Advertisement
Advertisement
Abn logo
Advertisement

పీఆర్సీ..డీఏ బకాయిల మాటేంటి..?

ఉద్యోగ సంఘాల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం
ఉద్యోగుల ఆరోగ్య బీమాతో ప్రయోజం లేదు
టీచర్ల డిప్యుటేషన్లపై విచారణ చేపట్టాలి
కొవిడ్‌ మృతుల కుటుంబాలకు ప్రయాజనాలందించాలి
16 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరు

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 30 : ఉద్యోగులకు 55 శాతం ఫిట్‌మెంట్‌తో 2018 జూలై ఒకటవ తేదీ నుంచి వర్తించేలా పీఆర్సీని అమలు చేయాలని, డీఏ బకాయిలు చెల్లించాలన్న ఉమ్మడి డిమాండ్లను జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ (జేఎస్‌సీ) సమా వేశంలో ఎన్జీవో సభ్య సంఘాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లేవనెత్తారు. ఉద్యోగుల సమస్యలపై మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశానికి జెఎస్‌సిలో శాశ్వత సభ్యత్వం ఉన్న 16 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులు హాజరయ్యారు. డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్‌ రద్దు, హెల్త్‌ కార్డులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు, ఏపీజిఎల్‌ఐ, జీపీఎఫ్‌, రుణాల మంజూరులో జాప్యం వంటి సమస్యలను ప్రస్తావించి, పరిష్కారానికి డిమాండ్‌ చేశారు. పలు సమస్యలపై జేసీ అంబేడ్కర్‌, డీఆర్వో డేవిడ్‌ రాజులకు వినతిపత్రాలను అంద జేశారు. ఉద్యోగుల సమస్యలపై డిసెంబర్‌ 12లోగా రాష్ట్రస్థాయి సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించనున్నారని సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని జేసీ వివరించారు. సమావేశం ముగింపులో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కొద్దిసేపు పాల్గొన్నారు.సమావేశంలో ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.శ్రీధర్‌రాజు, ఏపీ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వీరవల్లి వీరాస్వామి, నెరుసు సత్యనారాయణ, ఏపీ లైవ్‌ స్టాక్‌ అసిస్టెంట్స్‌ సర్వీస్‌ అసోసి యేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ప్రదీప్‌కుమార్‌, ఎస్‌.బి.సతీష్‌రెడ్డి, ఏపీ వాణిజ్య పన్నుల ఉద్యోగుల సంఘం నాయకులు టి.జె.శేషుకుమార్‌, వి.శివప్రసాద్‌, ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమణారావు, పి.శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడారు.
 

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం పెట్టండి 
ఆర్‌.ఎస్‌.హరనాథ్‌, జిల్లా అధ్యక్షుడు, ఏపీ ఎన్జీవోల సంఘం
ఉద్యోగుల ఆరోగ్య బీమా(ఈహెచ్‌ఎస్‌) పథకం కోసం ఏటా రూ. 225 కోట్లు ప్రీమియం సొమ్ముగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల జీతాల నుంచి ప్రభుత్వం మినహాయించుకుంటోంది. ఆరోగ్యశ్రీ భాగస్వామ్య ఆసుపత్రుల్లో కన్ను, పన్ను, ఎముకలకు సంబంధించి మాత్రమే వైద్యం చేస్తూ, మిగతా రోగాలు, జబ్బులకు చికిత్సను నిరాకరిస్తున్నారు.ఉద్యోగుల నుంచి వసూలు అవుతున్న ప్రీమియం సొమ్ముకు సమానంగా ప్రభుత్వం మరో రూ. 225 కోట్లు వెచ్చిస్తే కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్సలను నేరుగా పొందవచ్చు. టి.నర్సాపురం పీహెచ్‌సీలో ఫార్మాసిస్టుగా పనిచేస్తూ గతేడాది మృతి చెందిన సాదు రాజారావుకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రూ. 50 లక్షల పరిహారం ఇంతవరకు చెల్లించలేదు. ఏడాది దాటినా ఆ కుటుంబంలో మృతుని కుమారుడికి కారుణ్య నియామకపు ఉత్తర్వులు ఇవ్వలేదు.  

ఒకటో తారీఖునే జీతాలు చెల్లించాలి
సీహెచ్‌ శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
నెలనెలా ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్‌ ఆదేశాలను జిల్లాలో దిగువస్థాయి ఉద్యోగులు అమలు చేయడం లేదు. భీమవరం ప్రభుత్వ బాలిక వసతి గృహంలో పనిచేస్తోన్న కుసుమ కుమారి అనే ఉద్యోగిని ఎదుర్కొంటున్న ఇంక్రిమెంట్‌ బిల్లు సమస్య పరిష్కారానికి కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినా నరసాపురం బీసీ సంక్షేమాధికారి చర్యలు తీసుకోకుండా వ్యక్తిగతంగా ఉద్యోగినిని వేధిస్తున్నారు. వయసు పైబడిన పెన్షనర్లకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అడిషినల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ సకాలంలో విడుదల చేయాలి.

