లాక్‌డౌన్ ఖర్చులపై యజమాని దారుణం.. జననాంగాలపై శానిటైజర్ పోసి..

ABN , First Publish Date - 2020-07-06T21:36:05+05:30 IST

మహారాష్ట్రలోని కొత్తూడ్‌లో దారుణం చోటుచేసుకుంది. విధి నిర్వహణ కోసం ఢిల్లీ వెళ్లి లాక్‌డౌన్‌లో చిక్కుకున్న ఓ ఉద్యోగి..

లాక్‌డౌన్ ఖర్చులపై యజమాని దారుణం.. జననాంగాలపై శానిటైజర్ పోసి..

ముంబై: మహారాష్ట్రలోని కొత్తూడ్‌లో దారుణం చోటుచేసుకుంది. విధి నిర్వహణ కోసం ఢిల్లీ వెళ్లి లాక్‌డౌన్‌లో చిక్కుకున్న ఓ ఉద్యోగి.. ఖర్చుల కోసం కంపెనీ డబ్బులు వాడడంపై అతడి యజమాని అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. తన అనుచరులతో కలిసి అతడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టాడు. గతనెల 13, 14 తేదీల మధ్యే ఈ ఘటన జరిగినప్పటికీ.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. పుణే కేంద్రంగా వివిధ కళాకారులు వేసిన పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్లు నిర్వహించే కంపెనీలో బాధితుడు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ పని నిమిత్తం మార్చి నెలలో ఢిల్లీ వెళ్లిన అతడు.. కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకున్నాడు. ఓ లాడ్జిలో ఉంటూ ఖర్చుల కోసం కంపెనీ ఇచ్చిన డబ్బులు వాడుకున్నాడు.


మే 7న అతడు ఢిల్లీ నుంచి తిరిగి రావడంతో.. క్వారంటైన్ కోసం 17 రోజుల పాటు ఓ హోటల్‌లో ఉండాలంటూ యజమాని పేర్కొన్నాడు. అయితే బాధితుడి వద్ద డబ్బులు లేకపోవడంతో హోటల్‌లో తన ఫోన్, డెబిట్ కార్డును తాకట్టుపెట్టాడు. క్వారంటైన్ నుంచి బయటికి వచ్చాక కంపెనీ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ యజమాని డిమాండ్ చేసినట్టు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ‘‘యజమాని, అతడి అనుచరులు బాధితుడిని కిడ్నాప్ చేసి కంపెనీ ఆఫీసుకు తీసుకెళ్లారు. అతడిపై భౌతికదాడికి దిగి తీవ్రంగా కొట్టారు. జననాంగాలపై శానిటైజర్ స్ప్రే చేశారు...’’ అని అధికారులు వెల్లడించారు. యజమాని విడిచిపెట్టాక ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన బాధితుడు... చివరికి ఈ నెల 2న పోలీసులను ఆశ్రయించాడు. దీంతో యజమాని, అతడి స్నేహితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

Updated Date - 2020-07-06T21:36:05+05:30 IST