్‌ మిశ్రా నివేదిక ఆధారంగానే పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. హేతుబద్ధత లేని కమిటీ ఇచ్చిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా హెచ్‌ఆర్‌ఏ విధానాన్ని పాతపద్ధతిలోనే కొనసాగించాలన్నారు. తాము చేస్తున్న ఉద్యమానికి ఏరాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు చేస్తున్నది ప్రజా  ఉద్యమం అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించకపోతే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.

ఏపీజీఈఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎండ్లూరి చిట్టిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమాన్ని, ఆవేదనను తెలుసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

యూటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా వలంటీర్ల ద్వారా కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయించడం దుర్మార్గంగా ఉందన్నారు. ఇలాంటి చర్య సరికాదన్నారు. 

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకురాలు కేవీజీ కీర్తి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏఉద్యమం జరిగినా అంతిమంగా ఉద్యోగులే గెలిచారన్నారు. ప్రభుత్వం ఇదే విధానాలను కొనసాగిస్తే సమ్మె తప్పదని హెచ్చరించారు. 




Updated Date - 2022-01-26T05:09:03+05:30 IST