ఆ... కుటుంబాలకు ప్రయోజనాలేవీ..
నారాయణ, రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు
పాఠశాలల్లో ఉదయం 9 గంటలకు ప్రార్ధన జరగాల్సి ఉండగా, ఆ సమయానికే టాయిలెట్‌ పరిశుభ్రత, గుడ్లు, చిక్కీల పంపిణీ వంటి అంశాల్లో 44 రకాల ఫొటోలు వివిధ యాప్‌లలో అప్‌లోడ్‌ చేసేలా టీచర్లపై భారాన్ని నెట్టివేశారు. దీనికి కనీసం గంట నుంచి గంటన్నర పడుతోంది. ముఖ్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో యాప్‌లలో ఫొటోలు అప్‌లోడ్‌ చేయడంతోనే సరిపోతుం డడం వల్ల బోధన జరగడం లేదు. జిల్లాలో 60 మంది టీచర్లు కొవిడ్‌ వల్ల చనిపోగా వారికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాల బిల్లులు ప్రాసెస్‌ అయినప్పటికీ ఖాతాల్లో ఇంతవరకు నిధులు జమకాలేదు.

రుణాలు మంజూరు కాలేదు
గోపిమూర్తి, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి
చింతలపూడి మండలంలో 40 పాఠశాలలు, నరసాపురం మండలంలో 45 పాఠ శాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న టీచర్లు యాప్‌ లలో ఫొటోలు అప్‌లోడ్‌ చేయడానికే సమయం సరిపోతుంది. బోధనకు అవకాశం ఉండడం లేదు. ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్‌ రుణాలకు దరఖాస్తు పెట్టుకున్నా సకాలంలో మంజూరుకాక పిల్లల పెళ్లిళ్లు అవడంతో పాటు పిల్లలు పుట్టినప్పటికీ రుణాలు మంజూరు చేయకపోవడం విచారకరం. ఏలూరు మునిసిపాలిటీలో నగరపాలక సంస్థ డీవైఈవో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ టీచర్లను ఇష్టానుసారంగా డిప్యూటేషన్లు, మ్యూచువల్‌ బదిలీలు చేస్తుండడంపై విచారణకు ఆదేశించాలి.

డిప్యుటేషన్లపై విచారణ చేపట్టాలి
జి.కృష్ణ, ఏపీటీఎఫ్‌–1938 జిల్లా ప్రధాన కార్యదర్శి
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్‌ను అక్కడి నుంచి డిప్యూటేషన్‌పై బదిలీ చేసి మరో టీచర్‌ను ఆ పాఠశాలలో నియమించడం ద్వారా డీఈవో ఉల్లంఘనలకు పాల్పడు తున్నారు. ఇష్టానుసారంగా డిప్యూటేషన్లు వేస్తున్నారు. తక్షణమే జిల్లా విద్యాశాఖలో డిప్యూటేషన్లపై విచారణ చేపట్టాలి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పదోన్నతుల కౌన్సె లింగ్‌లో కొందరు ఉపాధ్యాయులకు ఫోన్‌లోనే ఆప్షన్లు తీసుకుని పదోన్నతి స్థానాలను కేటాయించడం ద్వారా డీఈవో నిబంధనలను ఉల్లంఘించారు. సబ్జెక్టుల వారీగా పదో న్నతి జాబితాలను తయారు చేయడంలో కూడా జిల్లా విద్యాశాఖాధికారులు నిబంధ నలను ఉల్లంఘించారు.

జనవరి నుంచి సమ్మెకు సిద్ధం 
కె.రమేష్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం
పీఆర్సీ, డీఏలపై ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) చేపట్టిన దశల వారీ కార్యాచరణకు ప్రభుత్వం స్పందించకపోతే జనవరి నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు మధ్యంతర భృతి వర్తింప చేయకపోవడం దురదృష్టకరం. 45 ఏళ్ల వయసు దాటిన ఉద్యోగులు చనిపోతే కుటుంబ సభ్యులకు ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్‌ను ఇటీవల జారీచేసిన జీవో 152 ఉత్తర్వులతో రద్దు చేశారు. ఇలా చేస్తే మరణించిన ఉద్యోగులపై ఆధారపడిన కుటుంబ సభ్యులు బతికేదెలా..?

ఆ.. కాలనీకి కలెక్టర్‌ పేరు పెడతాం 
ఎల్‌.విద్యాసాగర్‌, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
90 సంవత్సరాల చరిత్ర గల జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న వివిధ విభాగాల మహిళా ఉద్యోగులకు మరుగుదొడ్లు, డైనింగ్‌ హాలు లేకపోవడం విచారకరం. తక్షణమే వాటిని ఏర్పాటు చేయాలి. 2002వ సంవత్సరంలో కొత్తగా ఏర్పాటైన జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజినల్‌ ఆఫీసర్‌ (ఆర్డీవో) కార్యాలయానికి ఇంతవరకు పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకాలు లేవు. ఇప్పటికీ డీఏవో పోస్టును కేటాయించలేదు. కేవలం ఒకే ఒక్క డిప్యూటీ తహసీల్దార్‌ కేడర్‌ సూపరింటెండెంట్‌ పోస్టు మాత్రమే ఉంది. జిల్లాలో 16 నెలలుగా వివిధ శాఖల కన్సాలిడేటెడ్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగుల్లో అర్హులైన వారందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు కాలేదు. ఇప్ప టికైనా కలెక్టర్‌ స్పందించి అర్హులైన వారందరికీ ఇళ్లస్థలాలు ఇస్తే దానికి డాక్టర్‌ కార్తికేయ మిశ్రా ఎంప్లాయిస్‌ కాలనీగా నామకరణం చేస్తాం.
Advertisement
Advertisement