డేటా పంపేందుకు ఉద్యోగుల విముఖత

ABN , First Publish Date - 2022-01-29T06:45:31+05:30 IST

కొత్త పీఆర్సీతో వేతనాలు తీసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ససేమిరా అంటున్నారు.

డేటా పంపేందుకు ఉద్యోగుల విముఖత
ఖజానా డీడీకి వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగ సంఘ నేతలు

50వేల మందికిగాను 

2006 మందే ముందుకు

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 28: కొత్త పీఆర్సీతో వేతనాలు తీసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. డేటాను కూడా ఖజానా శాఖకు పంపేందుకు నిరాకరిస్తున్నారు. సర్వీసు రిజిస్టర్ల పరిస్థితి కూడా అంతే. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన  పీఆర్సీకి అనుగుణంగా జనవరి నెల జీతాలు ఫిబ్రవరి 1న చెల్లించే విధంగా సిద్ధం కావాలని ట్రెజరీ శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వేతనాల చెల్లింపులు జరగాలంటే ఉద్యోగుల డేటాతో పాటు వారి సర్వీస్‌ రిజిస్టర్లను కూడా పరిశీలించిన తరువాతే జీతం బిల్లులు తయారు చేయాలి. వాటిని అకౌంటెంట్‌ తరువాత ఎస్టీవో పరిశీలించి ప్రొసీడింగ్స్‌ చేసి బిల్లులను పుటప్‌ చేయాలి. తక్కువ వ్యవధిలో ఇది జరగడం అసాఽధ్యం. మరోవైపు తమ శాఖ ఉద్యోగుల నుంచి వివరాలు ఖజానాకు పంపాలని 1592 మంది డ్రాయింగ్‌ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది.జిల్లాలోని 50607 మంది ఉద్యోగులకు జనవరి నెల జీతాలకు రూ.225 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.మరోవైపు జనవరి నెల బిల్లుల తయారికి శుక్రవారంతో గడువు పూర్తికావడంతో ఉద్యోగుల వేతనాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఖజానా ఉద్యోగుల జీతాల బిల్లులు శుక్రవారం నుంచి సిద్ధం చేస్తున్నట్లు సమాచా రం. కాగా పోలీస్‌ శాఖకు చెందిన 2వేల మందికి పైగా సిబ్బంది కలెక్టరేట్‌లోని ఖజానా కార్యాలయానికి, చిత్తూరుఎస్టీవో కార్యాలయానికి తమ ఎస్‌ఆర్‌లతో వచ్చి అధికారులను కలిసినట్లు తెలిసింది. 

పాత వేతనంతో ఐదు డీఎల బకాయిలివ్వండి

పెండింగ్‌లో ఉన్న ఐదు పాత డీఎలతో పాటు పాత పీఆర్సీ ప్రకారం వేతనాలను చెల్లించాలని శుక్రవారం జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘ నేతలు డిమాండ్‌చేశారు. ఈ మేరకు ఖజానా శాఖ డీడీ గంగాద్రిని నేతలు నరేష్‌, శరత్‌కుమార్‌, శ్రీధర్‌, మనోజ్‌, కుప్పుస్వామిలు కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు.

పీఆర్సీ సాధన సమితి స్ట్రగుల్‌ కమిటీ నేత రాక

 జిల్లావ్యాప్తంగా పీఆర్సీ సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు  చేస్తున్న నిరసన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర పీఆర్సీ సాధన సమితి స్ట్రగుల్‌ కమిటీ రెండేసి జిల్లాలకు నలుగురు రాష్ట్రస్థాయి నాయకులను నియమించింది. చిత్తూరు, కడప జిల్లాలకు కేవీ శివారెడ్డి, మిట్టా కృష్ణయ్య, నారాయణరెడ్డి, ట్రెజరీ రవికుమార్‌ నియమితులయ్యారు. శనివారం చిత్తూరులో జరిగే రిలే దీక్షా కార్యక్రమంలో ట్రెజరీ రవికుమార్‌ స్ట్రగుల్‌కమిటీ ఆధ్వర్యంలో వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు.

Updated Date - 2022-01-29T06:45:31+05:30 IST